Share News

Palak Muchhal: పాటతో ప్రాణం పోస్తోంది

ABN , Publish Date - Nov 17 , 2025 | 06:10 AM

బాలీవుడ్‌ గాయని పలక్‌ ముచ్చల్‌ ఏకంగా 3,800 మంది నిరుపేద పిల్లల గుండె సర్జరీలకు నిధులు సేకరించి, గిన్నిస్‌ పుస్తకంలో స్థానం సంపాదించింది. సేవా ధృక్పథం కలిగిన ఈ గాయని గురించిన...

Palak Muchhal: పాటతో ప్రాణం పోస్తోంది

వినూత్నం

బాలీవుడ్‌ గాయని పలక్‌ ముచ్చల్‌ ఏకంగా 3,800 మంది నిరుపేద పిల్లల గుండె సర్జరీలకు నిధులు సేకరించి, గిన్నిస్‌ పుస్తకంలో స్థానం సంపాదించింది. సేవా ధృక్పథం కలిగిన ఈ గాయని గురించిన ఆసక్తికరమైన విశేషాలు...

గాయని పలక్‌ ముచ్చల్‌ తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని పొందింది. తన అసాధారణమైన సేవా గుణంతో, 3,800 మంది నిరుపేద పిల్లల గుండె సర్జరీలకు ఆర్థికంగా సహాయపడి, గిన్నిస్‌ పుస్తకంలో చోటు దక్కించుకుంది. తన సోదరుడు పల్‌షతో కలిసి పలక్‌ పలష్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ను నడిపిస్తూ, మరో వైపు, తన గాన ప్రదర్శనల్లో వసూలయ్యే డబ్బులో సింహభాగాన్ని దేశ వ్యాప్త నిరుపేద పిల్లల గుండె శస్త్రచికిత్సల కోసం ఖర్చు పెడుతోంది. పలక్‌ది మధ్యతరగతి కుటుంబం. 1992, మార్చి 30న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమిత ముచ్చల్‌, రాజ్‌కుమార్‌లకు పుట్టిన పలక్‌ నాలుగేళ్ల వయసులోనే పాటలు పాడడం మొదలుపెట్టింది. గుండె జబ్బులతో బాధపడే నిరుపేద పిల్లలకు ఆర్థికంగా సహాయపడాలనే సంకల్పంతో, 2000 సంవత్సరం నుంచి తన సోదరుడితో కలిసి మన దేశంతో పాటు విదేశాల్లో గాన ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టింది. ఇలా పలక్‌, గుండె జబ్బులతో బాధపడే పిల్లల చికిత్సే లక్ష్యంగా ఎంచుకోడానికి కారణం లేకపోలేదు.

కార్గిల్‌ సైనికులు, గుజరాత్‌ భూకంప

బాధితులు

ఒక సందర్భంలో రైల్లో ప్రయాణిస్తున్న పలక్‌కు భిక్షాటన చేస్తున్న నిరుపేద పిల్లలు కనిపించారు. వాళ్లను చూడగానే ఆమె మనసు కదిలిపోయింది. వాళ్లకు చేతనైనంత సహాయం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. అందుకోసం తనకు భగవంతుడు ఇచ్చిన స్వరాన్నే వాడుకోవాలని అనుకుంది. మరీ ముఖ్యంగా గుండెజబ్బులతో ప్రాణాలు కోల్పోయే పిల్లలకు తన స్వరాన్ని అంకితం చేయాలనుకుంది. అప్పటి నుంచి గాన ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. 1999లో కార్గిల్‌ యుద్ధ సైనికుల కోసం ఇంటింటికీ తిరిగి పాటలు పాడి, నిధులను సేకరించింది. గుజరాత్‌ భూకంప బాధితుల కోసం తన పాటల ద్వారా పది లక్షల రూపాయలను సేకరించి, అందించింది. 2013లో 572 మంది పిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఏ ఒక్క నిరుపేద సంతానం కూడా ప్రాణాలు పోగొట్టుకోకూడదని పలక్‌ భావించింది. ‘ఒక్కోసారి మ్యూజిక్‌ కన్సర్ట్‌తో సమకూరే సంపాదన నిరంతరం పెరిగే పిల్లల చికిత్సలకు సరిపోదు. అలాంటప్పుడు అత్యవసరంగా సర్జరీ చేయవలసిన పిల్లలకు మొదట సర్జరీలను పూర్తి చేసేస్తూ ఉంటాం. ఒక్కోసారి ప్రదర్శనల కొరత ఏర్పడుతుంది.


అలాంటి సందర్భాల్లో, పొదుపు చేసుకున్న సొమ్మునే సర్జరీలకు వాడుతూ ఉంటాం’ అంటూ మీడియాకు వివరించిన పలక్‌, విరాళాలు అందించమని అభిమానులను, ప్రజలను కూడా అర్థిస్తూ ఉంటుంది. విరాళం వేలు, లక్షల్లోనే ఉండాలనే నియమమేమీ లేదు. మీ దగ్గర వంద రూపాయలున్నా, వాటిని కూడా విరాళమివ్వవచ్చు. అలాంటి వందలే కొన్ని వేల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలుగుతాయి’ అంటూ ప్రజలను, అభిమానులను చైతన్య పరుస్తోంది పలక్‌.

హిందీ హిట్స్‌తో...

2006లో ముంబయికి వలస వెళ్లిన పలక్‌, 2011లో దనాధన్‌ సినిమాలో పాటలు పాడడం ద్వారా హిందీ నేపథ్య గాయనిగా ఎదిగింది. మేరి ఆషికీ, కౌన్‌ తుఝె, ప్రేమ్‌ రథన్‌ ధన్‌ పాయో సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు పొందింది.

ఇవి కూడా చదవండి..

కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..

లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 17 , 2025 | 06:10 AM