K Raghavendra Rao: నేను రుణపడేది ఆయనకే
ABN , Publish Date - May 04 , 2025 | 05:40 AM
37 మంది హీరోలతో, 77 మంది హీరోయిన్లతో సినిమాలు తీసిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు మాత్రమే సొంతం. యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో బాక్సాఫీస్ హిట్స్‌తో పాటు, ఆధ్యాత్మిక చిత్రాలకూ మార్గదర్శిగా నిలిచారు.

37 మంది హీరోలతో సినిమాలు తీసి అత్యధిక హిట్స్ ఇచ్చిన ఏకైక దర్శకుడు ఆయన ఒక్కరే. అలాగే 77 మంది హీరోయిన్లతో చిత్రాలు తీసిన ఘనత ఇండియాలో రాఘవేంద్రరావుకు మాత్రమే సొంతం.
తెలుగు సినిమాకు మాస్ హంగులు అద్ది, బాక్సాఫీసును షేక్ చేసిన దర్శకుడు... తెలుగు పాటను రంగులతో అభిషేకించి, సంగీతంతో సంబరాలు చేయించిన సంగీతాభిమాని. హిట్స్, రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు, సిల్వర్ జూబ్లీలు, పొగడ్తలు... ఇలా అన్నీ కట్టకట్టుకువచ్చి మీదపడినా.. అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరించడం తప్ప, స్టేజ్ మీద కానీ, మరెక్కడైనా కాని అహంకారంతో ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు... ‘గ్లామర్, గుట్టల గుట్టల పండ్లు, నాయికల నాభి తప్ప... అంతకంటే ఏం తియ్యగలడు’ అనే వాళ్లకు ‘అన్నమయ్య’ అనే అద్భుతాన్ని అందించి తన ప్రతిభను పండించుకున్న ఆ దర్శకుడు... కె. రాఘవేంద్రరావు. యాభై ఏళ్ల కెరీర్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆ దర్శకేంద్రుడు తన సినీ పయనంలో ఎదురైన ఆసక్తికరమైన సంఘటనలను, విశేషాలను ‘నవ్య’కు వివరించారిలా...
మీరందరూ యాభై ఏళ్లు అయిందని చెబుతుంటే ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే ‘పరిశ్రమలోకి వచ్చి ఇన్నేళ్లు అయింది, ఇన్ని సినిమాలు చేశాను’ అని నేను ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు. నా పని నేను చేశాను. ‘వెయ్యి కోట్ల రూపాయలు కావాలా, డైరెక్షన్ ఛాన్స్ కావాలా?’ అని ఎవరైనా ఆఫర్ ఇస్తే... ఇప్పటికీ దర్శకత్వాన్నే కోరుకుంటా. డైరెక్షన్ అంటే నాకు అంత పిచ్చి. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఒకే ఒక వ్యక్తికి రుణపడి ఉంటాను. ఆయనే ఎన్టీఆర్. ‘పాండవ వనవాసం’ చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించి, రామారావుగారి మీద తొలి క్లాప్ ఇచ్చాను. అలాగే ఆయన నటించిన ‘అడవిరాముడు’ సినిమా నుంచే అగ్ర దర్శకుడిగా ఎదిగాను. ఆ రోజు రామారావుగారి మీద క్లాప్ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులు ఇన్నేళ్లుగా నా సినిమాలు చూస్తూ ఇన్ని క్లాప్స్ కొడతారని ఊహించలేదు. సినిమా పాటకు ప్రేక్షకులు పట్టాభిషేకం చేసిన సినిమా ‘అడవిరాముడు’. రామారావుగారు నడిచి వస్తుంటే ఆ రోజుల్లో జనం పూలు జల్లేవారు, హారతులు ఇచ్చేవారు.
