Share News

Narne Nithin Journey: బావ అలా అనగానే ఆనందపడ్డా

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:44 AM

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్‌ వరుసగా మూడు విజయాలతో సినీ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. స్టార్ బ్రాండ్‌ను వాడుకోకుండా, తన టాలెంట్‌తో ఎదగాలని ప్లాన్ చేస్తున్నాడు

Narne Nithin Journey: బావ అలా అనగానే ఆనందపడ్డా

నార్నె నితిన్‌.. ‘ఆయ్‌’, ‘మ్యాడ్‌’ చిత్రాల సిరీస్‌తో ఇప్పుడు వినిపిస్తోన్న పేరు. తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే మరో మూడు చిత్రాల్లో నటించేసి, విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ యువ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు స్వయానా బావమరిది. అయితే ఆ బ్రాండ్‌ను ఇప్పుడే ఉపయోగించుకోకుండా కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటున్న నితిన్‌ ‘నవ్య’కు చెప్పిన విశేషాలివి.

  • మూడు సినిమాలు.. వరుస హిట్స్‌.. ఎలా అనిపిస్తోంది?

నా కంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరేమో అనిపిస్తోంది. ఎందుకంటే కొత్త హీరోలకు హిట్‌ దొరకడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో నాకు వరుసగా మూడు హిట్స్‌ రావడం ఓ అద్భుతమే కదండీ.

  • తెరపై మిమ్మల్ని మీరు చూసుకోవాలనే కోరిక ఎప్పుడు కలిగింది?

నేను సినిమా పిచ్చోడిని. సినిమాలు బాగా చూస్తుంటాను. సీనియర్‌ నటుడు భిక్షుగారు తెలుసు కదా.. ఆయన భార్య అరుణగారు కూడా నటనలో శిక్షణ ఇస్తుండేవారు. స్కూల్‌ ఫైనల్‌ కూడా నాకు అప్పుడు పూర్తి కాలేదు. సాయంత్రం స్కూల్‌ నుంచి రాగానే మణికొండలో ఉన్న వారి ఇంటికి ట్రైనింగ్‌ కోసం వెళ్లేవాడిని, సాయిధరమ్‌ తేజ్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, నాగశౌర్య కూడా అక్కడికి ట్రైనింగ్‌ కోసం వచ్చేవారు. వాళ్లు నాకు సీనియర్స్‌. వాళ్లకి పెద్ద పెద్ద డైలాగులు, నాకు చిన్న డైలాగులు ఇచ్చి చెప్పమనేవారు. అదో సరదాగా ఉండేది. బావగారు (జూనియర్‌ ఎన్టీఆర్‌) మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ సరదా మరింత పెరిగింది.


  • ఎన్టీఆర్‌ మీకు బావ కాకముందు నుంచీ ఆయనంటే అభిమానం ఉండేదా?

‘సింహాద్రి’ చూసిన తర్వాత బావగారికి అభిమానిగా మారాను. కడియాలు చేయించుకుని రోజూ ఎవరో ఒకరిని కొట్టడం, వాళ్లు ఇంటి మీదకి రావడం, ఇంట్లో వాళ్లు నన్ను తిట్టడం . జరిగేది. చిన్నప్పటి నుంచి ఆయనంటే నాకు బాగా ఇష్టం.

  • మీ బావ ప్రోత్సాహం ఎలా ఉంది?

సినిమాల్లో నటించాలనుంది అని ధైర్యంగా నా మనసులోని కోరికను మొదట బావగారికి చెప్పినప్పుడు వెంటనే ఆయన ఓ మాట అన్నారు. ‘‘ఒరేయ్‌.. ఈ పరిశ్రమలో ఎవరి సపోర్ట్‌ ఆశించకూడదు. మనకు మనకే నేర్చుకోవాలి, కష్టపడాలి, ఎదగాలి. కింద పడినా వెంటనే మనమే లేవాలి. ఎవరో వచ్చి లేపుతారని వెయిట్‌ చేయకూడదు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. ఆ తర్వాత నా సపోర్ట్‌, నా అభిమానుల సపోర్ట్‌ నీకు తప్పకుండా ఉంటుంది.

  • ఎన్టీఆర్‌ బావమరిది అనే బ్రాండ్‌ మీకు పాజిటివా, నెగెటివా?

పాజిటివ్‌నెస్‌తో పాటు నెగెటివిటీ కూడా ఉంటుంది. వంద మంది మావాడు అన్నప్పుడు, ఓ పది మంది ‘మీ వాడు ఏమిటిరా’ అని కూడా అనొచ్చు. అటువంటి మాట తప్పకుండా వస్తుంది కూడా. అయినా సరే ఎన్టీఆర్‌ బావమరిది అనేది నాకు ఎప్పుడూ పాజిటివే. నెగెటివ్‌గా అస్సలు చూడను.

  • మీ పేరుతోనే మరో హీరో ఉన్నారు కదా. పేరు మార్చుకోవాలని అనుకోలేదా?

హీరోగా నేను ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నా పేరు గురించి పెద్ద చర్చ జరిగింది... పేరు మార్చాలా వద్దా.. మారిస్తే ఎలాంటి పేరు పెట్టాలి అని. కానీ నాకు పేరు మార్చుకోవాలనిపించలేదు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిన పేరు. దాన్ని వదులుకోవాలని అనిపించలేదు. అందుకే ఇంటిపేరు కూడా చేర్చుకుని ‘నార్నే నితిన్‌’గా ఎంట్రీ ఇచ్చా. ఆర్టి్‌స్టగా టాలెంట్‌ నిరూపించుకోవాలి కానీ పేరు దానికి అడ్డంకి కాదని నా అభిప్రాయం.


  • కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

పలానా జోనర్‌లో మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. ఈ సందర్భంగా దర్శకులకు నాదొక విన్నపం... ఎలాంటి కథ అయినా నాకు చెప్పండి. అది కామెడీ కావచ్చు, హారర్‌ కావచ్చు, రొమాన్స్‌ కావచ్చు. పాయింట్‌ కొత్తగా ఉంది, ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు అనిపిస్తే చేసేస్తా. మరో విషయం ఏమిటంటే వంద మందిని కొట్టేసే మాస్‌ హీరో కావాలనే ఆశ నాకు ఇప్పుడైతే లేదు. నాలాంటి అప్‌కమింగ్‌ హీరో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తొందరగా ఇంటికి తిరిగెళ్లిపోతాడు. ‘వీడు మా వాడే.. నా ఫ్రెండే’ అనే భావన ప్రేక్షకలకు కలిగిస్తేనే వాళ్లకి తొందరగా దగ్గర కాగలం. నేను సూపర్‌ హ్యూమన్‌ని, హీరోని, మీరంతా నేను ఏది చేస్తే అది చూడాలి’ అన్నట్లు ఉండకూడదు. నేను కూడా ఒకప్పుడు ఓ సాధారణ ప్రేక్షకుడినే. అప్పట్లో బావగారు తప్ప పరిశ్రమలో నాకు ఎవరూ తెలీదు. ఓ కొత్త హీరో వచ్చి కొంచెం ఓవర్‌గా చేస్తుంటే ఏమిట్రా వీడు? అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓ పదేళ్లు టార్గెట్‌ పెట్టుకుని ఆ జర్నీలో మెల్లగా ఇమేజ్‌ మార్చుకుంటూ రావాలే కానీ వచ్చిన తొలి రోజుల్లోనే అన్నీ చేసేయాలని అనుకోకూడదు.


  • ‘మ్యాడ్‌’ ఫస్ట్‌ పార్ట్‌కి, సెకండ్‌ పార్ట్‌కి ఽమధ్య కాలంలో మీలో వచ్చిన మార్పు ఏమిటి?

‘మ్యాడ్‌’ చిత్రం రిలీజ్‌ అయ్యాక నా గురించి వినిపించిన కామెంట్స్‌ను పాజిటవ్‌గా తీసుకున్నా. వాటిని ఇంప్రూవ్‌ చేసుకుని ‘ఆయ్‌’ సినిమా చేశా. ఆ తర్వాత ‘మ్యాడ్‌ 2’ లో నటించా. ఆ సినిమా తర్వాత నెగెటివ్‌ కామెంట్స్‌ రాలేదు. మా బావగారే స్వయంగా అన్నారు ‘ఒరేయ్‌.. నీలో ఈజ్‌ పెరిగింది. క్యారెక్టర్‌లో లీనం అయ్యావు’ అని ఆయన అనడం ఆనందంగా అనిపించింది. నా గురించి వచ్చే కామెంట్స్‌ను ఫాలో అవుతుంటా. నేర్చుకుంటూనే ఉంటా. ‘మ్యాడ్‌’ తర్వాత ‘ఆయ్‌’ చేశా. ఆ తర్వాత ‘మ్యాడ్‌ 2’ చేశా. రోజురోజుకీ కొత్త విషయాలు నేర్చుకుంటున్నా.

  • మీ మొదటి సినిమా ‘శ్రీ శ్రీ రాజావారు’ రిలీజ్‌ ఎప్పుడు?

ఎలా చేయాలి, ఎప్పుడు రిలీజ్‌ చేయాలని అని చర్చలు జరుగుతున్నాయి. ఆ చిత్ర దర్శకనిర్మాతలతో మాట్లాడుతున్నాం. అది నాలుగో సినిమా అవుతుందా, ఐదో సినిమా అవుతుందా అని ఇప్పుడే చెప్పలేదను.

పూజలు, ఉపవాసాలు చేసేసింది

‘మ్యాడ్‌ 2’ రిలీజ్‌కు ముందు శివానీకి ఓ టెన్షన్‌ ఉండేది. మాకు ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్‌ అయింది. అది హిట్‌ కాకపోతే ఆ ప్లాప్‌ తన ఖాతాలో వేసేసి ఇదంతా తనవల్లే జరిగిందని అంటారేమోననే భయంతో చాలా టెన్షన్‌ పడింది. సినిమా హిట్‌ కోసం పూజలు, ఉపవాసాలు చేసింది. ‘ఏమీ వద్దు.. అవసరం లేదు’ అన్నా శివానీ వినలేదు. లక్కీగా ‘మ్యాడ్‌ 2’ హిట్‌ కావడంతో ఆమె చాలా రిలీఫ్‌ ఫీలయింది. వరుసగా మూడో హిట్‌ పడేసరికి తను హ్యాపీ. మేమందరం హ్యాపీ. అక్టోబరులో మా పెళ్లి జరుగుతుంది.

- వినాయకరావు


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

Updated Date - Apr 13 , 2025 | 01:44 AM