Women Empowerment: ఆత్మస్థైర్యమే ఆయుధంగా...
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:59 AM
చిన్ననాటి కష్టాలు, పెళ్లి జీవితంలో హింసను ఎదుర్కొన్న నీతా... తానెదురైన బాధలను శక్తిగా మలుచుకున్నారు. ఇప్పుడు 13 బస్సుల యజమాని గా నిలిచి, ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు.

బాల్యమంతా కష్టాలు... వైవాహిక జీవితం క్షణక్షణం నరకం. 34 ఏళ్ల వయసులో ముగ్గురు పిల్లలతో వీధిన పడిన నీతా... విధిని ఎదిరించి నిలిచారు. పురుషుల ఆధిపత్యం ఉన్న రవాణా రంగంలో... పదమూడు బస్సుల యజమానిగా తనదైన గుర్తింపు సాధించారు. సమాజ సేవలో కూడా ‘నేను సైతం’ అంటున్న నీతా ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...
‘‘చిన్న వయసులో నా తోటి పిల్లలను చూస్తే నాకు చాలా అసూయగా ఉండేది. వారిలో వెల్లివిరిసే సంతోషం నాకు లేనందుకు బాధ కలిగేది. ఎందుకంటే... ఏ రోజూ రాత్రి మా అమ్మ చేతుల్లో తన్నులు తినకుండా, ఏడవకుండా నేను నిద్రపోలేదు. మా నాన్న రోజూ తాగి వచ్చి అమ్మను కొట్టేవాడు. అతణ్ణి ఎదిరించలేని నిస్సహాయతను అమ్మ నా మీద ప్రదర్శించేది. నేను పుట్టకపోయినట్టైతే... తను ఎప్పుడో ఈ లోకాన్ని వదిలేసేదాన్ని అని అనేది. నాకు ఆరేళ్ళ వయసున్నప్పుడు... నాన్న వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. నాన్న నన్ను పెంచలేనంటూ మా తాతయ్య ఇంట్లో వదిలేశాడు.
నిత్యం వేధింపులే...
మాది మహారాష్ట్రలోని ఒక పల్లెటూరు. బడికి వెళ్ళింది తక్కువే. అయితే చదవడం, రాయడం బాగానే నేర్చుకున్నాను. పెద్ద చదువులు చదివించే స్థోమత మా తాతయ్యకు లేదు. పధ్నాలుగేళ్ళ వయసులో నాకు పెళ్ళి చేసి భారం దించుకున్నారు. అప్పటికి నా భర్తకు ఇరవై రెండేళ్ళు. ఏడాదికే మొదటి బిడ్డను కన్నాను. ముంబయిలోని అత్తవారింటికి వెళ్ళాక... నా బతుకూ మా అమ్మలాగే అయింది. నా భర్త కూడా రోజూ తాగేసి వచ్చేవాడు. నన్ను నానా మాటలతో వేధించేవాడు. దురలవాట్ల కారణంగా అతనికి పని దొరికేది కాదు. దాంతో డిప్రెషన్‌కు గురయ్యాడు. మాకు ముగ్గురు పిల్లలు. ఒక మురికివాడలో మా నివాసం. కుటుంబ పోషణ భారం నా మీదే పడింది. ఒక స్కూల్లో ఆయాగా చేరాను. స్కూల్ బస్సులో పిల్లలను ఇళ్ళ దగ్గర నుంచి బడికి తీసుకువెళ్ళి, తిరిగి వారి ఇళ్ళ దగ్గర దింపడం నా బాధ్యత. ఆ సమయంలోనే తోటి ఆయాల దగ్గర స్కూటర్ నడపడం నేర్చుకున్నాను. నా ఉత్సాహం చూసి... స్కూల్ వ్యాన్లు, బస్సులు నడపడం అక్కడి డ్రైవర్లు నేర్పించారు. ఇదంతా నా భర్తకు నచ్చలేదు. ఆయా పని మానేయాలని గొడవ చేసేవాడు. నిత్యం శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఇదే పరిస్థితి కొనసాగితే... పిల్లల బతుకు కూడా నా మాదిరిగానే అవుతుందనుకున్నాను. వారికి మంచి భవిష్యత్తు కావాలంటే ఈ వాతావరణంలో వాళ్ళు పెరగకూడదనిపించింది. అలా పెళ్ళైన ఇరవై ఏళ్ళ తరువాత నా భర్తను విడిచి పెట్టాలని నిశ్చయించుకున్నాను.
