అల్లం తాజాగా
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:37 AM
మనం తరచూ అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అల్లం తాజాగా ఉంటేనే వంటకాల రుచి పెరుగుతుంది. అలాగే శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. బజారు నుంచి కొని తెచ్చిన తరవాత సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అల్లం త్వరగా చెడిపోతుంది. అలాకాకుండా అల్లాన్ని నిల్వ చేసే విధానాల గురించి తెలుసుకుందాం...
మనం తరచూ అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అల్లం తాజాగా ఉంటేనే వంటకాల రుచి పెరుగుతుంది. అలాగే శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. బజారు నుంచి కొని తెచ్చిన తరవాత సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అల్లం త్వరగా చెడిపోతుంది. అలాకాకుండా అల్లాన్ని నిల్వ చేసే విధానాల గురించి తెలుసుకుందాం...
అల్లాన్ని నిల్వ చేసేముందు దాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. తేమ ఎక్కువగా లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి.
శుభ్రంగా, పొడిగా ఉన్న అల్లాన్ని ఒక కాగితంలో చుట్టి గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే నెల రోజులపాటు నిల్వ ఉంటుంది. అదే గాలి ఆడేలా ఒక ప్లాస్టిక్ బుట్టలో పెడితే పది రోజులు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది.
పేపర్ టవల్‌ను నీళ్లతో కొద్దిగా తడపాలి. దానితో అల్లాన్ని చుట్టి ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే అల్లం తేమతో తాజాగా ఉంటుంది.
అల్లాన్ని తడి మట్టితో కప్పి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మట్టి తడారిపోకుండా రెండు రోజులకు ఓసారి నీళ్లు చల్లుతూ ఉండాలి. పూర్వం ఈ పద్ధతినే అనుసరించేవారు.
అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి లేదంటే తురుముకుని జిప్‌లాక్ కవర్‌లో వేసి ఫ్రీజర్లో ఉంచితే ఆర్నెల్లు తాజాగా ఉంటుంది.
తొక్కతీసి సన్నని ముక్కలుగా తరిగి ఎండలో ఆరబెట్టాలి. తేమ లేకుండా ఎండిన అల్లం ముక్కలను ఒక డబ్బాలో భద్రపరచుకుంటే ఏడాది పాటు వాడుకోవచ్చు.
అల్లాన్ని సన్నగా తురిమి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో నింపి గట్టిగా మూత బిగించి ఫ్రిజ్‌లో పెడితే నెల రోజులు తాజాగా ఉంటుంది.
అల్లాన్ని పెద్ద మొత్తంలో నిల్వ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఒక గాజు సీసాలో వేసి పైన తగినంత వెనిగర్ లేదా తేనె వేసి ఉంచితే చాలు. దీనివల్ల అల్లం తాజాగా ఉండడమే కాకుండా దానిలోని ఔషధ గుణాలు పెరుగుతాయి.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి