Platinum Jewellery: ప్రస్తుతం బంగారానికి ప్రత్యామ్నాయం ప్లాటినమే
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:00 AM
బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. అదే సమయంలో బంగారానికి ప్రత్యామ్నాయంగా కొందరు భావించే ప్లాటినం ధర స్థిరంగానే ఉంది. ప్రస్తుతం...
బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. అదే సమయంలో బంగారానికి ప్రత్యామ్నాయంగా కొందరు భావించే ప్లాటినం ధర స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం ధరతో మూడు గ్రాముల ప్లాటినం కొనవచ్చు. పెరుగుతున్న బంగారం ఽనగల ధరల వల్ల ఎక్కువ మంది యువతీయువకులు ప్లాటినం వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ డిప్యూటీ కంట్రీ మేనేజర్ పల్లవి శర్మ. ప్లాటినం గురించి ఆమె చెప్పిన విశేషాలివే..
మన దేశంలో ప్లాటినం మార్కెట్ ఎలా ఉంది? మన మహిళలు ప్లాటినం ఆభరణాలు కొంటున్నారా?
మన దేశంలో ప్లాటినం ఆభరణాలను కొనేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా యువతీయువకులు ఈ ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలను చెబుతాను. ప్లాటినం ఆభరణాలను (అంటే ఉంగరాలు, బ్రాస్‌లెట్స్ వంటివి) పురుషులు ఎక్కువగా కొంటారు. జంటగా ఇద్దరు ఒకే విధమైన ఆభరణాలు కొనాలనుకున్నవారు కూడా ప్లాటినం వైపే మొగ్గు చూపుతారు. అయితే ఈ మధ్యకాలంలో మహిళలు కూడా ప్లాటినం ఆభరణాల వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం- ప్లాటినంలో 95 శాతం స్వచ్ఛత ఉండటం. ఇక రెండోది వజ్రాలను పొదిగితే చాలా అందంగా కనిపించటం. ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాలను చూస్తే- గత ఏడాది కన్నా 15 శాతం అమ్మకాలు పెరిగాయి.
మన దేశంలో బంగారాన్ని శుభశుచకంగా భావిస్తారు. అలాంటి బంగారంతో ప్లాటినం పోటీ పడగలదా?
మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారం ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పెళ్లిళ్లలో అందరం బంగార నగలను ధరించటానికే ఇష్టపడేవారు. అయితే ఈ మధ్యకాలంలో యువతీయువకుల అభిరుచులు మారుతున్నాయి. పెళ్లిళ్లలో పెట్టుకొనే నగలను లాకర్‌లో పెట్టి భద్రపరచాలని అనుకొనేవారి సంఖ్య తగ్గుతోంది. ఆ ఆభరణాలను పెళ్లి తర్వాత ప్రతి రోజు ధరించాలనుకుంటున్నారు. తల్లితండ్రుల అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. బంగారానికి ప్రత్యామ్నాయం కావాలని భావించేవారందరూ ప్లాటినం నగలను కొనుగోలు చేస్తున్నారు. ప్లాటినం తెల్లగా ఉంటుంది. దీనితో కూడా రకరకాల ఆభరణాలు డిజైన్లు అందుబాటులోకి వస్తున్నాయి.
బంగారపు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కదా... దీని ప్రభావం ప్లాటినంపై ఉందా?
తప్పకుండా ఉంది. బంగారం, వెండిల ధరలు పెరగటం వల్ల ఆభరణాలు కొనే సమయంలో వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. బంగారం కన్నా తక్కువ ధర ఉండటం వల్ల కొందరు వినియోగదారులు ప్లాటినం ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్లాటినం ధర పెరుగుతుందనే భావన వారిలో ఉంది.
ప్లాటినం ఆభరణాల స్వచ్ఛత 95 శాతం ఉంటుంది. అందువల్ల ఒక వేళ వీటిని తిరిగి విక్రయించినా ఎక్కువ సొమ్ము లభిస్తుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రముఖ దుకాణాలలోను ప్లాటినం ఆభరణాలు లభిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News