Share News

Soumita Basus Zyenika: వారి కోసం స్టయిలి్‌షగా

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:19 AM

కండరాల బలహీనత చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. ఏ పనీ సొంతగా చేసుకోలేని పరిస్థితి. ఆఖరికి దుస్తులు ధరించాలన్నా వేరొకరి సాయం తప్పనిసరైంది. ఈ అసౌకర్యానికి చెక్‌ పెడుతూ...

Soumita Basus Zyenika: వారి కోసం స్టయిలి్‌షగా

స్ఫూర్తి

కండరాల బలహీనత చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. ఏ పనీ సొంతగా చేసుకోలేని పరిస్థితి. ఆఖరికి దుస్తులు ధరించాలన్నా వేరొకరి సాయం తప్పనిసరైంది. ఈ అసౌకర్యానికి చెక్‌ పెడుతూ... తనలాంటివారి కోసం వినూత్న డిజైన్లు రూపొందించారు సౌమిత బసు. అమ్మ అండతో ‘జైనికా’ పేరుతో ఒక సంస్థ నెలకొల్పి... వైకల్యంగలవారికే కాకుండా వృద్ధులకు సైతం సులువుగా ధరించగలిగే సౌకర్యవంతమైన వెరైటీలు అందిస్తున్నారు.

‘‘కష్టాలు అందరికీ ఉంటాయి. జీవితమన్నాక పరీక్షలు ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకొని ముందుకు సాగితేనే కదా బతుకు బండి నడిచేది. ఒక లక్ష్యం... దాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చు. ఇది నాకు అనుభవం నేర్పిన పాఠం. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా మహానగరం మాది. బాల్యం సంతోషంగా సాగిపోయింది. కానీ కాలేజీలోకి అడుగుపెట్టాక పెద్ద కుదుపు. కండరాల బలహీనతతో శరీరం క్రమంగా నా ఆధీనం కోల్పోతూ వచ్చింది. నా దుస్తులు నేను వేసుకోలేను. షర్ట్‌ బటన్స్‌ పెట్టుకోవడం కూడా కష్టమైపోయింది. రోజురోజుకూ పరిస్థితి క్షీణిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా నైట్‌ డ్రెస్‌ల్లోనే. కొన్నాళ్లకు చక్రాల కుర్చీ నాకు ఆధారమైంది. అప్పటికి ఎనభై శాతం శరీరంలో కదలికలు తగ్గిపోయాయి. అమ్మ అమిత తోడుగా ఎలాగో నెట్టుకొచ్చాను.

ఆలోచన మార్చింది...

జీవితాంతం ఇలా వీల్‌చైర్‌లోనే గడపక తప్పదని నాకు అర్థమైంది. అలాంటప్పుడు ఎంతకాలం ఒకరిపై ఆధారపడాలి? ఇది నన్ను తీవ్ర ఆలోచనలోకి నెట్టింది. ముఖ్యంగా దుస్తులు ధరించడంలో ఉన్న ఇబ్బందులను అధిగమించాలనే నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే మాలాంటివారే కాదు, వెన్నెముక గాయాలు, ఇతర దీర్ఘకాలిక నొప్పులు భరిస్తున్నవారు సులువుగా వేసుకోవడానికి వీలైన వస్త్రశ్రేణులు ఎక్కడా కనిపించలేదు. కనుక నేను దానిపైనే దృష్టి పెట్టాను. అమ్మతో కలిసి ప్రయోగాలు ప్రారంభించాను.


3-navya.jpg

ఆ స్వేచ్ఛ ఇవ్వాలని...

