Share News

కరాటే సిస్టర్స్‌

ABN , Publish Date - Jun 04 , 2025 | 06:56 AM

‘‘మనం రోజూ చూస్తున్నాం... ఎక్కడో అక్కడ మహిళల మీద నిత్యం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటి నుంచి తమను తాము రక్షించుకొనేలా ఆడపిల్లలు దృఢంగా మారాలి. అందుకు కరాటేలాంటి మార్షల్‌ ఆర్ట్స్‌ ఎంతో దోహదపడతాయి. కరాటే నేర్చుకొంటే ఆత్మరక్షణ మెళకువలు తెలుస్తాయి. దానివల్ల...

కరాటే సిస్టర్స్‌

కరాటే సిస్టర్స్‌

అమృతారెడ్డి, ఘనసంతోషిణిరెడ్డి... ఈ అక్కాచెల్లెళ్లు రికార్డులకు పెట్టింది పేరు. బద్దలు కొట్టడంలో కాదు... సరికొత్తవి సృష్టించడంలో. ఒకటా రెండా... కరాటేలో వీరు సంచలనాలకు మారుపేరు. ఇటీవలే 121 ఆత్మరక్షణ మెళకువలను కేవలం 9.36 నిమిషాల్లో ప్రదర్శించి మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రీడాకారులుగానూ సత్తా చాటుతున్నారు. రెండేళ్ల వయసులోనే మొదలైన తమ కరాటే జర్నీ గురించి అమృతారెడ్డి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘మనం రోజూ చూస్తున్నాం... ఎక్కడో అక్కడ మహిళల మీద నిత్యం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటి నుంచి తమను తాము రక్షించుకొనేలా ఆడపిల్లలు దృఢంగా మారాలి. అందుకు కరాటేలాంటి మార్షల్‌ ఆర్ట్స్‌ ఎంతో దోహదపడతాయి. కరాటే నేర్చుకొంటే ఆత్మరక్షణ మెళకువలు తెలుస్తాయి. దానివల్ల ఆత్మవిశ్వాసం, శరీర దారుఢ్యం పెరుగుతాయి. ఈ రెండూ తోడుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ధైర్యంగా ఎదిరించగలుగుతాం. ఇవన్నీ ఆలోచించే నాకు, మా చెల్లి ఘనసంతోషిణికి మా నాన్న గోపాల్‌రెడ్డి చిన్న వయసులోనే కరాటే శిక్షణ ప్రారంభించారు. నేను రెండేళ్లప్పుడు మొదలుపెడితే... చెల్లి తన మూడో ఏట ఇందులోకి వచ్చింది. అప్పటి నుంచి నిర్విరామంగా మా శిక్షణ సాగుతూనే ఉంది. మా నాన్నావాళ్లది కరీంనగర్‌. మేం పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లో. నాన్నకు ఇక్కడ కరాటే అకాడమీ ఉంది. నాకు ఒక తమ్ముడు. వాడు కూడా కరాటే నేర్చుకొంటున్నాడు. మా అమ్మ మాధవి గృహిణి. తను మినహా ఇంట్లో అందరం కరాటేలో ఉన్నాం. అమ్మ మా అందరికీ కావల్సినవన్నీ అందించి, ఎంతో ప్రోత్సహిస్తుంది.


  • నాన్న స్ఫూర్తితో...

ఊహ తెలియకముందే మేం కరాటే అభ్యాసం మొదలుపెట్టాం. కానీ పెరిగేకొద్దీ దానిపై మాకు ఇష్టం ఎక్కువైంది. మాకు స్ఫూర్తి మా నాన్నే. ఆయన 1994 నుంచి వందలమంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఒకే ఏడాదిలో వివిధ రంగాలకు చెందిన లక్ష మంది మహిళలకు ఉచితంగా ఆత్మరక్షణ మెళకువలు నేర్పి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మాలో ఆత్మస్థైర్యం నింపి, ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనేది ఆయన కోరిక. నాన్న మాకు గురువు మాత్రమే కాదు... మార్గదర్శి కూడా.

