Share News

Hearing Loss: హియరింగ్‌ లాస్‌ వినికిడి లోపిస్తే

ABN , Publish Date - Sep 30 , 2025 | 03:25 AM

వినికిడి పరికరం వాడకాన్ని చిన్నతనంగా భావించి దాని జోలికి వెళ్లని వాళ్లుంటారు. వినికిడి లోపం ఉన్నా ఆ విషయాన్ని ఒప్పుకోడానికి తటపటాయించే వాళ్లుంటారు...

Hearing Loss: హియరింగ్‌ లాస్‌ వినికిడి లోపిస్తే

వినికిడి పరికరం వాడకాన్ని చిన్నతనంగా భావించి దాని జోలికి వెళ్లని వాళ్లుంటారు. వినికిడి లోపం ఉన్నా ఆ విషయాన్ని ఒప్పుకోడానికి తటపటాయించే వాళ్లుంటారు. ‘వినికిడి పూర్తిగా పోయినప్పుడు ఆలోచిద్దాంలే!’ అనుకుంటూ హియరింగ్‌ ఎయిడ్స్‌ వాడకానికి దూరంగా ఉండిపోయే వాళ్లుంటారు. కానీ వీటిని వాడకపోవడం వల్ల, దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం క్రమేపీ తగ్గిపోయి, వినికిడిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు

వైద్యులు

వినికిడి లోపం జీవితంలో ఎప్పుడైనా తలెత్తవచ్చు. పుట్టుకతోనే ఈ లోపం ఉండొచ్చు. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, కొన్ని రకాల మందులు, పైబడే వయసు, పెద్ద శబ్దాలకు బహిర్గతమవడం వల్ల కూడా వినికిడి లోపం తలెత్తవచ్చు.

వృద్ధాప్యం: పైబడే వయసులో కంటిచూపు తగ్గినట్టే, 50 ఏళ్లు పైబడిన తర్వాత వినికిడి శక్తి కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. అయితే, సాధారణంగా వినికిడి శక్తి తగ్గడం మొదలుపెట్టినప్పుడు పైబడే వయసులో ఇదంతా మామూలే అనుకుంటూ హియరింగ్‌ ఎయిడ్‌ వాడకాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ హియరింగ్‌ ఎయిడ్‌ వాడకంతో కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ, వినికిడి పరికరాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది. కాబట్టి సమస్యను గుర్తించిన వెంటనే హియరింగ్‌ ఎయిడ్‌ను వాడుకోవడం మొదలుపెట్టాలి. మరీ ముఖ్యంగా వినికిడి శక్తి లోపించడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిని, నలుగురిలో కలవలేక, మానసిక కుంగుబాటుకు లోనై, ఒంటరిగా గదికే పరిమితమైపోతూ ఉంటారు. దాంతో జీవన నాణ్యత కూడా దెబ్బ తింటుంది. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.


పుట్టుకతోనే: పుట్టుకతోనే సంక్రమించే జన్యుపరమైన వ్యాధుల్లో వినికిడి లోపం కూడా ఒకటి. మేనరికం వివాహాల్లో పుట్టిన పిల్లల్లో ఈ సమస్య సహజం.

వ్యాధులు: మలేరియా, టైఫాయిడ్‌ లాంటి వైరల్‌ జ్వరాలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వినికిడికి సంబంధించిన నాడిని దెబ్బతీస్తాయి.

మందులు: జెంటామైసిన్‌, అమికాసిన్‌ లాంటి ఆటోటాక్సిక్‌ మందులు, కీమోథెరపీ మందులు, మలేరియా మందుల వాడకం వల్ల కూడా లోపలి చెవి దెబ్బతిని వినికిడి శక్తి తగ్గవచ్చు.

