Third Eye: ‘మూడో కన్ను’ తెరుద్దాం!
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:28 AM
ఎందుకంటే అది కాంతిని అడ్డుకోలేదు. అదే గాలిలో కొద్దిగా పొగ ఉంటే... అది మనకు కనిపిస్తుంది. కాంతిని తనలోనుంచీ వెళ్ళనిచ్చే దేన్నీ మనం చూడలేం. ఇంద్రియాలైన మన రెండు కళ్ళ స్వభావం అది.

నేడు మహాశివరాత్రి
మానవులతో సహా అన్ని జీవులకూ పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు... ఏదైనా వస్తువును మనం చూస్తున్నామంటే... అది కాంతిని నిరోధించి, పరావర్తనం చెందడమే కారణం. గాలిని మనం చూడలేం. ఎందుకంటే అది కాంతిని అడ్డుకోలేదు. అదే గాలిలో కొద్దిగా పొగ ఉంటే... అది మనకు కనిపిస్తుంది. కాంతిని తనలోనుంచీ వెళ్ళనిచ్చే దేన్నీ మనం చూడలేం. ఇంద్రియాలైన మన రెండు కళ్ళ స్వభావం అది. ఈ ఇంద్రియనేత్రాలు భౌతికమైనవాటినే చూడగలుగుతాయి. మరి భౌతికం కాని వాటిని ఎలా చూడాలి? దానికి మూడో కన్ను కావాలి. కానీ ఎలా?
ఆ కథ అంతరార్థం...
శివుడు తన మూడో కన్ను తెరవడం గురించి ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. కామదేవుడైన మన్మధుణ్ణి జ్వలించే తన మూడో కంటితో శివుడు భస్మం చేసిన కథ అది. ఈ కథకు యోగాకు సంబంధించిన మరో కోణం ఉంది. శివుడు యోగ మార్గంలో కృషి చేస్తున్నాడు. అంటే కేవలం పరిపూర్ణత్వం కోసం కాదు, అపరిమితత్వం కోసం ఆయన ఆ కృషి సాగిస్తున్నాడు. తనలో కామం పెరగడాన్ని ఆయన గ్రహించాడు. ఇక్కడ ‘కామం’ అంటే అర్థం కేవలం శృంగారపరమైనది అని మాత్రమే కాదు. మనలో కలిగే ప్రతి కోరికా కామమే. అది అధికారం కోసం కావచ్చు, పదవి కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు... ఇలా దేని గురించైనా కావచ్చు. మీలో ఒక అసంపూర్ణ భావన ఉంటుంది. ‘నాకు అది లేకపోతే... నేను సంపూర్ణం కాదు’ అనే భావనతో తపించిపోవడమే కామం. తనలో అలాంటి భావన కలగడంతో... దాన్ని శివుడు దహించాడు. మూడో కన్ను తెరవడం ద్వారా... ఆయన తనలో భౌతికతకు అతీతమైన ఒక పార్శ్వాన్ని చూశాడు. ఇక భౌతికతకు సంబంధించిన నిర్బంధాలన్నీ చెదిరిపోయాయి.
ఉన్నది ఉన్నట్టుగా ఎలా చూడాలి?
మూడో కన్ను అనేది... భౌతికమైనది కానిదాన్ని చూడగలిగే కంటిని సూచిస్తుంది. భౌతికం కాని వాటిని చూడాలంటే మనకు ఒకే ఒక మార్గం... మనం అంతర్ముఖులం కావడం. ఇక్కడ ‘మూడో కన్ను’ అనే మాట కేవలం ప్రతీక మాత్రమే. అది నుదుటి మీద మొలిచేదో, పొడుచుకువచ్చేదో కాదు. భౌతికతకు అతీతమైన దాన్ని గ్రహించగలిగే దృష్టి కోణం. మరో అంశం ఏమిటంటే... ఇంద్రియ నేత్రాలు కర్మ కారణంగా కలుషితమై ఉంటాయి. ‘కర్మ’ అంటే గత చర్యల తాలూకు మిగిలిపోయిన జ్ఞాపకం. మీరు చూసే ప్రతిదీ ఆ కర్మ స్మృతులతో ప్రభావితం అవుతుంది. అది జరగకుండా మనం చెయ్యలేం. ఎవరినైనా మనం చూసినప్పుడు... ‘అతను బాగున్నాడు, ఇతను బాగోలేడు, అతను మంచివాడు, ఇతను మంచివాడు కాదు’ అని ఆలోచిస్తాం. ఉన్నది ఉన్నట్టుగా మనం దేన్నీ చూడలేం. ఎందుకంటే మన దృష్టినీ, మనం చూడగలిగే సామర్థ్యాన్నీ కర్మ స్మృతి ప్రభావితం చేస్తుంది. ప్రతిదాన్నీ ఉన్నది ఉన్నట్టుగా చూడాలంటే... లోతులకు చొచ్చుకుపోగలిగేదీ, జ్ఞాపకాలతో కలుషితం కానిదీ అయిన ఒక కన్ను తెరుచుకోవాలి. సంప్రదాయపరంగా... భారతదేశంలో జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం కాదు, ఎవరి మాటలనో వినడం కాదు, సమాచారాన్ని పోగు చేసుకోవడం కాదు. మనం ఏమిటనేది గ్రహించడం కోసం కొత్త దృష్టిని లేదా అంతర్ దృష్టిని తెరవడం. మనకు సంపూర్ణమైన స్పష్టత వచ్చేది... అంతర్ దృష్టి ఏర్పడినప్పుడు మాత్రమే. అప్పుడు మనలోని స్పష్టతను ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ పరిస్థితి చెదరగొట్టడం సాధ్యం కాదు. అదే నిజమైన జ్ఞానం. అది కలగాలంటే... మనలో మూడో కన్ను తెరుచుకోవాలి. అదే శివుడి మూడో కన్ను మనకు ఇచ్చే సందేశం. శివరాత్రి సందర్భంగా... మీలో ‘మూడో కన్ను’ తెరుచుకోవడానికి సాధన ప్రారంభించండి.
సద్గురు జగ్గీవాసుదేవ్
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News