Share News

Jali Sarees: జాలీ చీరలతో జాలీగా

ABN , Publish Date - Nov 30 , 2025 | 02:03 AM

ఫ్యాషన్‌ ప్రపంచంలో చీరలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త హంగులు అద్దుకుంటూ నిత్య నూతనంగా కనువిందు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే జాలీ చీరల సందడి మొదలైంది...

Jali Sarees: జాలీ చీరలతో జాలీగా

ఫ్యాషన్‌ ప్రపంచంలో చీరలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త హంగులు అద్దుకుంటూ నిత్య నూతనంగా కనువిందు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే జాలీ చీరల సందడి మొదలైంది. రెడ్‌ కార్పెట్‌ వేడుకల నుంచి కొత్త సినిమా ప్రమోషన్ల వరకూ సందర్భం ఏదైనా సరే సెలబ్రిటీలు అందమైన జాలీ చీరలు చుట్టుకుని మెరిసి మురిసిపోతున్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు సైతం వీటికే ఓటేయడంతో ఈ ఏడాది ‘మెష్‌ అండ్‌ కట్‌వర్క్‌ జాలీ చీరలు’ అత్యుత్తమ ఫ్యాషన్‌ ట్రెండ్‌గా నిలిచాయి.

మెరిసిన జెన్నిఫర్‌

గతవారం ఉదయ్‌పూర్‌లో జరిగిన నేత్ర మంతెన, వంశీ గాదిరాజుల వివాహ వేడుకలకు హాజరైన జెన్నిఫర్‌ లోపెజ్‌.. కట్‌-వర్క్‌ చేసిన లేత గులాబీ రంగు జాలీ చీర ధరించి వేదిక మీద ఆడి పాడారు. ఆమె ఇచ్చిన ప్రదర్శన కంటే కట్టుకున్న చీరే అందరి దృష్టినీ ఆకర్షించింది. జెన్నిఫర్‌ విదేశీ వనిత అయినప్పటికీ ఆ చీర కట్టులో భారతీయత ఉట్టిపడడం గమనార్హం. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ అరుదైన చీరను రూపొందించారు. చీర మొత్తాన్ని ల్యాటిస్‌ ప్యాట్రన్‌లో కట్‌ వర్క్‌ చేసి ఎంబ్రాయిడరీ వర్క్‌లు జోడించి స్వరోవస్కీ క్రిస్టల్స్‌తో డిజైన్‌ చేశారు. హెవీ సీక్విన్‌ వర్క్‌తో రూపొందించిన స్ట్రాప్‌లెస్‌ బ్లౌజ్‌.. చీరకు మరింత అందాన్నిచ్చింది. పాప్‌ సింగర్‌ను గుర్తుకు తెచ్చేలా చీర కొంగును చేతుల మీదుగా కిందికి జారవిడిచారు. నియాన్‌ లైట్ల కాంతికి చీరంతా తళుకులీనుతూ కనువిందు చేసింది. వజ్రాలు, పచ్చలు పొదిగిన పెద్ద చోకర్‌, జుంకాలు, మాంగ్‌ టిక్కా, ఉంగరాలు, గాజులు ధరించి గ్లామ్‌ మేక్‌పతో మెరిసిపోయారు జెన్నిఫర్‌.


పూల పల్లూతో జాన్వీ

పరమ్‌ సుందరి సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో జాన్వీ కపూర్‌.. తెల్లని ల్యాటిస్‌ ప్యాట్రన్‌ జాలీ వర్క్‌ శారీతో సందడి చేశారు. చీర అంచులతోపాటు అక్కడక్కడా చేర్చిన గులాబీల ఎంబ్రాయిడరీ వర్క్‌ చీర సొగసును పెంచింది. తాజా మల్లె మొగ్గలు, రజనీగంధ పూలను మెష్‌ ప్యాట్రన్‌లో అల్లి ఈ చీర కొంగును రూపొందించారు. గులాబీ పూల ఎంబ్రాయిడరీ, సీక్విన్‌ వర్క్‌లతో బ్లౌజ్‌ను కూర్చారు. ప్రఖ్యాత తోరణి లేబుల్‌ ఈ చీరను ప్రత్యేకంగా కస్టమైజ్‌ చేసింది. వేలికి పెద్ద వజ్రపుటుంగరం, సాదా హిల్స్‌తో డీసెంట్‌గా కనిపించారు జాన్వీ.