‘ఆయన నడిచి వస్తేనే ఇలా చేస్తున్నారు, ఏనుగు ఎక్కిస్తే ఇంకెంత ఆనందిస్తారో?’ అని అడవిరాముడు తీశాను. ఆ సినిమాలోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట చూసి జనం డబ్బులు విసరడం మొదలుపెట్టారు. అప్పటినుంచి మా కాంబినేషన్‌కు క్రేజ్ మొదలైంది. అలాగే నిర్మాతలు లేకపోతే నేను లేను. ఈ యాభై ఏళ్ల జర్నీ ఇంత విజయవంతంగా సాగడానికి నా నిర్మాతలే కారణం. నాతో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు, పంపిణీదారులకు, థియేటర్ యజమానులకు, నన్ను ఆదరించిన ప్రేక్షకులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు.
హీరో కావాలని అనుకోలేదు
నాకు సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం. పుస్తకాలు కొనుక్కోమని ఇంట్లో డబ్బులు ఇస్తే అవి కొనకుండా సినిమాలకు వెళ్లి, స్నేహితుల పుస్తకాలు చదివిన రోజులు ఉన్నాయి. దాదాపు ప్రతి రోజూ సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి. నాకు మొదటి నుంచీ నటన మీద ఆసక్తి లేదు. దర్శకుడినవ్వాలనేదే నా కోరిక. నటుడినో, హీరోనో కావాలని ఎప్పుడూ అనుకోలేదు.
లక్ష రూపాయలతో తొలి సినిమా అనుకున్నా
ఎన్టీఆర్, కృష్ణ తొలిసారిగా కలసి నటించిన ‘స్త్రీ జన్మ’ చిత్రానికి నాన్నగారు దర్శకుడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని. సెట్‌లో నా ఇన్‌వాల్వ్‌మెంట్, పనితీరు గమనించిన ఆ చిత్ర నిర్మాత రామానాయుడు గారు ‘‘రాఘవేంద్రరావ్.. నీ ఫస్ట్ పిక్చర్ నాకే చెయ్యాలి’’ అనేవారు. ‘‘ఇప్పుడు కాదు.. తర్వాత చూద్దాంలే’’ అన్నారు నాన్నగారు. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఏవీఎం సీజర్, అడుసుమిల్లి కుమార్, గోపాలకృష్ణ కలసి నా దర్శకత్వంలో సినిమా తీద్దామని వచ్చారు. ‘‘ఎవరూ చేయని విధంగా సినిమా తీద్దాం. పల్లెటూరికి వెళ్దాం. లక్ష రూపాయల బడ్జెట్‌లో తీద్దాం’’ అన్నాను. ‘‘లేదు లేదు భారీ బడ్జెట్‌లో తీద్దాం’’ అన్నారు వాళ్లు. ‘బాబు’ సినిమాకు మా నాన్న కథ ఇచ్చారు. శోభన్‌బాబు హీరో. ముగ్గురు హీరోయిన్లు. చాలా భారీగా తీశాం. నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆ ముగ్గురు మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మా సినిమా విడుదలైన కొన్ని రోజులకు విశ్వనాథ్‌గారి ‘జీవనజ్యోతి’ రిలీజ్ అయింది. ఆ చిత్రం చూడగానే నా సినిమా భవిష్యత్ అర్థమై పోయింది. ఊహించినట్లుగానే ‘జీవనజ్యోతి’ వచ్చాక మా సినిమా వసూళ్లు తగ్గాయి.
మూడు తరాల హీరోలతో...
నేను నిర్మాతల దర్శకుణ్ణి. ఎక్కువ రోజులు షూటింగ్ చేసి నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు. అందుకే ఒక్కో నిర్మాతకు చాలా సినిమాలు చేసే అవకాశం కలిగింది. నా అదృష్టం ఏమిటంటే.. నా దర్శకత్వంలో నటించడానికి ఏ హీరోకానీ, నటుడు కానీ ‘నో’ అనలేదు. మూడు తరాల హీరోలతో పని చేశాను. అందరికీ గుర్తుండిపోయే హిట్స్ ఇచ్చే అవకాశం దక్కడం నా అదృష్టం.
