Share News

Ideal Dimensions for Deity Idols: ఇంట్లో విగ్రహం ఎత్తు ఎంత ఉండాలి

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:03 AM

మన ఇంటి పూజామందిరంలో దేవుని విగ్రహం ఎంత ఎత్తులో ఉండొచ్చు? ఏ లోహంతో లేదా ద్రవ్యంతో చేయించుకోవాలి? ఎలాంటి విగ్రహాలు ఉండాలి? ఇలాంటి అనేక సందేహాలు రావడం...

Ideal Dimensions for Deity Idols: ఇంట్లో విగ్రహం ఎత్తు ఎంత ఉండాలి

తెలుసుకుందాం

మన ఇంటి పూజామందిరంలో దేవుని విగ్రహం ఎంత ఎత్తులో ఉండొచ్చు? ఏ లోహంతో లేదా ద్రవ్యంతో చేయించుకోవాలి? ఎలాంటి విగ్రహాలు ఉండాలి? ఇలాంటి అనేక సందేహాలు రావడం సర్వసాధారణం. తిరువారాధన చేసుకోవడానికి గృహస్థులు తమ ఇళ్ళలో పెట్టుకొనే విగ్రహాలు ఎంత ఎత్తులో ఉండాలనే నియమాన్ని ఆగమ, శిల్ప శాస్త్రాలు కొన్ని సూచిస్తున్నాయి. అలాగే పెద్దలనుంచి అనూచానంగా వస్తున్న కొన్ని సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

గృహస్థులు తమ ఇళ్ళలో ఆరాధనలను తమ కోసం, తమ కుటుంబం కోసం, వంశవృద్ధి కోసం నిర్వహిస్తారు. కాబట్టి దాన్ని ‘ఆత్మార్థ పూజ’ అంటారు. దేవాలయాల్లో జరిగే ఆరాధన లోకోపకారం కోసం, లోకక్షేమం కోసం. కాబట్టి దాన్ని ‘పరార్థ పూజ’ అంటారు. కనుక గృహారాధన విగ్రహాలు ఆ ఇంటి యజమాని చేతిలోని కొన్ని ముఖ్యమైన భాగాల ప్రమాణాన్ని బట్టి ఉండాలి. దీనిలో నాలుగు విధానాలు ఉన్నాయి.

హస్తప్రమాణం: సాధారణంగా ఒక మనిషి దేహం అతని అరచేతికి ఎనిమిదిరెట్లు ఉంటుంది. అరచేతితో సమానంగా అతని ముఖం ఉంటుంది. అలాగే పాదం ముందుభాగం అరచేతి కొలతతో సరిపోతుంది. శిల్పశాస్త్రంలో ఈ అరచేతి కొలతను ‘హస్తప్రమాణం’ అని, ఆ కొలతలను అనుసరించే విధానాన్ని ‘తాళమానం’ అని పిలుస్తారు. ఎక్కువలో ఎక్కువ ఆ హస్త ప్రమాణానికి మించి విగ్రహాలు ఉండకూడదని ‘పద్మసంహిత’ చెబుతోంది. యజమాని అరచేతి కొలతను తీసుకొని, విగ్రహం పాదం నుంచి లలాటం వరకూ కొలతను దానికి సమానంగా నిర్ణయించాలి. అదనంగా ప్రమాణం ప్రకారం కిరీటం, పాదపీఠం చేర్చి, విగ్రహం ఎత్తును నిర్ణయించాలి. అలా తయారుచేసిన విగ్రహాలకు ఆచార్యులద్వారా ప్రాణప్రతిష్ఠ చేయించి, ఆరాధనలు జరుపుకోవాలి. ఇంత ఎత్తుగా పూజలో పెట్టుకున్న విగ్రహాలకు నిత్య ఆరాధన చేయాలి, వండిన పదార్థాలను ప్రతిరోజూ నివేదన చేయాలి.


హృదయప్రమాణం: విగ్రహం యజమాని కుడిచేతి గుప్పెడంత ఉండాలని మన ఋషులు చెప్పారు. దాన్ని నేటి పరిస్థితికి అన్వయించుకుంటే... మనిషి గుండె అతని గుప్పెడంత ఉంటుందని ఆధునిక విజ్ఞానం కూడా ధ్రువపరిచింది. అందుకే తిరువారాధనలో ఉంచే విగ్రహాలకు హృదయప్రమాణాన్ని కూడా నిర్దేశించారు. యజమాని అరచేతిని గుప్పెడుగా బిగించి, ఆ కొలతతో విగ్రహం ఎత్తును పాదాది లలాటాంతం (అరికాలి నుంచి నుదుటి వరకు) స్థిరపరచి, కిరీటాన్ని, పీఠాన్ని చేర్చి విగ్రహం నిర్మిస్తారు. లేదా విగ్రహం మొత్తం ఎత్తును ఆ కొలతలో ఇమిడేలా చేస్తారు.

అంగుష్టప్రమాణం: యజమాని కుడిచేతి బొటనవేలు కొలతతో విగ్రహాన్ని తయారుచేసే పద్ధతి కూడా ఉంది. దేహంలో అన్ని భాగాలూ ముఖ్యమైనవే. కానీ అందులోని అతి ముఖ్యమైన భాగాలలో కుడిచేతి బొటనవేలు ఒకటి. మహాభారతంలో ద్రోణాచార్యుడు... తననే ఆచార్యునిగా భావించి, సొంతంగా విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుణ్ణి కట్టడి చేయడానికి... గురుదక్షిణగా కుడిచేతి బొటనవేలును అడిగిన కథ మనకు తెలుసు. దీన్నిబట్టి దాని ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. మన ప్రాచీన శిల్ప శాస్త్రాలలో అంగుష్టప్రమాణంతో విగ్రహాలు నిర్మించి, ఆరాధన చేసే సంప్రదాయాన్ని కూడా నిర్దేశించారు.

మాత్రాప్రమాణం: యజమాని కుడిచేతి మధ్యవేలి మధ్య కణుపు ఎత్తు కానీ, వెడల్పుకానీ, చుట్టుకొలతను కానీ ప్రమాణంగా లెక్కిస్తే వచ్చే పొడవును ‘మాత్రాంగుళం’ అంటారు. దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాల కొలత తీసుకొనేటప్పుడు ఈ మాత్రాంగుళానికి కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. గృహారాధనలో పైనచెప్పిన మూడు కొలతల్లో ఏదో ఒకదాన్ని తీసుకొని విగ్రహ నిర్మాణం చేసుకోవచ్చు.

ఇవీ చదవండి:

వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..

మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన

Updated Date - Dec 12 , 2025 | 02:03 AM