గూచీ శారీతో అలియా

కేన్స్‌ ఫెస్టివల్‌ ముగింపు వేడుకల్లో రెడ్‌ కార్పెట్‌ మీద సీక్విన్డ్‌ గూచీ జాలీ చీరతో నడిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు అలియా భట్‌. ప్రఖ్యాత స్టయిలిస్ట్‌ రియా కపూర్‌ ఈ చీరను డిజైన్‌ చేశారు. ప్లంజింగ్‌ బ్లౌజ్‌, స్ట్రయిట్‌ స్కర్ట్‌, నేలను తాకే దుపట్టా లాంటి కొంగు ఈ చీర ప్రత్యేకత. వింటేజ్‌ లుక్‌లో కనిపించే డైమండ్‌ టెన్నిస్‌ నెక్లెస్‌ ధరించి భారతీయ వారసత్వాన్ని అందంగా ప్రదర్శించారు అలియా.

వెండి కట్‌వర్క్‌ పల్లూతో నీతా

ఇటీవల బ్రిటిష్‌ మ్యూజియంలో జరిగిన పింక్‌ బాల్‌ వేడుకల్లో నీతా అంబానీ లైట్‌ పింక్‌ కాంచీవరం చీర ధరించి మెరిసిపోయారు. ఈ చీరను స్వదేశీ చేనేతకారుడు ఆర్‌. వరదన్‌ రూపొందించారు. చీర కొంగును మాత్రం వెండి కట్‌వర్క్‌తో మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేశారు. బెజ్వెల్డ్‌ బటన్స్‌తో కూడిన కోర్సెట్‌ బ్లౌజ్‌ ధరించి కుడి చేతి మీదుగా కొంగు వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నీతా.


ఎలా తయారుచేస్తారంటే...

జాలీ అంటే సన్నని వల(నెట్‌) అని అర్థం. చీర ఫ్యాబ్రిక్‌ను నెట్‌ మాదిరి డిజైన్‌ చేయడమే ఈ శైలి ప్రత్యేకత. సూదితో ఫ్యాబ్రిక్‌ దారాలను విడదీసి అందమైన నెట్‌ డిజైన్‌ను సృష్టిస్తారు. ఇది చికంకారి ఎంబ్రాయిడరీ, కోట డోరియా నేతలను పోలి ఉంటుంది. కొన్ని డిజైన్లను చీరలమీదే రూపొందిస్తుంటారు. ఎంబ్రాయిడరీ, జర్దోసీ వర్క్‌లతో కూడా అందమైన జాలీ డిజైన్లను సృష్టిస్తున్నారు. ఇలాంటివి పట్టు చీరల మీద బాగుంటాయి. ఆర్గంజా లాంటి సన్నని ఫ్యాబ్రిక్‌ల మీద కట్‌ వర్క్‌ను ఉపయోగించి వినూత్నమైన డిజైన్లు తయారుచేస్తున్నారు. లేజర్‌ కట్‌లు, ఆర్కిటెక్చరల్‌ మెష్‌లు, హ్యాండ్‌ కట్‌ ల్యాటిస్‌ వర్క్‌లు, మెటల్‌ మెష్‌లు, మెరిసే కేజ్‌లు, పూసల గ్రిడ్‌లతో సరికొత్త జాలీ డిజైన్లు సృష్టిస్తున్నారు. జాలీ చీరలు కట్టుకున్నప్పుడు వాటికి మ్యాచ్‌ అయ్యేలా సొగసైన రిచ్‌ బ్లౌజ్‌ ధరించడం తప్పనిసరి.

ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 30 , 2025 | 02:03 AM