Share News

ఆ ముగ్గురిలో నేనూ ఒకడిని

ABN , Publish Date - Jun 22 , 2025 | 06:03 AM

ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించి, నిర్మాతలైన వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో అతికొద్ది మందే కనిపిస్తారు. వాళ్లలో ముందు వరుసలో నిలిచే వ్యక్తి అట్లూరి పూర్ణచంద్రరావు. గేట్‌కీపర్‌గా, ఫిల్మ్‌ రిప్రజెంటెటివ్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా...

ఆ ముగ్గురిలో నేనూ ఒకడిని

ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించి, నిర్మాతలైన వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో అతికొద్ది మందే కనిపిస్తారు.

వాళ్లలో ముందు వరుసలో నిలిచే వ్యక్తి అట్లూరి పూర్ణచంద్రరావు. గేట్‌కీపర్‌గా, ఫిల్మ్‌ రిప్రజెంటెటివ్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పని చేసి చివరకు నిర్మాతగా మారి తొమ్మిది భాషల్లో 87 చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించారాయన. 90 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా కనిపించే పూర్ణచంద్రరావు గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులలో భాగంగా ‘నాగిరెడ్డి- చక్రపాణి పురస్కారా’న్ని పొందారు. ఈ సందర్బంగా ఆయన ‘నవ్య’కు చెప్పిన ఆనాటి ఆసక్తికరమైన విషయాలు.

మీరు ఇంతటి స్థాయికి చేరుకోవడానికి కారకులు ఎవరు?

భగవంతుడి ఆశీస్సులతో పాటు నా కృషి కూడా ఉందని నమ్ముతాను. ఎందుకంటే మా తరంలో 18 మంది ప్రొడక్షన్‌ మేనేజర్లు ఉండేవారు. నాకు తెలిసి వీళ్లలో ముగ్గురే ముగ్గురు నిర్మాతలుగా మారారు. వాళ్లలో నేను ఒకడిని. మిగతా ఇద్దరు తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు, తమిళ మేనేజర్‌ రంగరాజన్‌. నేను తీసినన్ని సినిమాలు మిగతా ఇద్దరూ తీయలేదు. అయితే ఇదంతా నా గొప్పే అనే అహం మనిషికి ఉండకూడదు. ఇన్ని భాషల్లో, టాప్‌ స్టార్స్‌తో సినిమాలు తీసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చి దారి చూపించాడు. దానికి నా కృషిని జోడించి విజయం సాధించాను. దక్షిణ భారతదేశంలో అమితాబ్‌ గారితో సినిమాలు తీసే అవకాశం నాకే దక్కింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌పురి, బెంగాలీ, ఒరియా, మరాఠి భాషల్లో సినిమాలు తీయగలిగాను.


నిర్మాతగా మీరు ప్రారంభంలో తీసిన ఆరు చిత్రాలకు మీ పేరు వేసుకోలేదు. కారణం?

ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పని చేసే వ్యక్తి నిర్మాతగా మారి టైటిల్స్‌లో పేరు వేసుకున్నాక ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్‌ అయితే ఓ మెట్టు దిగి మళ్లీ మేనేజర్‌గా పని చేయాలి. అందుకే ‘ఉపాయంలో అపాయం’, ‘అగ్గిమీద గుగ్గిలం’, ‘ఉక్కుపిడుగు’, ‘రౌడీ రాణి’, ‘పాపం పసివాడు’ , ‘రైతు కుటుంబం’ చిత్రాలకు నా పేరు వేసుకోలేదు. నా పార్టనర్స్‌ పేరే వేశాను. శోభన్‌బాబుతో తీసిన ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రం నుంచి నా మీద నాకు నమ్మకం పెరిగి నిర్మాతగా పేరు వేసుకున్నాను. ఈ ఆరు సినిమాల్లో మొదటి తప్ప మిగిలిన ఐదూ గుర్తింపు, డబ్బు తెచ్చాయి. ‘నేను పెట్టుబడి పెడతా... మీ పేరుతో పాటు నిర్మాతగా నా పేరు వేస్తారా’ అని కొందరు వచ్చేవారు. ‘నా పేరు వద్దు.. నీ పేరే వేసుకో’ అని చెప్పేవాడిని. నిర్మాతగా నాకు పేరు టైటిల్స్‌లో చూసుకోవాలనే కోరిక ఉండేది కాదు. సినిమాలు తీసి జీవితంలో ఎదగాలి.. అదొక్కటే కోరిక. దానిని సాధించాననే అనుకుంటున్నాను. లేకపోతే ఓ సామాన్య కుటుంబంలో పుట్టి, పెద్దగా చదువుకోని నేను వివిధ భాషల్లో మూడు తరాల టాప్‌స్టార్స్‌తో సినిమాలు తీయడమా! ఇది నిజమా, కలా నేనేనా ఇన్ని సినిమాలు తీసింది.. అని నన్ను నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటాను.


ఇతర భాషల్లో కూడా సినిమాలు తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?

మిగిలిన వాళ్లకంటే ఓ అడుగు ముందు ఉండాలి, పైకి ఎదగాలి అనే తపన నాది. అదీ కాకుండా ఆ రోజుల్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల షూటింగ్స్‌ అన్నీ మద్రాసులోనే జరిగేవి. అందుకని ఆ భాషల్లో కూడా సినిమాలు తీయగలిగాను. రామోజీరావుగారితో కలసి ‘మయూరి’ చిత్రాన్ని హిందీలో తీశాను. నాగేశ్వరరావుగారితో కలసి ‘శివ’ సినిమాను హిందీలో నిర్మించాను. నిర్మాతగా తమ పేరు, సమర్పకుడిగా నా పేరు వేస్తామన్నారు. నేను ఒప్పుకోలేదు. మీ సినిమాను సమర్పించే హోదా నాకు లేదు అని చెప్పి ఆ సినిమాలు చేశాను. నేను ఏడు సినిమాలు తీసిన తర్వాత ఓ రోజు నాగిరెడ్డిగారు పిలిచి మనిద్దరం కలసి ఓ హిందీ సినిమా చేద్దాం అని ప్రతిపాదించారు. ‘వద్దండి. నిర్మాతగా మీరే ఉండండి. నేను ప్రొడక్షన్‌ చేసి పెడతా. నాకు ఒక రూపాయి కూడా ఇవ్వవద్దు’ అన్నారు. హిందీ సినిమాల మేకింగ్‌, ట్రెండ్‌ తెలుసుకోవడానికి ఇలా పారితోషికం తీసుకోకుండా ఆ సినిమాకు పని చేశా. ఆ అనుభవంతో హిందీలో సినిమాలు సొంతంగా తీయగలిగా.

ఇన్ని చిత్రాలు తీసిన మీరు సినిమా

రంగానికి దూరంగా ఉండడానికి కారణం ఏమిటి?

65 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇక రిటైర్‌ అవుదామని అనుకున్నా. మా పిల్లలు ఎవరికీ సినిమాలు అంటే ఆసక్తి లేదు. ఒక రోజు మద్రాసు నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లా. అక్కడ పని చూసుకుని అదే రోజు కోలకతా వెళ్లా. అక్కడి నుంచి ముంబై వెళ్లా. అక్కడ పని చూసుకుని రాత్రి తొమ్మిది గంటలకు మద్రాసు చేరా. తర్వాత ఆలోచించుకుంటే ‘ఏమిటీ స్పీడ్‌. దీనికి ఫుల్‌ స్టాప్‌ లేదా, 65ఏళ్ల వయసులో ఇది అవసరమా’ అనిపించింది. అప్పుడే రిటైర్‌ అవుదామని నిర్ణయించుకుని ఊటీ షిఫ్ట్‌ అయ్యా. అయితే కొన్ని కారణాల వల్ల మళ్లీ చిత్రరంగంలోకి అడుగుపెట్టి తమిళంలో విజయ్‌, అజయ్‌, విక్రమ్‌లతో సినిమాలు తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘వెంకీ’, ‘ఔనన్నా కాదన్నా’, ‘శైలజా కృష్ణమూర్తి’ చిత్రాలు తీశాను. ‘వెంకీ’ ఓకే కానీ మిగిలిన రెండు సినిమాలు దెబ్బ తిన్నాయి. ఇక అప్పటితో చిత్ర నిర్మాణానికి ఫుల్‌స్టాప్‌ పెట్టా.


మీరు ఎంతో మంది టాప్‌ హీరోలతో పనిచేశారు. వారితో మీకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? ఇప్పుడు ఎవరితో టచ్‌లో ఉన్నారు?

అందరితో టచ్‌లో ఉన్నానని చెప్పలేను. కొంత కాలంగా నేను సినిమాలకు గ్యాప్‌ ఇచ్చినా.. ఇప్పటికీ అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, మురళీమోహన్‌తో తరచూ మాట్లాడుతుంటాను. వారి పుట్టినరోజులకు విష్‌ చేస్తుంటాను. అమితాబ్‌ బచ్చన్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నాకెంతో గౌరవం ఇస్తారు. ఏ సాయం అడిగినా వెంటనే చేస్తారు. వీలున్నప్పుడల్లా ఆయన్ని కలుస్తాను. ఓ రోజు ఆయనని కలవడానికి ముంబైకి వెళ్లా. ఆయన నాగ్‌పూర్‌లో షూట్‌లో ఉండి కూడా వీలు చేసుకుని నన్ను కలిశారు. అలాగే, రజనీకాంత్‌ కూడా వీలున్నప్పుడల్లా కలుస్తుంటారు. మళ్లీ సినిమా ఎప్పుడు తీస్తారు అని ఇప్పటికీ అడుగుతుంటారు.

వినాయకరావు


మళ్లీ సినిమా తీయాలనే కోరిక ఉందా?

మళ్లీ సినిమాలు తీయాలనే ఆలోచనలు లేవు. ఇతర వ్యాపారాలు చేయాలన్న ఆశా లేదు. ప్రస్తుతం నాకున్న కోరిక ఒకే ఒక్కటి. కూర్గ్‌లో ఉన్న ‘హెవెన్లీ హిల్స్‌’ రిసార్ట్స్‌ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. అది త్వరలోనే ప్రారంభం అవుతుంది. 25 రూమ్స్‌తో దాన్ని ప్రారంభించా. నా మేలు కోరే నలుగురు మిత్రుల సహకారంతో ఇప్పుడు అది వంద గదులతో తయారైంది.

పరిశ్రమకి వచ్చి మీరు సంపాందించింది.. పోగొట్టుకుంది?

నేను పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నా అనే సంతృప్తి ఉంది. మంచి అభిరుచితో సినిమాలు తీశాననే గుర్తింపు ఇప్పటికీ ఉండడం సంతోషకరం. అందుకే నన్ను గుర్తించి గద్దర్‌ అవార్డు ఇచ్చారు. నేను ప్రొడ్రక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌, సూపర్‌ మార్కెట్‌.. ఇలా వివిధ రంగాల్లో ఇన్నేళ్లు ఉన్నా... ఏదీ ఇప్పుడు రన్నింగ్‌లో లేవు. అందుకే నేను ఫెయిల్యూర్‌ పర్సన్‌ని అనుకుంటున్నాను. ఎంత సంపాదించారు అనే ప్రశ్నకు సమాధానం జీరో అనే చెప్పాలి. నాకు సొంతిల్లు కూడా లేదు. మురళీ మోహన్‌ ఇచ్చిన కారు మాత్రమే ఉంది. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా తక్కువే. ఉన్నవన్నీ కూడా పిల్లలకు ఇచ్చేశా.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2025 | 06:03 AM