ఆ టెన్షన్ ఉండేది
రామారావుగారు ఒక సినిమా కోసం దాదాపు 40 రోజుల పాటు ఔట్‌డోర్‌లో ఉండడం అన్నది ‘అడవిరాముడు’తోనే మొదలు. అంతవరకూ ఆయనకు ఔట్‌డోర్ అంటే మద్రాసు గిండీ ఫారెస్టే. అటువంటి వ్యక్తి ఈ చిత్రకథ నచ్చి అన్ని రోజులు ఔట్‌డోర్‌లో ఉండిపోయారు. మధ్యలో ఒకటి రెండు సార్లు ‘దానవీరశూర కర్ణ’ చిత్రం రీరికార్డింగ్ కోసం మద్రాసు వెళ్లి వచ్చారేమో! ‘ఈ సినిమా ఆడకపోతే నా కెరీర్ ఏమవుతుందా?’ అనే టెన్షన్ ‘అడవిరాముడు’ చేస్తున్నప్పుడు నాకు ఉండేది. చిన్న సినిమాలు చేసుకోవచ్చు కానీ రామారావుగారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలతో పని చేశాను. రామారావుగారు షూటింగ్ ముగించుకుని వెళ్లిపోతూ ‘‘నా కెరీర్‌లో ఇది మధుర జ్ఞాపకం’ అని మెచ్చుకోవడం మరిచిపోలేని సంఘటన. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా నా హీరోలు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్... ఎవరూ నిరుత్సాహపరిచేలా మాట్లాడలేదు. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అది వారి గొప్పతనం. ముఖ్యంగా రామారావుగారు. ఆయనకు ‘సింహబలుడు’, ‘తిరుగులేని మనిషి’ అని రెండు ప్లాప్స్ ఇచ్చాను. ఆయన వద్దు అనుకుంటే నాకు మరో అవకాశం వచ్చేది కాదు.. కానీ ఆయన గొప్పతనం ఏమిటంటే.. ‘‘ఇట్సాల్ రైట్ బ్రదర్.. ఏం తీయకూడదో నేర్చుకున్నాం. ఈ సారి మంచి కథతో ప్లాన్ చేయండి..’ అన్నారు., ఆయన ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ చేసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. అందుకే ఏ ఫంక్షన్‌కు వెళ్లినా ‘‘రామారావుగారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని చెబుతుంటాను.
సోషల్ మీడియాను కంట్రోల్ చెయ్యాలి
సోషల్ మీడియాను కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. ముఖ్యంగా కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ పెట్టే హెడ్డింగ్స్ ఇబ్బందికరంగా ఉంటున్నాయి. వాటిని అదుపు చేయాలి. ఈ విషయంలో నేను కూడా ఓసారి ఇబ్బంది ఎదుర్కొన్నా. అయితే వాటిని నేను పట్టించుకోను కనుక రియాక్ట్ కాలేదు. కానీ రానురాను విచ్చలవిడితనం పెరిగిపోతోంది.
పాటలో మొత్తం రామాయణం
నా కెరీర్‌లో అన్ని రకాల చిత్రాలూ చేశాను. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘పాండురంగడు’. ‘మంజునాథ’ ‘శిరిడి’, ‘నమో వేంకటేశ’ లాంటి సినిమాలు చేశాను. ఇప్పుడు ఓ పాటలో మొత్తం రామాయణాన్ని చూపించాలని నా కోరిక . దానికి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా చేశా. అలాగే ‘వల్లీ కల్యాణం’ కూడా సినిమాగా తీయాలనే ఆలోచన ఉంది.
వినాయకరావు ఇప్పుడు తీరికే లేదు
‘పెళ్లిసందడి’ చిత్రం మళ్లీ తీసిన తర్వాత ఏం చేయాలా అని నాకు తోచలేదు. ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత న్యాయంగా అయితే రిటైర్ అవ్వాలి, కానీ నాకు పని లేకపోతే తోచదు. అప్పుడు బాగా ఆలోచించి యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. షార్ట్ ఫిల్మ్స్ తీసి అప్‌లోడ్ చేస్తున్నా. పిల్లలకు సంబంధించి రెండేసి నిముషాల షార్ట్ ఫిల్మ్స్ ఏ.ఐ.లో తీస్తున్నాం. దానికోసం తీరిక లేకుండా వర్క్ చేస్తున్నా.
