అజ్ఞాతంలోనే ఆనందం
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:04 AM
చైనాలో ఉద్భవించిన తావో మతంలో లావోట్జూ తరువాత పేర్కొనదగినవాడు... ఆయన శిష్యుడైన చువాంగ్ ట్జూ. అతను మహా జ్ఞాని అని దేశంలో అందరూ చెప్పుకొనేవారు. ఈ సంగతి ఆ దేశపు చక్రవర్తి విన్నాడు. అలాంటి వ్యక్తి ...
సద్బోధ
చైనాలో ఉద్భవించిన తావో మతంలో లావోట్జూ తరువాత పేర్కొనదగినవాడు... ఆయన శిష్యుడైన చువాంగ్ ట్జూ. అతను మహా జ్ఞాని అని దేశంలో అందరూ చెప్పుకొనేవారు. ఈ సంగతి ఆ దేశపు చక్రవర్తి విన్నాడు. అలాంటి వ్యక్తి తన కొలువులో, తనకు సలహాదారుగా ఉండే బాగుంటందనుకున్నాడు. వెంటనే చువాంగ్‌ను తనవద్దకు తీసుకురావాలని భటుల్ని ఆజ్ఞాపించాడు.
అయితే... అతి సామాన్యమైన జీవితాన్ని గడిపే చువాంగ్ ఎల్లప్పుడూ అజ్ఞాతంగా ఉండాలని భావించేవాడు. ఎక్కడా స్థిరంగా ఉండకుండా తిరిగేవాడు. ఏదైనా గ్రామంలో కొన్నాళ్ళు గడిపాక... అక్కడి ప్రజలు అతని గొప్పతనాన్ని గుర్తించి, ప్రత్యేక గౌరవాన్ని కనబరచడం మొదలుపెట్టగానే... మరో గ్రామానికి వెళ్ళేవాడు. అక్కడ కూడా ఇంతే. ఎప్పుడూ అనామకుడుగా ఉండడానికే ఇష్టపడేవాడు. అలాంటి వ్యక్తిని తన సమక్షానికి తీసుకురావాలని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. భటులు ఊరూరా తిరిగారు, మూలమూలలు వెతికారు. కనబడినవారందరినీ అడిగారు. కానీ చువాంగ్ జాడ ఎన్ని రోజులైనా వారికి తెలియలేదు. వారు వెతికి వెతికి, అలసిపోయారు. నిరాశకు గురయ్యారు. ‘‘చువాంగ్‌ను ఎలా గుర్తించాలి?’’ అని అతని శిష్యుల్ని అడిగారు. ‘‘చువాంగ్ అత్యంత సామాన్యుడిగా ఉంటాడు. జనానికి దూరంగా... ఏమూలో ఒక మామూలు పని చేస్తూ ఉంటాడు’’ అని వాళ్ళు రాజభటులకు చెప్పారు.
చివరకు... ఒక గ్రామంలో చువాంగ్ ఉన్నాడని భటులకు తెలిసింది. వారు ఆ గ్రామానికి వెళ్ళి, ‘‘ఇక్కడికి కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారా?’’ అని అడిగారు. ‘‘అవును. అదిగో... అక్కడున్నాడు. నదిలో చేపలు పడుతున్నాడు’’ అంటూ గ్రామస్తులు అతణ్ణి చూపించారు. భటులు చువాంగ్ దగ్గరకు వెళ్ళి ‘‘మిమ్మల్ని తన సభకు తీసుకురమ్మని చక్రవర్తి మమ్మల్ని పంపారు. ఆయన కొలువులో ముఖ్య సలహాదారుగా నియమిస్తారట’’ అని చెప్పారు. ఇంకెవరైనా అయితే ఎగిరి గంతేసేవారే! అయితే... భటుల మాట విన్న చువాంగ్ ‘‘ఈ రాత్రి నన్ను కాస్త ఆలోచించనివ్వండి. రేపు ఉదయం నా నిర్ణయం చెబుతాను. తెల్లారిన తరువాత చక్రవర్తి దగ్గరకు వెళ్దాం’’ అన్నాడు. భటులు సంతోషంగా సమ్మతించారు. ఆ రాత్రి అక్కడే విశ్రమించారు.
మర్నాడు ఉదయం చూస్తే... వారికి చువాంగ్ కనిపించలేదు. రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. చక్రవర్తికి ఈ సంగతి భటులు తెలిపారు. ‘‘స్వాతంత్ర్యాన్ని, ఏకాంతాన్ని కోరుకొనే సాధువులు, సన్న్యాసులు ఎలాంటి పదవులకు, హోదాలకు, సత్కారాలకు ఆకర్షితులు కారు. అజ్ఞాతంగా ఉండడమే వారికి ఆనందదాయకం’’ అని చక్రవర్తి గ్రహించాడు.
రాచమడుగు శ్రీనివాసులు
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News