Share News

Munnakkada with Health Benefits: మునక్కాడలతో కొత్తగా

ABN , Publish Date - Oct 11 , 2025 | 06:10 AM

Munnakkada Chicken Soup and Paratha A Delicious Twist with Health Benefits

Munnakkada with Health Benefits: మునక్కాడలతో కొత్తగా

వంటిల్లు

మునక్కాడ చికెన్‌

మనం మునక్కాడలతో రకరకాల కూరలు, సాంబార్‌, నిల్వ పచ్చడి... ఇలా ఎన్నో చేసుకుంటూ ఉంటాం. ఇవి కాక మునక్కాడలతో సరికొత్తగా ప్రయత్నించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...

కావాల్సిన పదార్థాలు

లేత మునక్కాడలు- మూడు, చికెన్‌ ముక్కలు- అర కేజీ, నూనె- ఆరు చెంచాలు, పసుపు- అర చెంచా, తర్బూజ గింజలు- ఒక చెంచా, జీడిపప్పులు- అయిదు, దాల్చిన చెక్క- మూడు చిన్న ముక్కలు, యాలకులు- రెండు, లవంగాలు- అయిదు, గసగసాలు- ఒక చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, ఉల్లిపాయ- ఒకటి, పచ్చి కొబ్బరి- మూడు చిన్న ముక్కలు, పచ్చిమిర్చి- ఆరు, ఉల్లికాడలు- రెండు, కరివేపాకు- కొద్దిగా, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- రెండు చెంచాలు, కారం- రెండున్నర చెంచాలు

తయారీ విధానం

ఫ స్టవ్‌ మీద పాన్‌ పెట్టి తర్బూజ గింజలు, జీడిపప్పులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి రెండు నిమిషాలపాటు దోరగా వేయించాలి. ఆపైన కొబ్బరిముక్కలు, గసగసాలు వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

ఫ స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాల తరువాత మునక్కాడ ముక్కలు, చికెన్‌ ముక్కలు వేసి కలపాలి. మూతపెట్టి పది నిమిషాలపాటు చిన్న మంట మీద మగ్గించాలి. తరువాత మూత తీసి రెండు గ్లాసుల నీళ్లు పోసి పావుగంటసేపు ఉడికించాలి. ఆపైన.. ముందుగా గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాల పొడి, కారం, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లి కాడల ముక్కలు, కరివేపాకు వేసి కలిపి అయిదు నిమిషాలు మగ్గించాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ మునక్కాడ చికెన్‌ కూర... వేడి అన్నం, చపాతీ, పరోటా, పుల్కాల్లోకి రుచిగా ఉంటుంది.

మునక్కాడల్లో అధికంగా కాల్షియం, పొటాషియం, ప్రొటీన్లు, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. మునక్కాడలను తరచూ తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. శిరోజాలు ఒత్తుగా పెరగడంతోపాటు చర్మం కాంతివంతమవుతుంది. శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి.


మునక్కాడల సూప్‌

కావాల్సిన పదార్థాలు

మునక్కాడలు- మూడు, టమాటా- ఒకటి, ఉల్లిపాయ- ఒకటి, అల్లం- చిన్న ముక్క, వెల్లల్లి- మూడు రెబ్బలు, లవంగాలు- రెండు, నీళ్లు- మూడు కప్పులు, ఉప్పు- అర చెంచా, పసుపు- పావు చెంచా, మిరియాల పొడి- పావు చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

  • స్టవ్‌ మీద కుక్కర్‌ పెట్టి అందులో మునక్కాడల ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉప్పు, పసుపు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. కుక్కర్‌కు మూతపెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి స్టవ్‌ మీద నుంచి దించాలి. కుక్కర్‌ చల్లారాక మూత తీసి అందులో ఉన్న ముక్కలను పప్పు గుత్తి లేదా గరిటె తో మెత్తగా మెదపాలి. తరువాత స్టయినర్‌ సహాయంతో మరో గిన్నెలోకి రసాన్ని వడబోయాలి. ఈ గిన్నెను స్టవ్‌ మీద పెట్టి అయిదు నిమిషాలపాటు రసాన్ని బాగా మరిగించాలి. ఆపైన మిరియాల పొడి, కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ మునక్కాడల సూప్‌ను వేడిగా తాగితే రుచిగా ఉంటుంది.

మునక్కాడలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల వాటిలోని పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. పేగులను శుభ్రం చేస్తాయి. మునక్కాడల్లోని విటమిన్లు, ఇతర ఖనిజాలు కలిసి మధుమేహం, రక్తపోటు, రక్తహీనతలను నియంత్రిస్తాయి. గర్బిణులు మునక్కాడలను తీసుకోవడం వల్ల ప్రసవ సమయంలో నొప్పుల బాధ తగ్గుతుంది. బిడ్డ పుట్టిన తరువాత తల్లిపాలు వృద్ధి చెందుతాయి.


మునక్కాడ పరాటా

కావాల్సిన పదార్థాలు

లేత మునక్కాడలు- నాలుగు, గోధుమ పిండి- రెండు కప్పులు, ఉప్పు- కొద్దిగా, పసుపు- చిటికెడు, కారం- కొద్దిగా, నువ్వులు- అర చెంచా, ఉల్లిపాయ- ఒకటి, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి- నాలుగు చెంచాలు

తయారీ విధానం

  • స్టవ్‌ మీద కుక్కర్‌ పెట్టి అందులో మునక్కాడల ముక్కలు వేసి రెండు కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత కుక్కర్‌ను స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. మెత్తగా ఉడికిన మునక్కాడల ముక్కల లోపల ఉండే గింజలు, గుజ్జును చెంచా సహాయంతో తీసి ఒక గిన్నెలో వేయాలి.

  • వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు, కారం, పసుపు, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, మునక్కాడ ముక్కల నుంచి తీసిన గుజ్జు వేసి బాగా కలపాలి. తరువాత మునక్కాడలు ఉడికించిన నీళ్లు చల్లుకుంటూ పిండిని ముద్దలా చేయాలి. ఈ పిండిని పావుగంటసేపు నాననివ్వాలి. తరువాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పరాటాల్లా పామి వాటిపై కొద్దిగా నెయ్యి రాయాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి వేడిచేయాలి. తరువాత దానిపై పరాటాలు ఒక్కోటి వేస్తూ రెండు వైపులా ఎర్రగా కాల్చి పళ్లెంలోకి తీయాలి. ఈ మునక్కాడ పరాటాలను రైతాతో సర్వ్‌ చేయవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 06:11 AM