ఎనిమిదేళ్ళ శ్రమ
భర్తను వదిలి వచ్చాక ఎన్నో ఇబ్బందులు ఎదురైనా... ఏనాడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. నేను నేర్చుకున్న డ్రైవింగ్ నాకు ఆసరాగా నిలిచింది. లైసెన్స్ తీసుకున్నాను. నేను పని చేస్తున్న స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి... వ్యాన్ డ్రైవర్‌గా కొత్త జీవితం మొదలుపెట్టాను. నా భర్త, అతని మిత్రులు నన్ను రకరకాలుగా వేధించారు. అనరాని మాటలెన్నో అన్నారు. డ్రైవర్‌గా పనిచేసే మహిళ అంటే సమాజానికి కూడా చిన్నచూపు ఉంటుంది. అయినా నేను కుంగిపోలేదు. పని ఉండని సమయాల్లో నా పిల్లలతో కలిసి చదువుకోవడం మొదలుపెట్టాను. బ్యాంక్ అధికారులను కలిసి, నా కథ చెప్పాను. వ్యాన్ కొనుగోలు చేయడానికి రుణం ఇవ్వాలని కోరాను. మా స్కూల్ యాజమాన్యం హామీతో రుణం మంజూరయింది. కొత్త ప్రయాణం ఆరంభమయింది. నా భర్తతో విడాకులు తీసుకున్నాను. పిల్లల చదువుకు, మేము జీవించడానికి అయ్యే ఖర్చులు మినహా... మిగిలిన డబ్బును పొదుపుచేశాను. అప్పును సకాలంలో తీర్చడంతో... బస్సు కొనుగోలుకు రుణం దొరికింది. అప్పుడే ‘శ్రీ నీతా ట్రావెల్స్’ పేరిట ఒక సంస్థను ప్రారంభించాను. దాదాపు ఎనిమిదేళ్ళపాటు నేను పడ్డ శ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు మా ట్రావెల్స్ ద్వారా పదమూడు బస్సులు నడుపుతున్నాను. ఎక్కువశాతం బడిపిల్లల కోసమే తిరుగుతాయి. వాటిద్వారా ముప్ఫై మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాను.
ధైర్యంగా నిలబడాలి...
మరోవైపు నేను నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరింది. నా పిల్లలు బాగా చదువుకున్నారు. మా అబ్బాయి కెనడాలో స్థిరపడ్డాడు. అమ్మాయిలిద్దరూ నాకు వ్యాపారంలో సాయం చేస్తున్నారు. నేను డిగ్రీ పూర్తి చేశాను. మా ట్రావెల్స్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలు నేనే చూస్తాను. ‘నీతా ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను స్థాపించి... పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పుడు నన్ను కలిసే అమ్మాయిల్లో చాలామంది నేనే వారికి స్ఫూర్తి అని చెబుతూ ఉంటారు. మీలా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటామంటారు. ధైర్యంగా నిలబడితే అనుకున్నవి సాధించగలమని నేను చెబుతాను. పెళ్ళి అనేది మహిళలకు అంతిమ గమ్యంగా సమాజం పరిగణిస్తుంది. వైవాహిక జీవితంలో హింసకు గురైనవారిలో ఎంతోమంది దాన్ని మౌనంగా భరిస్తున్నారు. లోకం ఏమనుకుంటుందోననే భయం, ఆర్థికపరమైన అభద్రత, పిల్లల భవిష్యత్తుపై బెంగ... ఇలా దీనికి ఎన్నో కారణాలున్నాయి. తలరాతను తిట్టుకుంటూ, కష్టాలను భరించినంత కాలం... జీవితం మరింత దుర్భరంగా మారుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. విధిని ఎదిరించి పోరాడితేనే గెలుపు అందుతుంది. దానికి నేనే ఉదాహరణ.’’
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News