  • అన్నీ రికార్డులే...

ప్రస్తుతం నేను బీకాం సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. చెల్లి బీకాం ఫస్ట్‌ ఇయర్‌. తమ్ముడు టెన్త్‌. మేము చదువుకొంటూనే కరాటే అభ్యాసం కూడా కొనసాగిస్తున్నాం. నేనూ, మా చెల్లి కలిసి చాలా కొత్త రికార్డులు సృష్టించాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా ఏదో ఒక రికార్డు ప్రదర్శన ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌. ఒక ఏడాది 365 టైల్స్‌ను 365 సెకన్లలో పగులగొట్టాను. మరోసారి మేకులపై పడుకున్న నా మీద గ్రైనేట్‌ రాయి పెడితే... మాస్టర్‌ దాన్ని పగులకొడతారు. ఒక్కో రాయి 150 నుంచి 220 కిలోల బరువు ఉంటుంది. అలా 36 రాళ్లు 3 నిమిషాల్లో బ్రేక్‌ చేయాలనేది మా ప్రయత్నం. కానీ రెండు సెకన్ల ముందే పూర్తయింది. తరువాత నేను, మా చెల్లి కలిసి ఒక ఫీట్‌ చేశాం. నా కింద, మీద మేకులు ఉంటాయి. నాపైనున్న మేకుల మీద చెల్లి పడుకుంటుంది. తనపై 60 నాపరాళ్లు ఒక్కొక్కటే పెట్టి బ్రేక్‌ చేయాలి. 3.05 నిమిషాల్లో సాధించాం. చెల్లి 85 సిరామిక్‌ టైల్స్‌ను 84 సెకన్లలో పంచ్‌తో పగులగొట్టింది. వీటిల్లో ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, సూపర్‌ కిడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’తో పాటు కొన్ని గిన్నిస్‌ రికార్డులు కూడా ఉన్నాయి. ఇవన్నీ అంతకముందు ఎవరూ చేయని ఫీట్స్‌.

  • మరో ఘనత...

ఇటీవల మేం మరో రికార్డు సృష్టించాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 121 ఆత్మరక్షణ మెళకువల (సెల్ఫ్‌ డిఫెన్స్‌ టెక్నిక్స్‌)ను 9.36 నిమిషాల్లో ప్రదర్శించాం. మేం అనుకున్నది 11 నిమిషాల్లో పూర్తి చేయాలని. కానీ దాదాపు ఒకటిన్నర నిమిషం ముందే పూర్తి చేయగలిగాం. కరాటేలోని ఒక్కో చాప్టర్‌లో 11 టెక్నిక్స్‌ ఉంటాయి. అలా 11 చాప్టర్స్‌లో 11 చొప్పున మొత్తం 121 ఆత్మరక్షణ మెళకువలను ఎంచుకున్నాం. మాలాగా అందరు అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాలనేది ఈ ఫీట్‌ ఉద్దేశం. ‘ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో ఇది నమోదైంది.


  • అంతర్జాతీయ క్రీడల్లోనూ...

నేను అంతర్జాతీయ కరాటే క్రీడాకారిణి కూడా. ఇటీవల మలేషియా, సింగపూర్‌లో జరిగిన టోర్నీల్లో పాల్గొన్నాను. అలాగే ‘స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌’ గేమ్స్‌లోనూ పోటీపడ్డాను. ఎన్నో పతకాలు గెలిచాను. మా చెల్లి కూడా జాతీయ స్థాయి క్రీడాకారిణి. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ టోర్నీలకు వెళుతోంది. తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ‘బాలసూర్య’ ప్రభుత్వ అవార్డు అందుకుంది.

  • ఒలింపిక్స్‌... సివిల్స్‌...

