సోఫా కవర్ల మట్టి వదిలించాలంటే...
ABN , Publish Date - Feb 11 , 2025 | 10:57 PM
సోఫా కవర్లను కాటన్, మైక్రోఫైబర్, పాలిస్టర్, లినెన్, వెల్వెట్ ఫాబ్రిక్‌లతో రూపొందిస్తూ ఉంటారు. ఫాబ్రిక్‌ని బట్టి వీటిని శుభ్రం చేసే విధానం మారుతూ ఉంటుంది. వివిధ రకాల సోఫా కవర్లను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం!
సోఫా కవర్లను కాటన్, మైక్రోఫైబర్, పాలిస్టర్, లినెన్, వెల్వెట్ ఫాబ్రిక్‌లతో రూపొందిస్తూ ఉంటారు. ఫాబ్రిక్‌ని బట్టి వీటిని శుభ్రం చేసే విధానం మారుతూ ఉంటుంది. వివిధ రకాల సోఫా కవర్లను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం!
ముందుగా సోఫాపై ఉన్న లేబుల్‌ను పరిశీలిస్తే కవర్‌ను ఏ మెటీరియల్‌తో రూపొందించిందీ తెలుస్తుంది. దాన్ని శుభ్రం చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక అవగాహన వస్తుంది.
కాటన్, పాలిస్టర్, లినెన్, వెల్వెట్ కవర్లను వాషింగ్ మెషిన్‌లో వేసేకన్నా చేతితో ఉతకడం మంచిది. దీనివల్ల ఫాబ్రిక్ నాణ్యత పాడవకుండా ఉంటుంది. ముందుగా వీటిని మంచినీళ్లలో ముంచి తీయాలి. తరవాత సర్ఫ్, షాంపూ, డిటర్జెంట్ కలిపిన నీళ్లలో ఇరవై నిమిషాలు నానబెట్టాలి. చేతులతో సున్నితంగా ఉతికి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. గట్టిగా పిండకుండా నీడలో ఆరేయాలి. ఇవి పూర్తిగా ఆరిన తరవాత వెల్వెట్ మినహా అన్నింటినీ తక్కువ వేడితో ఇస్త్రీ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
మైక్రోఫైబర్ కవర్లు చాలా సున్నింతంగా ఉంటాయి. ముందుగా వీటిని బాగా దులిపి దుమ్ము, ధూళి వదిలించాలి. తరవాత డిజర్జెంట్ లేదా షాంపూ కలిపిన నీళ్లలో ముంచి తీయాలి. మరోసారి చల్లని నీళ్లలో ముంచి తీసి నీడలో ఆరేయాలి.
లెదర్ కవర్ల మీద దుమ్ము నిలవదు. కాబట్టి వీటిని శుభ్రం చేయడం తేలిక. పలుచని బట్ట లేదా స్పాంజ్‌ని డిజర్జెంట్ నీళ్లలో ముంచి పిండాలి. దీనితో కవర్‌ను శుభ్రంగా తుడవాలి. తరవాత ఫ్యాన్ గాలికి ఆరనిస్తే సరిపోతుంది.
సోఫా కవర్లను తరచూ వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేస్తూ ఉంటే వాటిపై పేరుకునే దుమ్ము పోతుంది. మరకలు పడితే వెనిగర్, ఆల్కహాల్, శానిటైజర్ వేసిన దూదితో రుద్ది తొలగించాలి. దీంతో కవర్లను వెంట వెంటనే డ్రైక్లీనింగ్ లేదా ఉతికే అవసరం రాదు.