మిమ్మల్ని మీరు పట్టించుకోండి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:31 AM
నీతా అంబానీ... ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ అర్ధాంగిగానే కాదు... సామాజిక కార్యకర్తగా, భరతనాట్య కళాకారిణిగా, ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ జట్టు అధిపతిగా...

నీతా అంబానీ... ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ అర్ధాంగిగానే కాదు... సామాజిక కార్యకర్తగా, భరతనాట్య కళాకారిణిగా, ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ జట్టు అధిపతిగా... సుపరిచితురాలు.
ఆరు పదులు దాటిన వయసులోనూ ఎంతో ఉత్సాహంగా, దృఢంగా కనిపించే ఆమె... వివిధ మాధ్యమాల ద్వారా నిత్యం స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా మహిళలు తమ గురించి తాము పట్టించుకోవాలని... ఫిట్‌నెస్ కోసం రోజుకు కనీసం ఓ అరగంట సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. శారీరక దారుఢ్యం ఆరోగ్యకర, ఆనందమయ జీవనానికి బాటలు వేస్తుందంటూ ఇటీవల ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఇల్లు, ఉద్యోగం, ప్రయాణం... నేటితరం మహిళలకు క్షణం తీరిక దొరకడంలేదు. ఉదయం మంచం దిగింది మొదలు... మళ్లీ నిద్రకు ఉపక్రమించేవరకు ఎడతెరిపిలేని పని. ఈ హడావుడిలో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే వయసు మీద పడ్డాక ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అందుకే మహిళలు తమ గురించి తాము ఆలోచించుకోవాలనేది నీతా అంబానీ మాట.
‘మహిళలు ఇంట్లో తమకు ఆఖరి ప్రాధాన్యం ఇచ్చుకొంటారు. కానీ ఇది సరైంది కాదు. ముఖ్యంగా యాభై దాటిన తరువాత ఆరోగ్యం, శరీరంపై శ్రద్ధ పెట్టాలి. ముప్ఫై ఏళ్లు పైబడినప్పటి నుంచీ ఆడవారు క్రమంగా కండరాల పటుత్వాన్ని కోల్పోతారు. ఎముకల సాంద్రత, సామర్థ్యం, చురుకుదనం తగ్గుతాయి. జీర్ణక్రియ, సమతుల్యత దెబ్బతింటాయి. వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాయామం తప్పనిసరి. నేను రోజుకు కనీసం అరగంట అందుకు కేటాయిస్తాను. వారంలో ఆరు రోజులు కచ్చితంగా వర్కవుట్స్ చేస్తాను. మీకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మీ శరీరం చెప్పేది వినండి. ఇవాళే వ్యాయామాలు ఆరంభించండి. ఈ వయసులోనా... అని వెనకడుగు వేయవద్దు. మన కోసం మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు?’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చెప్పుకొచ్చారు నీతా అంబానీ. అంతేకాదు... ‘అరవై ఒక్క ఏళ్ల వయసులో నేను చేయగలుగుతున్నానంటే మీరూ చేయగలరు’ అంటూ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఆరోగ్యకర జీవనం దిశగా మహిళలను ప్రోత్సహించేందుకు ఇటీవలే ‘హ్యాష్‌ట్యాగ్ స్ర్టాంగ్ హర్ మూవ్‌మెంట్’కు శ్రీకారం చుట్టారు.
శాకాహారి...
‘రిలయన్స్ ఫౌండేషన్’ చైర్మన్ అయిన నీతా... ఆహారం విషయంలో కచ్చితంగా ఉంటారు. ‘నేను పూర్తి శాకాహారిని. సేంద్రియమైన, ప్రకృతిసిద్ధమైన సమతుల ఆహారం తీసుకొంటాను. వాటిల్లో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకొంటాను. పంచదార, దాంతో చేసిన తీపి పదార్థాలు ముట్టుకోను.’ అంటారు నీతా. రోజూ ఉదయం బీట్‌రూట్ జ్యూస్ తాగుతారు. ఇది తన చర్మాన్ని తాజాగా ఉంచడానికి దోహదపడుతుందని ఓ ఇంటర్య్యూలో ఆమె చెప్పారు. మధ్యాహ్న భోజనంలో రకరకాల కాయగూరలు, ఆకుకూరలతో వండిన వంటలు, సూప్‌లు ఉంటాయి. ఉప్పు తక్కువగా వాడతారు. జంక్‌ఫుడ్‌కు దూరం. రాత్రిపూట కూడా మితాహారం తీసుకొంటారు.
‘వ్యాయామాలు, యోగావల్ల శారీరక దారుఢ్యమే కాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. రోజంతా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆలోచనలు సానుకూల ధోరణిలో సాగుతాయి. హ్యాపీ హార్మోన్లయిన ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఫిట్‌నెస్ అంటే కేవలం బరువులు ఎత్తడమే కాదు... అది మన దైనందిన జీవితానికి కావల్సిన శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది. నావరకైతే ఫిట్‌నెస్ అనేది నా మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకొని ఆడించడం... వారితో పోటీపడడం’ అంటారు నీతా.
నాట్యం ఒక భాగం...
నీతా అంబానీ ఫిట్‌నెస్ రొటీన్‌లో స్ర్టెంత్, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్‌తో పాటు యోగా ఉంటుంది. అప్పుడప్పుడు స్విమ్మింగ్, ఆక్వా ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తారు. ఎప్పుడైనా పర్యటనలకు వెళ్లినప్పుడు, జిమ్ అందుబాటులో లేనప్పుడు కూడా కనీసం రోజుకు ఐదారు వేల అడుగులకు తగ్గకుండా నడుస్తారు. ఫిట్‌నెస్ విషయంలో రాజీ ఉండదు. భరతనాట్యం కూడా ఆమె వర్కవుట్స్‌లో ఒక భాగం. ‘ఆరేళ్ల వయసులోనే నేను భరతనాట్యం మొదలుపెట్టాను. అప్పటి నుంచీ సాధన చేస్తూనే ఉన్నాను. ఇది కాళ్లకు బలాన్నిచ్చే మంచి వ్యాయామం’ అంటున్న ఆమె ‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్’లో పలుసార్లు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. పాఠశాల, కళాశాల స్థాయిల్లో సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు ఆమె 2023లో ఈ వేదికను ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో వివిధ అవార్డులు కూడా అందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Soundarya husband Raghu: ఆ విషయంపై నిజమేంటో తేల్చి చెప్పిన సౌందర్య భర్త..
KTR Drone Flying Case: కేటీఆర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ.. అసలు విషయం ఇదే..