ప్రస్తుతం నా లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం. అన్ని క్రీడల్లానే ‘అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ’ (ఐఓసీ)కి అనుబంధంగా ‘ప్రపంచ కరాటే సమాఖ్య’ (డబ్ల్యూకేఎస్‌) ఉంది. సమాఖ్య టోర్నీల్లో విజయాలు సాధించినవారికి మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆ పోటీలకు వెళ్లాలంటే ఇరవై ఏళ్లు నిండి ఉండాలి. వయసు పరంగా ఇప్పుడే నేను అర్హత సంపాదించాను. వాటిల్లో మంచి ప్రదర్శన కనబరిచి దేశం తరుఫున ఒలింపిక్స్‌ ఆడాలన్నదే నా సంకల్పం. రెండేళ్లుగా నేను కరాటేలో శిక్షణ కూడా ఇస్తున్నా. సాధ్యమైనంతమంది మహిళలకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పించి, వారిని శక్తిమంతులుగా చేయాలనే లక్ష్యంతోనే శిక్షణ ప్రారంభించాను. సివిల్స్‌లో ర్యాంకు సాధించి దేశానికి సేవ చేయాలనేది నా కల. నా కలలు, లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాను.’’


  • సహనం అవసరం...

కరాటేకు ప్రధానంగా కావల్సింది సహనం. ఎలాగైనా నేర్చుకోవాలనే ఒక బలమైన సంకల్పం. లేదంటే ప్రయత్నం మధ్యలోనే ఆగిపోతుంది. సహనం అనుభవంతో వస్తుంది. నేర్చుకొనే క్రమంలో శారీరక దారుఢ్యం మెరుగవుతుంది. కరాటేలో వైట్‌ బెల్ట్‌ నుంచి బ్లాక్‌ బెల్ట్‌ వరకు 12 లెవెల్స్‌ ఉంటాయి. ప్రస్తుతం నేను, చెల్లి ఆఖరి లెవెల్‌ చేస్తున్నాం. ఇది పూర్తయితే మమ్మల్ని ‘బ్లాక్‌ బెల్ట్‌ డాన్‌’ అంటారు. ఆత్మరక్షణ కోసం అయితే రోజుకు గంట సాధన సరిపోతుంది. మేమైతే ఆరేడు గంటలు సాధన చేస్తున్నాం. నేర్చుకొంటూ... నేర్పిస్తున్నాం. శిక్షణ తీసుకొనేవారే కాదు, యువత అంతా జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. జంక్‌ఫుడ్‌వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అమ్మాయిలకు చెప్పేదేంటంటే... ప్రతిఒక్కరూ కచ్చితంగా కరాటే నేర్చుకోండి. దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫెట్‌నెస్‌ మెరుగవుతుంది. మనలో భయాలను పోగొడుతుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని, ఆత్మస్థైర్యంతో మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. వేరొకరి సాయం కోసం ఎదురుచూడక్కర్లేదు. నా బలం అదే... ఆత్మవిశ్వాసం.’’

హనుమా

4-Sliders.jpg

నాదీ అదే కల...

అక్కలాగానే నాదీ అదే కల... ఒలింపిక్స్‌లో పాల్గొనాలి. సివిల్స్‌ ర్యాంకు సాధించి దేశానికి సేవ చేయాలి. అందుకే ఇటీవల మేం సాధించిన రికార్డును ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు అంకితం చేశాం. 2014లో, అంటే నాకు నాలుగున్నర ఏళ్లప్పుడు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి బహుముఖ ప్రజ్ఞగల బాలికగా ‘బాలసూర్య’ అవార్డు అందుకున్నాను. దాన్ని చూసినప్పుడు నా మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. స్ఫూర్తి రగులుతుంది. మరికొన్ని అవార్డులు కూడా తీసుకున్నాను. అలాగే ఐదేళ్లప్పుడు 39 నిమిషాల్లో 3,315సార్లు నెక్‌ రొటేట్‌ చేసి కొత్త రికార్డు నెలకొల్పాను. దీంతోపాటు మహిళా సాధికారత కోసం నావంతు బాధ్యతగా సాధ్యమైనంతమందికి కరాటే నేర్పించాలనేది నా సంకల్పం.

ఘనసంతోషిణి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 06:56 AM