Share News

Megha Saxena: మార్పు కోసమే ఈ స్టార్టప్‌

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:38 AM

అగ్ని ప్రమాదాలకు కారణమౌతున్న వ్యర్థాల నిర్వహణ, పంట దిగుబడి పెంచడం, మహిళలకు ఉపాధి కల్పన... వీటన్నిటికీ ఒక స్టార్ట్‌పతో పరిష్కారం చూపించారు...

Megha Saxena: మార్పు కోసమే ఈ స్టార్టప్‌

అగ్ని ప్రమాదాలకు కారణమౌతున్న వ్యర్థాల నిర్వహణ, పంట దిగుబడి పెంచడం, మహిళలకు ఉపాధి కల్పన... వీటన్నిటికీ ఒక స్టార్ట్‌పతో పరిష్కారం చూపించారు మేఘా సక్సేనా. వైద్య వృత్తిని వదిలేసి పల్లె బాట పట్టిన ఆమె... ఇది తాను కోరుకుంటున్న మార్పు దిశగా ఒక చిన్న అడుగు మాత్రమేనంటున్నారు.

‘‘మా ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని దేవభూమి అని పిలుస్తారు. దాదాపు 71 శాతం అడవులున్న రాష్ట్రం మాది. ఈ అడవుల్లో పదహారు శాతానికి పైగా పైన్‌ చెట్లు ఉన్నాయి. పైన్‌ చెట్ల ఆకులు సూది మొనల్లా ఉంటాయి. అందుకే వాటిని ‘పైన్‌ నీడిల్స్‌’ అంటారు. అవి ఎండిపోయి, నేల మీద పడి, అక్కడే పేరుకుపోతాయి. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు చాలా వేగంగా వ్యాపించడానికి అవి ప్రధాన కారణం. రాష్ట్రంలో గత పాతికేళ్ళుగా... సంభవించిన అగ్ని ప్రమాదాల్లో లక్షన్నర ఎకరాలకు పైగా అడవులు దగ్ధమైపోయాయి. ఇది పర్యావరణానికి, వృక్ష జాతుల వైవిధ్యానికి, ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన నాలాంటివారందరికీ ఈ సమస్య తీవ్రత తెలుసు. కానీ దీనికి పరిష్కారం ఎలా? అనేదే ప్రశ్న.

నా వంతుగా...

‘డాక్టర్‌’ అని పిలిపించుకోవాలని, పేదలకు సేవ చేయాలని నా ఆశయం. దానికోసం ఎంతో కృష్టపడ్డాను. ఎంబీబీఎస్‌ పూర్తి చేశాక... అల్మోరాలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో వైద్యురాలిగా పని చేశాను. గ్రామాల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహించాను. గ్రామస్తుల ఇబ్బందులు మరింత స్పష్టంగా తెలుసుకొనే అవకాశం వాటిద్వారా కలిగింది. పంట దిగుబడిని పెంచడం కోసం ఎరువులు, పురుగుల మందులు కొనే స్తోమత చాలామంది రైతులకు లేదు. అలాగే సంప్రదాయికమైన సాగు పద్ధతులనే వారు పాటిస్తూ ఉంటారు. ఇక... మహిళలకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక స్వావలంబనకు దూరంగా ఉన్నారు. ‘వారికి నా వంతుగా ఏదైనా చెయ్యగలనా?’ అని ఆలోచిస్తున్న సమయంలో... కొవిడ్‌ వచ్చింది. అప్పుడు నేను గర్భవతిని కావడంతో విధులకు సెలవు తీసుకున్నాను. ఆ తీరిక సమయంలో... పైన్‌ ఆకులు, వాటి ప్రయోజనాల గురించి అధ్యయనం చేశాను. వాటితో పౌలీ్ట్రలు, చేపల పెంపకానికి ఆహార సప్లిమెంట్లను, వ్యవసాయం కోసం బయో ఫెర్టిలైజర్స్‌ను తయారు చేయవచ్చని తెలిసింది. మరిన్ని వివరాల కోసం కొందరు నిపుణులను సంప్రతించాను. వారి ప్రోత్సాహంతో... ఉద్యోగం వదిలేసి, 2021లో ‘ఎకోఛార్‌’ అనే స్టార్టప్‌ ప్రారంభించాను.


ఫలితాలు నిర్ధారించాక...

మా ఉత్పత్తుల్లో బయోఛార్‌, ఉడ్‌ వెనిగార్‌ ప్రధానమైనవి. ఎండిపోయిన పైన్‌ ఆకులను ప్రత్యేకమైన పద్ధతుల్లో, నిర్దిష్టమైన ఉష్ణోగ్రత దగ్గర కాల్చితే బొగ్గు తయారవుతుంది. ఈ ప్రక్రియలో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఆ బొగ్గును ఉపయోగించడం వల్ల నేల సారవంతం అవుతుంది. రసాయనాలు, పురుగు మందుల వాడకం వల్ల నేలలో విషపూరితమైన అవశేషాలు మిగిలిపోతాయి. ఈ బొగ్గు వినియోగం వల్ల ఆ సమస్య ఉండదు. దిగుబడి ఎక్కువగా వస్తుంది. అలాగే పైన్‌ ఆకులతో తయారు చేసే ఉడ్‌ వెనిగార్‌ ద్వారా దిగుబడి పెరుగుతుంది. మొదట్లో ప్రయోగాత్మకంగా వినియోగించి... ఫలితాలను నిర్ధారించుకున్నాక ఉత్పత్తిని ప్రారంభించాం. స్థానిక రైతులకు వీటివల్ల ఖర్చు తగ్గడం, భూసారం పెరగడం లాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. హరియాణా, గుజరాత్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో కూడా వీటికి ఆదరణ లభిస్తోంది.

సేకరణ పూర్తిగా మహిళలద్వారానే...

పైన్‌ ఆకుల సేకరణ పూర్తిగా మహిళలే చేస్తారు. దీనికోసం పలు గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేశాం. అడవుల్లో పైన్‌ ఆకులు సేకరించి... మా కేంద్రాలకు తీసుకువస్తే... దానికి ప్రతిఫలాన్ని మేము అందిస్తున్నాం. మా ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే మొత్తంలో ఎక్కువ భాగం వారికోసమే వినియోగిస్తున్నాం. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఇదివరకటిలా నేల మీద ఎండిన పైన్‌ ఆకులు కనిపించడం బాగా తగ్గిపోయింది. ఈ విధంగా... పర్యావరణానికి, రైతులకు, మహిళలకు ఒక పరిష్కారాన్ని చూపించడం ఎంతో సంతోషంగా ఉంది. విద్య, వైద్యం, మహిళా సాధికారత, అందరికీ సమాన అవకాశాలు... ఇలా ఎన్నో అంశాల్లో పని చేయాలనేది నా కోరిక. ఇవన్నీ సాధ్యం కావాలంటే సమాజంలో మార్పు రావాలి. నా స్టార్టప్‌... ఆ దిశగా నేను వేసిన ఒక చిన్న అడుగు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

For More AP News and Telugu News

Updated Date - Aug 04 , 2025 | 03:38 AM