నాదల్‌ను ‘మాయ’ చేసింది
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:05 AM
టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్, తన సొంత అకాడమీలో ఒక బాలిక ఆటను ఆసక్తిగా వీక్షిస్తున్న తాజా వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. ఆ 15 ఏళ్ల బాలికే, మన భారతీయ...
టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్, తన సొంత అకాడమీలో ఒక బాలిక ఆటను ఆసక్తిగా వీక్షిస్తున్న తాజా వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. ఆ 15 ఏళ్ల బాలికే, మన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి మాయా రాజేశ్వరన్. ప్రతిష్ఠాత్మకమైన రఫెల్ నాదల్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందే కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్న మాయ గురించిన ఆసక్తికరమైన విశేషాలు.
ఎంతో మంది బాలికలు టెన్నిస్ క్రీడను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఆ ఆటలో రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేవారు అతికొద్దిమందే! వాళ్లలో మాయ రాజేశ్వరన్ ఒకరు. 15 ఏళ్ల మాయ రాజేశ్వరన్ కూడా టెన్నిస్ సర్క్యూట్‌లో రాణించి, ప్రతిష్ఠాత్మకమైన ఎల్ అండ్ టి డబ్ల్యుటిఎ 125 సిరీస్ సెమీఫైనల్స్‌లో తన స్థానాన్ని పదిలపరుచు కోగలిగింది. ఈ పోటీలో మాయ, ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్ 264, నికోల్ ఫాసా హ్యుర్గే, అమెరికాకు చెందిన వరల్డ్ నంబర్ 434, జెస్సికా ఫెల్లానూ ఓడించింది. ఈ విజయంతో, డబ్ల్యుటిఎ పాయింట్ సంపాదించిన అతి పిన్న వయసుగల భారతీయురాలిగా పేరు తెచ్చుకుంది మాయ. ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో మాయ, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించింది.
ఆటనే అభిరుచిగా...
తమిళనాడులోని కోయంబత్తూరులో 2009, జూన్ 12న పుట్టిన మాయచ ఊహించని విధంగా టెన్నిస్ క్రీడలోకి అడుగు పెట్టింది. బడి క్రీడల్లో భాగంగా టెన్నిస్ ఆడుతూ, ఆ ఆట మీద మక్కువ పెంచుకున్న ఈ బాలిక, ఎనిమిదేళ్ల వయసుకు చేరుకునేటప్పటికి ఆ క్రీడనే అభిరుచిగా మలుచుకుంది. మొదట్లో మాజీ భారతీయ నంబర్ వన్ ఆటగాడు కె.జి.రమేష్ దగ్గర టెన్నిస్‌లో శిక్షణ పొందింది. ఆ తర్వాత ప్రొ సర్వ్ టెన్నిస్ అకాడమీలో కోచ్ మనోజ్ కుమార్ సారధ్యంలో ఐదేళ్ల పాటు శిక్షణ తీసుకుంది. మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ద్వారా క్వాలిఫయింగ్ వైల్డ్‌కార్డ్ పొందిన మాయ, డబ్ల్యుటిఎ 125 ఈవెంట్‌లో తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం విశేషం.
దిగ్గజం దృష్టిలో...
తన ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాయ, స్పెయిన్ మల్లోర్కాలోని రఫెల్ నాదల్ అకాడమీలో వారం రోజుల శిక్షణ పొందే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ వారం రోజుల్లో ఆమె తన ప్రతిభతో, అదే అకాడమీలో ఏడాది పాటు టెన్నిస్ ఆడే కాంట్రాక్టును కూడా పొందగలిగింది. అందుకోసం మామ, స్పెయిన్‌కు మకాం మార్చేసింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలో నాదల్ దగ్గరుండి ఆమె ఆటను వీక్షించడం సంచలనంగా మారింది. అకాడమీకి చెందిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మాయ సెషన్స్‌ను వీక్షిస్తున్న నాదల్ ఫొటోలను పోస్ట్ చేస్తూ... ‘‘అత్యంత ప్రత్యేక వీక్షకుడు, రఫెల్ నాదల్, డబ్ల్యుటిఎ టోర్నమెంట్‌లో సెమిఫైనల్స్‌కు చేరుకున్న 15 ఏళ్ల, మాయా రాజేశ్వరన్ శిక్షణను ఏమాత్రం మిస్ కాలేదు’ అనే క్యాప్షన్ రాయడం విశేషం. ఈ పోస్ట్ గురించి ప్రస్థావిస్తూ... ‘‘నాకెంతో ప్రీతిపాత్రమైన మధుర స్మృతుల్లో ఇదొకటి. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న వ్యక్తి, ఇప్పటికీ క్రీడ పట్ల మక్కువను కలిగి ఉండడం గొప్ప విషయం’’ అంటూ మాయ పేర్కొంటోంది. ఈ టెన్నిస్ సంచలనం భవిష్యత్తులో, సానియా మీర్జాకు మించి మరింత మెరుగ్గా రాణించాలని కోరుకుందాం!