పిల్లల్లో వినికిడి లోపం

మేనరికం వివాహాల వల్ల లేదా ఇతరత్రా జన్యు సమస్యల వల్ల కొందరు పిల్లలు పుట్టుకతోనే వినికిడి సమస్యను వెంట తెచ్చుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో పసికందులు శబ్దాలకు స్పందించడం లేదని గ్రహించిన వెంటనే ‘బేరా’ (బ్రెయిన్‌ స్టెమ్‌ ఎవోక్‌డ్‌ రెస్పాన్స్‌ ఆడియోమెట్రీ పరీక్ష చేయించాలి. ఈ పరీక్షతో పసికందుల వినికిడి లోపం ఏ మేరకు ఉందన్నది తెలుస్తుంది. అలాగే పది నెలలు దాటిన పిల్లలు చప్పుళ్లకు స్పందించకపోయినా, ఈ పిల్లలకు మాటలు రాకపోతున్నా వెంటనే అప్రమత్తం కావాలి. ఏడాది లోపున్న పసిపిల్లల్లో వినికిడి శక్తి లోపిస్తే, కోక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చవలసి ఉంటుంది. దీంతో వినికిడి శక్తి పెరిగి పిల్లల ఎదుగుదల ఆరోగ్యకరంగా సాగుతుంది. ఈ ఇంప్లాంట్‌ను అమర్చడం కోసం వైద్యులు పుర్రె లోపల వినికిడి నాడికి ఎలకో్ట్రడ్స్‌ను అనుసంధానించి, కోక్లియాను అమరుస్తారు. చెవి దగ్గర బహిర్గతమయ్యే విడి భాగంలో అవసరాన్ని బట్టి బ్యాటరీలను మార్చుకుంటూ పిల్లలు జీవితకాలం పాటు ఈ వినికిడి పరికరాన్ని వాడుకోవచ్చు.


ఇది తాత్కాలికమే!

వానాకాలంలో సాధారణ జలుబులతో తాత్కాలిక వినికిడి లోపం తలెత్తవచ్చు. సాధారణంగా ఇది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అలర్జీల వల్ల, చలికి బహిర్గతమవడం వల్ల, జలాంతర క్రీడల వల్ల, విమానం నేల మీదకు దిగేటప్పుడు కర్ణభేరి మీద ఒత్తిడి పెరిగి, చెవి పోటు, తాత్కాలిక వినికిడి లోపం తలెత్తవచ్చు. విమానం కిందకు దిగే సమయంలో చెవి పోటు, దిబ్బెడ వేధించే సమస్య ఉన్నవాళ్లు ప్రయాణానికి ముందు ఆవిరి పట్టుకోవాలి. అలాగే విమానం దిగడానికి అరగంట ముందు యాంటీ హిస్టమిన్‌ మాత్ర వేసుకోవాలి. అలాగే అలర్జీలు, జలుబులకు చికిత్స తీసుకోవాలి. వీటితో తాత్కాలిక వినికిడి లోపం తగ్గిపోతుంది. పబ్‌లు, డిజెల్లోని బిగ్గర శబ్దాలకు బహిర్గతమైన తర్వాత చెవిలో గుయ్యిమనే శబ్దంతో పాటు వినికిడి తగ్గితే వెంటనే వైద్యులను కలిసి చెవి ఇంజక్షన్లు తీసుకోవాలి. లేదంటే కోల్పోయిన వినికిడి శక్తి తిరిగొచ్చే వీలుండదు. ఇలా జరగకుండా ఉండాలంటే, బిగ్గర శబ్దాలతో కూడిన ప్రదేశాలను సందర్శించేటప్పుడు, స్పీకర్లకు దూరంగా ఉంటూ, ఇయర్‌ ప్లగ్స్‌ వాడుకోవాలి. అలాగే దీపావళి నాడు టపాసులు కాల్చే సమయంలో కూడా ఇయర్‌ ప్లగ్స్‌ వాడుకోవాలి. అయితే అప్పటికే చెవి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు టపాసుల శబ్దాలకు ఏమాత్రం బహిర్గతం కాకుండా, గదులకే పరిమితం కావాలి.

అకస్మాత్తుగా వినికిడి కోల్పోతే...

కారణం ఏదైనా అకస్మాత్తుగా వినికిడి శక్తి కోల్పోతే, తిరిగి వచ్చేస్తుందిలే అని తాత్సారం చేయడం సరికాదు. ఇలాంటి సందర్భాల్లో ఎంత త్వరగా చికిత్స అందించగలిగితే, వినికిడి శక్తి అంత త్వరగా తిరిగొస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రతించగలిగితే, చెవిలోకి ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి తెప్పించవచ్చు.

డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి తళ్లపురెడ్డి

కన్సల్టెంట్‌ ఇ.ఎన్‌.టి,

హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జన్‌,

3 సెన్సెస్‌ ఇ.ఎన్‌.టి స్పెషాలిటీ క్లినిక్‌,

హబ్సిగూడ, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి

పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..

దేశంలోని విస్కీ అమ్మకాల్లో 58శాతం దక్షిణ భారతంలోనే

Updated Date - Sep 30 , 2025 | 03:25 AM