Bhagavad Gita: దేవుడు చేయిస్తున్నాడా మనమే చేస్తున్నామా
ABN , Publish Date - Dec 12 , 2025 | 02:10 AM
Is God Doing It or Are We Insights from the Bhagavad Gita on Action and Divine Will
భగవద్గీత
భగవద్గీతలోని ‘విశ్వరూప సందర్శన యోగం’లో కృష్ణపరమాత్మ తన విశ్వరూపాన్ని చూపగానే అర్జునుడు వణికిపోయాడు. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి వివరిస్తున్న సంజయుడు... ఆ విశ్వరూపం ఎలా ఉందో చెప్పాడు.
దివి సూర్య సహస్రస్య భవేద్యగపదుత్థితా
యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః
‘‘ఆకాశంలో ఒక్కసారికి వేల సూర్యులు ఉదయిస్తే కనిపించే కాంతి... ఈ కాంతికి సాటిరాదు!’’ అని అర్థం.
మన అందరికీ ఈ విశ్వరూపం గురించి తెలుసు... ముఖ్యంగా తెలుగువారికి ఎన్టీరామారావు పౌరాణిక సినిమాల ధర్మమా అని. మహాభారతం ఇంకా బాగా తెలుసు. ఆశ్చర్యమేమిటంటే... ఎక్కడో అమెరికాలో, కొన్ని దశాబ్దాల క్రితం హార్వర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న ఒక అణు శాస్త్రజ్ఞుడికి... మొదటి అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు చూసిన విస్ఫోటనం... ఈ శ్లోకాన్ని గుర్తుకుతెచ్చిందట. ‘ఫాదర్ ఆఫ్ ది ఆటమిక్ బాంబ్’గా పిలుపులందుకున్న ఆ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తకు భగవద్గీత మతాలకు అతీతమైన గ్రంథం. గీతను పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం సంస్కృతం నేర్చుకొనే ప్రయత్నం కూడా చేశాడట.
1945 జూలై 16. అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చేసిన ప్రయోగం అది. మనం పోక్రాన్‌లో చేసినట్టు వాళ్ళు మెక్సికోలో చేసినప్పుడు... ఆ విస్ఫోటనం ఎలా కనబడిందో చెప్పడానికి, పోల్చడానికి భగవద్గీతలో విశ్వరూపం తప్ప మరో పోలికే కనిపించలేదు ఓపెన్ హోమర్‌కి. నెలరోజుల తరువాత హిరోషిమా-నాగసాకిల మీద అమెరికా అణుబాంబు ప్రయోగించింది. ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలలో ఇదే అత్యంత క్రూరమైన ఆయుధ ప్రయోగం అయి ఉండవచ్చు. 1945 ఆగస్టు 9 ప్రపంచంలోనే ఒక చీకటి రోజు. సుమారు లక్షన్నరమంది జనం... పిల్లలు, స్త్రీలు, వృద్ధులతో సహా మాడి మసైపోయారు. బాంబు పేలిన ప్రాంతాలు శ్మశానాల దిబ్బల్లా ఎందుకూ పనికిరాకుండా పోయాయి. (ఇప్పటికీ రేడియేషన్ ప్రభావం ఎంతమేరకు ఉందనేది ఇంకా అను(ణు)మానమే). ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర పితామహుడు ఓహెన్ హోమర్ తీవ్రమైన విమర్శలకు గురయ్యాడు. ఐన్‌స్టీన్ స్థాయి మేధావులతో సహా గొప్ప గొప్పవారందరూ ‘‘ఛీ... ఇంత దారుణమా?’’ అంటూ ఈసడించారు. (కొన్నాళ్ళ తరువాత ఐన్‌స్టీన్, ఓహెన్ హోమర్ కలిసి... అణుబాంబు వ్యతిరేక ప్రచారకులుగా ముందువరుసలో నిలిచారు).
అపరాధ భావనతో అమెరికన్ ప్రభుత్వాలు కూడా తనకు చేస్తున్న అవమానాల భారంతో కుంగిపోయిన ఓపెన్ హోమర్‌కు భగవద్గీతలోనే ఉపశమనం లభించి ఉంటుంది. ఇరవయ్యేళ్ళ తరువాత బి.బి.సి.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘చరిత్రలోనే అత్యంత దారుణమైన నరమేధానికి కారకులైన మీకు... అణుబాంబు ప్రయోగం, హిరోషిమా, నాగసాకీల విధ్వంసం విషయంలో ఏమనిపిస్తూ ఉంటుంది?’’ అనే ప్రశ్నకు...
కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః
ఋతేపిత్వాం న భవిష్యంతి సర్వే
యే వస్థితాచి ప్రత్యనీకేషు యోధాః...
‘‘లోకాన్ని తుదముట్టించడానికి విజృంభించిన మహాకాలుడను. నువ్వు యుద్ధం చేయకపోయినా వీరెవరినీ మిగలనివ్వను...’’ ఇవి అర్జునుడితో కృష్ణుడు చెప్పిన మాటలు. ఇవే చెప్పాడు ఓపెన్ హోమర్. ‘‘ప్రపంచంలోనే అతి గొప్ప గ్రంథమైన భగవద్గీతలో దేవుడు చెప్పిన మాటలివి’’ అన్నాడు. భూగోళానికి అవతలపక్క ఉన్న అమెరికాలో ఒక మేధావి... ఇటువైపు ఎక్కడో ఇండియా అనే ఉపఖండంలో... అత్యంత పురాతనం, సనాతనం అయిన ఒక సంప్రదాయం వేల సంవత్సరాలుగా మనుగడలో ఉందనీ, ఆ జనానికి ‘భగవద్గీత’ అనే దేవుడు పాడిన పాటను స్మరించుకోవడం అలవాటనీ ఎలా తెలిసిందో! ‘‘నేను చేసిందేమీ లేదు. నేను పైవాడి చేతిలో పనిముట్టును మాత్రమే...’’... ఎంత గొప్ప ఉపశమనం! జరిగినది గొప్ప పనైనా, చెడ్డ పనైనా మనం ఒక ఉపకరణమే తప్ప, మనమే కారకులం అనుకోవడం అహంకారం అవుతుందన్నాడు కృష్ణుడు.
అలాగని చెప్పి ‘‘అంతా దేవుడే చేయిస్తున్నాడండీ! నేనేం చెయ్యగలను?’’ అని కేడీ పనులు చేసేస్తూ సమర్థించుకోవడాన్ని కృష్ణుడు ఒప్పకోడు. నీ ఆలోచన, నీ ప్రమేయం, నీ కృషి లేకుండా ఏ పనీ జరగదంటాడు. పరస్పర విరుద్ధమైన ప్రతిపాదనలుగా అనిపిస్తోంది కదా! అందుకే భగవద్గీత వేల సంవత్సరాలుగా ఒక ప్రామాణిక గ్రంథంగా నిలిచిపోయింది. ఇంతకీ దేవుడే చేయిస్తున్నాడా, మనమే చేస్తున్నామా? అది తెలుసుకోవాలంటే మరింత లోతుగా వెళ్ళి పరిశీలించడానికి ప్రయత్నించాలి.
ఉండవల్లి అరుణ్‌కుమార్
ఇవీ చదవండి:
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..
మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన