Share News

Fasting: ఉపవాసం... ఆరోగ్యం..!

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:10 AM

కడుపు మాడ్చితే, శక్తి కోసం శరీరం కొవ్వును కరిగించుకుంటుంది. జీర్ణవ్యవస్థ సేద తీరి, కొత్త శక్తి పుంజుకుంటుంది. ఉపవాసంతో దక్కే ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కోకొల్లలు. అయితే ఉపవాసం చేసినా, ఆ సమయంలో ఓపిక సన్నగిల్లకుండా ఉండడం కోసం కూడా కొన్ని నియమాలు పాటించాలి.

Fasting: ఉపవాసం... ఆరోగ్యం..!

ఉపవాస దీక్షలో భాగంగా పరిమిత ఆహార నియమానికి కట్టుబడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనీ, జబ్బులకు దారితీసే దుష్ప్రభావాలూ తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌లు తగ్గుతాయని పరిశోఽధకులు గ్రహించారు. శరీరంలో చోటుచేసుకునే ఈ మార్పుల ఫలితంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. అంతే కాకుండా ఉపవాసంతో ఒరిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే...

ఇన్‌ఫ్లమేషన్‌ అదుపు: ఇన్‌ఫ్లమేషన్‌కూ... గుండె జబ్బులు, క్యాన్సర్‌, కీళ్లనొప్పులకూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఉపవాసంతో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ అదుపులోకొస్తుంది కాబట్టి, ఉపవాసంతో ఈ ఆరోగ్య సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.

గుండెకు మేలు: అధిక కొలెస్ట్రాల్‌తో గుండెకు చేటు జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే! ఉపవాసంతో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది కాబట్టి గుండెకు రక్షణ దక్కుతుంది. ఉపవాసంతో అధిక రక్తపోటు అదుపులోకి రావడంతో పాటు, ఎల్‌డిఎల్‌ అనే చెడు కొలెస్ట్రాల్‌ మోతాదు తగ్గుతుంది.

శక్తి ఖర్చు: ఉపవాసంలో శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం పెరుగుతుంది. పరిమితంగా క్యాలరీలు తీసుకునే వారితో పోలిస్తే, రోజంతా ఉపవాసం ఉన్నవాళ్లలో శరీరం మొత్తంలోని కొవ్వుతో పాటు ప్రత్యేకించి పొట్ట దగ్గరి కొవ్వు త్వరితంగా కరుగుతుంది.



ఈ లక్షణాలు సహజం

ఉపవాసం సమయంలో ఛాతీలో మంట, మలబద్ధకం, తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ లక్షణాలు సహజం. వీటిని నివారించాలంటే...

రోజు మొత్తంలో కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి

పెప్టిక్‌ అల్సర్లు, మధుమేహులు పళ్లు, కూరగాయ ముక్కలు తినాలి

గర్భవతులు, పాలిస్తున్న తల్లులు, హృద్రోగులు, పెద్దలు ఉపవాసం చేయకపోవటమే మంచిది

శారీరక బలహీనత కలిగినవారు, ఆహారానికి సంబంధించిన సమస్యలున్నవారు (ఈటింగ్‌ డిజార్డర్‌), ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవాళ్లు ఉపవాసానికి ముందు వైద్యుల సలహా తీసుకోవాలి

ఉపవాస సమయంలో ఎక్కువ నూనె, నెయ్యిలతో చేసిన పదార్థాలు, తీపి వంటలకు దూరంగా ఉండాలి


ఇలా ముగించాలి

ఉపవాసంతో కడుపు నకనకలాడుతున్నా, చేతికందిన పదార్థాలతో ఉపవాసం ముగించకూడదు. మరీ ముఖ్యంగా పిండి వంటలు తినకూడదు. కోలాలు, రెడీమేడ్‌ పళ్ల రసాలు, స్వీట్లు, సమోసాల జోలికి వెళ్లకూడదు. ఉపవాసం ముగించేటప్పుడు తీసుకునే ఆహారం తేలికగా అరిగేదై ఉండాలి. చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు, ఆకుపచ్చని కూరగాయలు, పాలు, పెరుగు, వేయుంచిన లేదా ఉడికించిన గింజలతో ఉపవాసం ముగించటం ఆరోగ్యకరం.

విశ్రాంతి కూడా అవసరమే!

ఉపవాసం జీవక్రియలను నెమ్మదింపజేస్తుంది. ఉపవాసంతో శరీరంలోని ద్రవాల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. కాబట్టి అలసట కలిగించే, ఎక్కువ శారీరక శ్రమతో కూడుకున్న పనులు చేయకూడదు. ఆహార వేళలు కచ్చితంగా పాటిస్తూ, మితంగా మొదలుపెట్టి క్రమేపీ ఆహార పరిమాణం సాధారణ స్థాయికి పెంచాలి.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:10 AM