కీ బోర్డ్ నేర్చుకుంటున్నా. అలాగే ‘కెఆర్‌ఆర్ క్లాస్‌రూమ్’ పేరుతో సినిమాల గురించి ప్రాక్టికల్ నాలెడ్జిని ఔత్సాహికులకు ఉచితంగా చెబుతున్నా.
28 రోజుల్లో ‘జ్యోతి’
ఒక పెద్ద సినిమా తీసిన వెంటనే ఓ చిన్న చిత్రం తీయడం చాలా మంచిది. ఆ పద్ధతిని చాలా రోజులు కొనసాగించా. ప్రేక్షకులు అంచనాలు పెంచుకునే అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ‘ఏం తీస్తాడు, ఎలా తీస్తాడు...’ అని వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకే రెండో సినిమా ‘జ్యోతి’ని ప్రయోగాత్మకంగా 28 రోజుల్లో తీశాను. మురళీమోహన్, జయసుధ జంటగా నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. మురళీమోహన్‌తో చేసిన ‘కల్పన’ చిత్రం విడుదల అయిన వారం రోజులకు ‘అడవిరాముడు’ వచ్చింది. ఈ రెండు సినిమాలూ హిట్ అయ్యాయి. అలాగే ‘సింహబలుడు’ చిత్రం భారీ బడ్జెట్‌తో తయారైతే, ఆ సమయంలోనే ‘పదహారేళ్ల వయసు’ చిత్రం లోబడ్జెట్‌తో వచ్చింది.
ముగ్గురు హీరోలతో ‘త్రివేణి సంగమం’
నా నూరవ సినిమాను మొదట చాలా విభిన్నంగా ప్లాన్ చేశాను. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో ఆ సినిమా చేయాలని అనుకొని వారిని అడిగాను. ముగ్గురూ ఒప్పుకొన్నారు. ‘త్రివేణి సంగమం’ అని టైటిల్ అనుకున్నా. ఈ సినిమాను అరవింద్, అశ్వనీదత్‌లతో కలసి తీయాలిన ప్లాన్ చేశా. అయితే పాటల విషయంలో అభిమానుల మధ్య అభిప్రాయ బేధాలు వస్తాయేమో అనే అనుమానం వచ్చి ఆ ప్రాజెక్ట్ ఆపేశాం. అప్పుడు ఓ కొత్త హీరోతో చిన్న సినిమా తీద్దామని అల్లు అర్జున్‌ను పరిచయం చేస్తూ ‘గంగోత్రి’ తీశాం.
మరచిపోలేని మూడు సంఘటనలు
యాభై ఏళ్ల కెరీర్‌లో మరచిపోలేని మధుర సంఘటనలు మూడు ఉన్నాయి. ‘అడవిరాముడు’ చిత్రంతోనే పాటలు వచ్చినప్పుడు తెరపైకి డబ్బులు విసరడం అనే ట్రెండ్ మొదలైంది. అలాగే ‘జగదేకవీరుడు- అతిలోకసుందరి’ చిత్రం పెద్ద తుపాన్ వచ్చిన సమయంలో విడుదల అయింది. చాలా థియేటర్లలో షోలు పడని పరిస్థితి. కానీ ఒక థియేటర్‌లో మాత్రం వర్షపు నీటిని మోటార్లు పెట్టి బయటకు తోడేస్తుంటే, జనం కుర్చీలో కాళ్లు పెట్టుకుని ఆ సినిమా చూశారు. ‘అన్నమయ్య’ చిత్రంలో ‘మోకాళ్ల పర్వతాన్ని చెప్పులు వేసుకుని ఎక్కకూడదు’ అని భానుప్రియ నాగార్జునకు చెప్పే సీన్ వచ్చినప్పుడు థియేటర్‌లో ప్రేక్షకులు కూడా చెప్పులు విడిచిపెట్టి సినిమా చూశారు.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..