Share News

Grow Leafy Greens in Pots: కుండీల్లో ఆకుకూరలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:53 AM

ఇటీవల అందరూ ఆకుకూరలంటే ఆసక్తి చూపిస్తున్నారు. కుండీల్లోనైనా ఆకు కూరలను పెంచాలనుకుంటున్నారు. ఇలా కుండీల్లో పెంచదగ్గ...

Grow Leafy Greens in Pots: కుండీల్లో ఆకుకూరలు

ఇటీవల అందరూ ఆకుకూరలంటే ఆసక్తి చూపిస్తున్నారు. కుండీల్లోనైనా ఆకు కూరలను పెంచాలనుకుంటున్నారు. ఇలా కుండీల్లో పెంచదగ్గ ఆకుకూరల గురించి తెలుసుకుందాం.

మెంతికూర: ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎటువంటి మట్టిలోనైనా సులువుగా పెరుగుతుంది. ముందుగా మెంతులను రెండు గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి. తరువాత వాటిని టిష్యూ పేపర్‌లో లేదంటే పలుచని గుడ్డలో మూటకట్టి పెడితే ఒక్క రోజులోనే మొలకలు వస్తాయి. మొలకెత్తిన మెంతి గింజలను కుండీల్లో నాటితే వారంలోపే మెంతికూర చేతికి అందుతుంది. కోకోపీట్‌ కలిపిన మెత్తటి మట్టిలో ఏడాది పొడవునా మెంతికూర చక్కగా పెరుగుతుంది. వంటింటి కిటికీల దగ్గర, బాల్కనీలో కుండీలు పెట్టుకోవచ్చు.

పాలకూర: ఇది కూడా కుండీల్లో బాగా పెరుగుతుంది. పాలక్‌ సీడ్స్‌ తెచ్చి కుండీలో చల్లి కొన్ని నీళ్లు చిలకరించాలి. నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి. పది రోజుల్లో పాలకూర గుబురుగా పెరుగుతుంది. ఆకులను మాత్రమే కోసుకోవాలి. ఆర్నెల్లకోసారి మట్టిలో సేంద్రియ ఎరువులు కలుపుతూ ఉంటే నాలుగేళ్ల వరకూ పెద్ద ఆకులతో పాలకూర పెరుగుతూనే ఉంటుంది.

కొత్తిమీర: ఒక గిన్నెలో కొన్ని ధనియాలను తీసుకుని నిండా నీళ్లు పోసి అయిదు గంటలపాటు నానబెట్టాలి. కొత్తిమీర బాగా పెరగాలంటే మట్టి మరీ మెత్తగా ఉండకూడదు. అందుకే కుండీలోని మట్టిలో కొద్దిగా ఇసుక, కంపోస్టు కలపాలి. తరువాత నానిన ధనియాలు చల్లి నీళ్లు చిలకరించాలి. వారంలో కొత్తిమీర చేతికి అందుతుంది. రోజూ కావాల్సినంత కొత్తిమీరను చేత్తో తుంచుకోవాలి. దీన్ని తుంచుతున్న కొద్దీ కొత్త ఇగుళ్లు వస్తూనే ఉంటాయి.

తోటకూర: ఇది ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో లభ్యమవుతుంది. కుండీలోని మట్టిలో కొద్దిగా వేపపిండి కలపాలి. తరువాత తోటకూర గింజలు చల్లి కొన్ని నీళ్లు చిలకరించాలి. మూడు రోజుల్లోనే మొలకలు వస్తాయి. రోజూ మట్టి తడిసేలా నీళ్లు పోస్తూ ఉంటే తోటకూర చక్కగా పెరుగుతుంది.

బచ్చలి కూర: కుండీలో గింజలు చల్లి పెంచుకోవచ్చు. కొమ్మ తెచ్చి పెట్టినా కూడా త్వరగానే నాటుకుంటుంది. ఈ మొక్కకు ఎక్కువగా ఎండ అవసరం లేదు. నీడలో బాగా పెరుగుతుంది.

చుక్క కూర: ఒకసారి గింజలు తెచ్చి చుక్కకూరను పెంచితే దానినుంచి గింజలు వస్తూనే ఉంటాయి. ఈ మొక్కకి ద్రవరూపంలో ఎరువులు ఇస్తూ ఉండాలి. ఇది చాలా వేగంగా పెరిగే మొక్క.

ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 05:53 AM