ఇంట్లోనే హోలీ రంగులు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:35 AM
రంగుల పండుగ హోలీని చిన్నా, పెద్దా అందరూ ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. రంగులను ఇంట్లోనే తయారు చేసుకుని వాటితో హోలీ ఆడుకుంటే...

రంగుల పండుగ హోలీని చిన్నా, పెద్దా అందరూ ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. రంగులను ఇంట్లోనే తయారు చేసుకుని వాటితో హోలీ ఆడుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది. శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా మెరుస్తాయి కూడా! రసాయనాలు లేని హోలీ రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
గులాబీ రంగు
పండుగకు ముందు రోజు రాత్రి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో బీట్‌రూట్‌ని చక్రాలుగా కోసి వేయాలి. అవి మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించాలి. స్టవ్ మీద నుంచి దించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీళ్లను వడబోసి అవసరమైతే మరికొన్ని నీళ్లు కలుపుకుని వాడుకోవచ్చు. ముదురు గులాబీ రంగులో ఉండే ఈ నీళ్లతో హోలీ ఆడుకోవచ్చు.
పసుపు రంగు
గిన్నెలో రెండు చెంచాల పసుపు, చెంచా శనగపిండి వేసి బాగా కలిపి జల్లెడ పట్టాలి. ఇందులో నీళ్ల చుక్కలు చిలకరిస్తూ పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బకెట్ నీళ్లలో వేసి బాగా కలపాలి. పసుపు రంగు సిద్ధం అవుతుంది. పసుపు రంగు బంతి పూల రెక్కలను నీళ్లలో వేసి ఉడికించి తరవాత వడబోసి అందులో చిటికెడు పసుపు కలిపినా కూడా పసుపు రంగు తయారవుతుంది.
ఎరుపు రంగు
హోలీకి ముందు రోజు రాత్రి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు, దానిమ్మ తొక్కలు వేసి బాగా మరిగించాలి. ఉదయాన్నే ఈ నీళ్లు వడబోసి మరికొన్ని నీళ్లు కలిపితే ఎరుపు రంగు తయారవుతుంది. బకెట్ నీళ్లలో రెండు చెంచాల ఎర్రని కుంకుమ, చిటికెడు కార్న్‌ఫ్లోర్ వేసి కలిపినా కూడా క్షణాల్లో ఎరుపు రంగు తయారవుతుంది. కొన్ని ఎర్ర మందారం పూలను మిక్సీ గిన్నెలో వేసి అరచెంచా బియ్యం పిండి, తగిననన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బకెట్ నీళ్లలో వేసి బాగా కలిపి వడబోస్తే ఎరుపు రంగు సిద్ధం.
లేత ఆకుపచ్చ రంగు
కొన్ని ఉసిరి కాయలను మిక్సీ గిన్నెలో వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ నీటిని వడబోసి అందులో చిటికెడ్ కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు రాకుండా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు కలపవచ్చు. లేత ఆకుపచ్చ రంగు వస్తుంది.
వంకాయ రంగు
వంకాయ రంగులో ఉండే క్యాబేజీని చిన్న ముక్కలుగా కోసి మిక్సీ గిన్నెలో వేయాలి. ఇందులోనే కొన్ని క్యారెట్ ముక్కలు వేయాలి. తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.. ఈ మిశ్రమాన్ని వడబోసి మరికొన్ని నీళ్లు, చిటికెడ్ కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. చక్కని పర్పుల్ కలర్ తయారవుతుంది.
ముదురు గోధుమ రంగు
స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు, నాలుగు చెంచాల టీ పొడి లేదా రెండు చెంచాల కాఫీ పొడి వేసి బాగా మరిగించాలి. ఈ డికాషన్‌ని వడబోసి అర బకెట్ నీళ్లలో కలిపితే ముదురు గోధుమ రంగు తయారవుతుంది. కొద్దిగా రోజ్‌వాటర్ కలిపితే సువాసన వెదజల్లుతుంది.
ఆకుపచ్చ రంగు
ఒక గిన్నెలో మూడు చెంచాల గోరింటాకు పొడి, ఒక చెంచా బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసి పేస్టులా చేసి ఈ మిశ్రమాన్ని బకెట్ నీళ్లలో వేసి బాగా కలపాలి. చక్కని ఆకుపచ్చ రంగు తయారవుతుంది.
కాషాయం రంగు
ఒక బకెట్ నీళ్లలో నాలుగు చెంచాల తిరుచూర్ణం, చిటికెడ్ కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపితే కాషాయం రంగు సిద్దం అవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Soundarya husband Raghu: ఆ విషయంపై నిజమేంటో తేల్చి చెప్పిన సౌందర్య భర్త..
KTR Drone Flying Case: కేటీఆర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ.. అసలు విషయం ఇదే..