Ayurvedic: జీవం నింపే పాలతీగ
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:21 AM
మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప కూరల్లో పాలతీగ కూడా ఒకటి. ఈ కూరకు అనేక విశిష్టతలు ఉన్నాయని కనుగొన్న మన పూర్వీకులు - దీనికి ‘జీవంతి’ అనే పేరు పెట్టారు.
భోజనకుతూహలం
మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప కూరల్లో పాలతీగ కూడా ఒకటి. ఈ కూరకు అనేక విశిష్టతలు ఉన్నాయని కనుగొన్న మన పూర్వీకులు - దీనికి ‘జీవంతి’ అనే పేరు పెట్టారు. జీవంతి అంటే ప్రాణాన్ని ఉద్దేపన చేసేది అని అర్ధం. ఈ మొక్కనే ముక్కు పాలతీగ, ముక్కుతుమ్ముడు తీగ, గుత్తి పాలతీగ, పలవల తీగ, నందిని తీగ అని కూడా పిలుస్తారు. పాలకూర, పాలతీగ ఒకే జాతికి చెందినవైనా ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ మొక్కను . హిందీలో డోరి అని, కన్నడలో హాలి బల్లి అని, తమిళంలో పలైకిరై లేదా పలైక్కోడి అని పిలుస్తారు. ఈ మొక్కకున్న విశిష్టతలను గమనిస్తే..
ఆయిర్వేద గ్రంధాలు ఈ మొక్కను బృంహణీయ ద్రవ్యంగా పేర్కొన్నాయి. అంటే ఈ మొక్క కండపుష్టి కలిగించేదని అర్ధం.
ఈ తీగ ఆకులు చిరు తీపిని కలిగి ఉంటాయి. వీటిని తింటే రక్తస్రావం ఆగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
క్షయవంటి వ్యాధుల నివారణకు ఈ ఆకులు ఎంతో ఉపకరిస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి మంటలను నియంత్రిస్తాయి.
ఈ ఆకులు క్రమం తప్పకుండా తింటే పురుషుల్లో జీవకణాలు పెరుగుతాయి. హార్మోన్ల నియంత్రణకు కూడా ఈ మొక్క ఆకులు ఉపకరిస్తాయి.
గ్రామీణ ప్రాంతాల్లో బాలింతలకు ఈ ఆకులను వండిపెడతారు. దీని వల్ల పిల్లలకు తగినన్ని పాలు లభిస్తాయి.
నీళ్ల విరోచనాలు తగ్గించటంలో పాలతీగ బాగా పనిచేస్తుంది.
కంటి వ్యాధుల నివారణకు కూడా పాల ఆకు మంచిది.
ఈ ఆకులు అలసటను తగ్గిస్తాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులు చేసేవారు ఈ ఆకులను ఎక్కువగా తింటూ ఉంటారు.
పాలతీగ ఆకులే కాకుండా.. లేత తీగలు, పువ్వులు, కాయలు కూడా మంచివే! వీటిని కూరల్లో వాడుకోవచ్చు.
పాలకూరతో తయారుచేసే వంటలన్నీ పాలతీగతో కూడా చేయవచ్చు. పాలతీగ పిందెలతో కూర చాలా రుచిగా ఉంటుంది.
గంగరాజు అరుణాదేవి