నా ఆకాంక్ష ఏంటంటే... నాలాంటి వారికి నచ్చిన దుస్తులు సులభంగా ధరించగలిగే స్వేచ్ఛ ఇవ్వడం. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం నింపడం. అందుకు తగిన డిజైన్లు రూపకల్పనకు నేను, అమ్మ నిరంతరం ప్రయత్నించాం. ఒకటా రెండా... లెక్కలేనన్ని ప్రయోగాలు చేశాం. టైలర్లను, డిజైనర్లను కలిశాం. అంతర్జాలంలో అధ్యయనం చేసి, సొంతంగా తయారు చేశాం. కుట్టిన డ్రెస్‌ సౌకర్యంగా ఉందా లేదా అన్నది నేను ధరించి చూశాను. చివరకు మా శ్రమ ఫలించింది. మాగ్నెటిక్‌, వెల్‌క్రో క్లోజర్స్‌, నో బెండ్‌ ట్రౌజర్లు వంటివి రూపొందించాం. అంతేకాకుండా... కస్టమర్లు కోరిన విధంగా, వారి శరీర కదలికలకు తగిన వస్త్రశ్రేణులు అందించాం. అదికూడా స్టైలిష్‌ డిజైన్లలో. ఇది అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది.

అంతా మావెంటే...

అందరికీ అందుబాటులో ఉండేలా 2020లో ‘జైనికా’ పేరుతో ఒక సంస్థ నెలకొల్పాం. అప్పుడు మావద్ద ఉన్నది 21 వేల రూపాయలు. దాంతోనే పని ప్రారంభించాం. ఆరంభంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. అయితే మా తల్లీకూతుళ్ల ప్రయత్నాన్ని చూసి చుట్టుపక్కలవారు ఎంతో ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందింది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. దాంతో మార్కెటింగ్‌ కూడా సులువైంది. వారందరి సహాయ సహకారాలతో తక్కువ సమయంలోనే మా ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలవారికి కూడా పరిచయమయ్యాయి. క్రమంగా ఆదాయం పెరిగింది. ఇది స్వశక్తితో మేం సాధించిన విజయం అనేకన్నా... ఒక కుటుంబంలా ఊరంతా కలిసివచ్చి నిలబెట్టిన సంస్థ అంటేనే సబబుగా ఉంటుంది.


మరికొంతమందికి...

మా సంస్థలో పని చేసేవారు కూడా వైకల్యంగలవారే. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా వందల మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఇంటివద్ద నుంచే పని చేసే అవకాశం కల్పించాం. దానివల్ల వారికి ఆర్థిక స్వేచ్ఛ లభించింది. ‘మేమూ స్వశక్తితో జీవించగలం’ అనే నమ్మకాన్ని ఇవ్వగలిగాం. అందుకే చెబుతున్నా... నేను వారిని సాధికారత వైపు నడిపించడం కాదు, వాళ్లవల్లే నేను సాధికారత సాధించగలిగాను. నాలాగా చక్రాల కుర్చీలో అవస్థలు పడుతున్న ఒకమ్మాయి... ‘ఇప్పుడు నా అంతట నేను కుర్తా ధరించగలుగుతున్నా. థ్యాంకూ’ అని అంది. ఆ మాటలకు నా కళ్లు చెమర్చాయి. నిత్యం ఇలా ఎంతోమంది సందేశాలు పంపుతుంటారు. అవి చూసినప్పుడు నా వైకల్యాన్ని మరిచిపోతాను. ఆనందంతో ఉప్పొంగిపోతాను.

అదే నా కోరిక...

మా సంస్థను మరింత విస్తరించాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని వారికీ చేరువ చేయాలి. ఏ ఒక్కరూ నాలాగా బాధపడకూడదు. ఇదే నా సంకల్పం. ఏదిఏమైనా చిన్నమొత్తంతో ప్రారంభించిన మా వ్యాపారం ఇప్పుడు లాభదాయకంగా సాగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కోటిన్నర రూపాయల టర్నోవర్‌ సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అది నెరవేరుతుందని ఆశిస్తున్నాం.’’

ఇవి కూడా చదవండి..

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం

Updated Date - Oct 01 , 2025 | 05:19 AM