Valentine’s Day: ఈ కథ ఇలా మొదలైంది!
ABN , Publish Date - Feb 13 , 2025 | 06:03 AM
ప్రేమ అనేది అపురూపమైన భావన. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేక సమయం అవసరం లేదు. అయినా తమ ప్రేమను తెలిపేందుకు ప్రేమికులంతా ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అదే ఫిబ్రవరి 14... ప్రేమికుల రోజు. ఈ రోజుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాల సమాహారం... మీ కోసం.

వారం ముందు నుంచే...
ప్రేమికుల రోజుకి వారం ముందు అంటే ఫిబ్రవరి ఏడు నుంచే వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుంటారు. ఒక్కో రోజును ఒక్కో పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్ డే, 8న ప్రపోజ్ డే, 9న చాకొలేట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే, 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపేస్తారు.
ఎలా మొదలైంది?
రోమ్‌లో వాలెంటైన్ అనే క్రైస్తవ ప్రవక్త... ప్రేమతో జీవించడాన్ని ఇష్టపడేవాడు. ఆ దిశలోనే యువతీ యువకులను ప్రోత్సహించేవాడు. సమాజంలో పెరుగుతున్న హింస, స్వార్థం, ద్వేషం లాంటి చెడు గుణాలపై పోరాడేందుకు ప్రేమను మించిన ఆయుధం లేదని చెప్పేవాడు. రోమ్ చక్రవర్తి కూతురు ఇతని పట్ల ఆకర్షితురాలవుతుంది. యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ వాలెంటైన్‌కు రోమ్ చక్రవర్తి మరణశిక్ష విధిస్తాడు. ఈ సంఘటన జరిగిన రెండు దశాబ్దాల తరవాత అప్పటి పోప్ ఫిబ్రవరి 14ని ప్రేమికుల రోజుగా ప్రకటించాడు. అప్పటి నుంచి వాలెంటైన్ పేరు మీద ప్రేమికుల రోజు (వాలెంటైన్స్‌డే)ను జరుపుకుంటున్నారు.
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ప్రేమికుల రోజు ఉత్సవాన్ని జరుపుకుంటారు. రకరకాల బహుమతులు, పువ్వులు, గ్రీటింగ్ కార్డులు, విందులు, వినోదాలతో తమ ప్రేమను తెలియజేస్తుంటారు.
ఏ దేశంలో ఎలా....?
ఫిన్లాండ్‌లో ఈ రోజుని స్నేహితుల దినోత్సవంలా జరుపుకుంటారు. స్నేహితులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారంటే తమకు ఎంత ఇష్టమో తెలియజేస్తూ రకరకాల బహుమతులు, బొకేలు ఇచ్చుకుంటారు.
జపాన్‌లో మహిళలు తమ భాగస్వాములకు చాక్లెట్లు, ఆభరణాలు బహుమతిగా ఇస్తారు. జంటగా తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళతారు. ఒక నెల తరవాత అంటే మార్చి 14న బహుమతి పొందిన పురుషులంతా వైట్ డే ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున వీరు తమ భార్యలకు బహుమతులు, నగలు ఇస్తారు.
డెన్మార్క్, నార్వే దేశాల్లో ప్రేమికులు మాత్రమే కాదు...... స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. అందరూ కలిసి రకరకాల ఆటలు ఆడుకుంటారు. పేరు తెలియకుండా తమకు ఇష్టమైనవారికి బహుమతి పంపుతారు. ఇది అందుకున్నవారు ఎవరు పంపారో చెప్పాలి. లేదంటే వచ్చే ఏడాదికి ఒక బహుమతి బాకీ ఉన్నట్లు భావిస్తారు.
ఇంగ్లాండ్‌లో పిల్లలంతా కలిసి స్వీట్స్, పండ్లు, వాలెంటైన్ బన్స్ పంచుకుంటారు.
జర్మనీలో ప్రేమ, శృంగారం రెంటిని సూచించేలా పంది బొమ్మలతో కూడిన బహుమతులు ఇచ్చుకుంటారు.
ఫిలిప్పీన్స్‌లో సామూహిక వివాహాలు జరుపుతారు. వందలాది జంటలను కలుపుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తుంది
దక్షిణాఫ్రికాలో ఫిబ్రవరి 15న వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. ఇక్కడి మహిళలు తమ ప్రేమికుని పేరుని ధైర్యంగా దుస్తులకు పిన్ చేసుకుంటారు.
తైవాన్‌లో ప్రేమికులు పువ్వులను ఇచ్చుకుంటారు. ఇక్కడి పురుషులు 108 ఎర్ర గులాబీలతో కూడిన పెద్ద గుత్తిని తమ ప్రేమికురాలికి పంపుతారు.
దక్షిణ కొరియాలో జంటలు చాక్లెట్లు, బహుమతులు ఇచ్చుకుంటారు. జపాన్‌లోలాగే మార్చి 14న వైట్ డే జరుపుకుంటారు. ఏప్రిల్ 14న తాము సింగిల్‌గా ఉన్నామని సూచిస్తూ బ్లాక్ డే వేడుకలు చేసుకుంటారు. ఈ రోజున నల్ల బీన్ సాస్‌తో ఉన్న నూడుల్స్ తింటారు.
ఇవి కూాడా చదవండి..
Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Kejriwal: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.