Bugadi Earrings: భలే భలే బుగాడి
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:52 AM
ట్రెండింగ్‌లో ఇలా: ప్రస్తుతం బుగాడి.. సంప్రదాయ సరిహద్దులు దాటి ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. వారసత్వ విలువలను కాపాడుకుంటూనే యువతులు దీన్ని యాక్సెసరీగా ధరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు బుగాడి ధరించాలంటే...
సంప్రదాయం
ట్రెండింగ్‌లో ఇలా: ప్రస్తుతం బుగాడి.. సంప్రదాయ సరిహద్దులు దాటి ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. వారసత్వ విలువలను కాపాడుకుంటూనే యువతులు దీన్ని యాక్సెసరీగా ధరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు బుగాడి ధరించాలంటే చెవులు కుట్టించుకోనక్కర్లేదు. క్లిప్ ఆన్, స్ర్కూ బ్యాక్, కఫ్ స్టయిల్ రకాలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో సందర్భానికి తగ్గట్టు రకరకాల బుగాడిలు పెట్టుకోవడానికి సౌలభ్యం ఏర్పడింది. చీరలు, లెహంగాలు లాంటి సంప్రదాయ దుస్తులతోపాటు జీన్స్, స్కర్ట్ లాంటి ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వేర్ మీద కూడా బుగాడిలు పెళ్లికూతురి అలంకరణలో కూడా బుగాడి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముక్కుపుడక, పాపిడి బిళ్ల, జుంకీలకు మ్యాచ్ అయ్యేలా వీటిని ఎంపిక చేసుకుంటున్నారు.
బుగాడి అనేది సంప్రదాయ చెవి ఆభరణం. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఈ బుగాడికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా దీన్ని స్త్రీత్వానికి, సౌందర్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. రవివర్మ చిత్రాల్లో కూడా మహిళలు బుగాడిని అలంకరించుకుని ఉండడం కనిపిస్తుంది. ఇలా ఒకప్పుడు స్త్రీలు సంప్రదాయంగా ధరించిన బుగాడి నేడు సరికొత్త హంగులతో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
బుగాడి ప్రత్యేకత: చెవి పైన వెలుపలి భాగంలో అంచుకు పెట్టుకునే ఆభరణమే బుగాడి. ఇలా రెండు చెవులకూ పెట్టుకుంటారు. కొన్ని వర్గాలవారు అయిదారు బుగాడిలు అలంకరించుకుంటూ ఉంటారు. బుగాడిలు పెట్టుకోవడానికి వీలుగా చెవుల అంచుల మీద సన్నని తీగతో గుచ్చి రంధ్రాలు చేస్తారు. ఇలా చెవులు కుట్టడం వల్ల ముఖ్యమైన ఆక్యుపంక్చర్ పాయింట్లు ఉత్తేజితమై పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని అప్పటివారు నమ్మేవారు. అంతేకాదు బుగాడి.. ప్రతికూల శక్తులనుంచి కాపాడుతుందని మహిళలు విశ్వసించేవారు. బుగాడిని సాధారణంగా బంగారం లేదా వెండితో తయారు చేస్తారు. సన్నని బంగారు తీగలకు చిన్న ముత్యాలు లేదా ఎర్రని రాళ్లు ఎక్కించి చిన్న రింగుల మాదిరి చుట్టేవారు. కెంపులు, పచ్చలు లాంటి రత్నాలు పొదిగి చిన్న దిద్దుల లాంటివి కూడా తయారు చేసేవారు. మెరిసే రాయి, చిన్న స్ర్కూతో ముక్కపుడకలా ఉండే బుగాడిలను మహిళలు ఎక్కువగా ధరించేవారు. క్రమంగా ఇవి రూపాంతరం చెంది సరికొత్త డిజైన్లలో విభిన్న రూపాల్లో అందుబాటులోకి వచ్చేశాయి.
అందమైన బుగాడిలు
లవంగ బుగాడి: ఇది ఎక్కువగా తమిళనాడు ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీనికి లవంగం మాదిరి పుల్ల, మొగ్గ ఉంటాయి. మొగ్గ స్థానంలో అందమైన దిద్దులను జతచేస్తారు. వీటిమీద ముత్యాలు, రాళ్లు, రంగుల పూసలు, బంగారు గుళ్లు పొదుగుతారు. పుల్ల చివరలో చిన్న స్ర్కూని ఏర్పాటు చేస్తారు.
కష్టీ బుగాడి: బంగారం లేదా వెండి తీగను చిన్న రింగులా చుట్టి దానికి చిన్న లాకెట్‌ను జతచేస్తారు. ఈ లాకెట్ మీద కుందనాలు, సీజెడ్‌లు, కెంపులు, పచ్చలు పొదుగుతారు. దీనికి చిన్న ముత్యాలను వేలాడదీస్తారు. ఈ రకం బుగాడి చూడడానికి గ్రాండ్‌గా కనిపిస్తుంది.
కలాషిన్ బుగాడి: దీనికి రెండు చివర్లలో అందమైన కలశం ఆకృతులు ఉంటాయి. వీటిని స్ర్కూ పద్ధతి ద్వారా అమరుస్తారు. ఈ కలశాల మీద చక్కని డిజైన్లు రూపొందించి వాటి మధ్యలో ముత్యాలు, రత్నాలు పొదుగుతారు.
మోతీ బుగాడి: ఇది పూర్తిగా ముత్యాలతో నిండి ఉంటుంది. వివాహితలు, నాట్య కళాకారిణులు ఎక్కువగా ఈ రకం బుగాడిలను ధరిస్తుంటారు.
జుమ్కీ బుగాడి: దీనికి చివరన అందమైన జుమ్కీ లేదా డాంగ్లర్ వేలాడుతూ తళుక్కుమని మెరుస్తూ ఉంటుంది. మువ్వలతో కూడిన బుట్టలు, చాంద్‌బాలీలను కూడా జతచేస్తూ ఉంటారు.
డిస్క్ బుగాడి: దీనికి చివరలో గుండ్రని బిళ్ల ఉంటుంది. ఈ బిళ్ల మీద పువ్వులు, లతలు, హంసలు, నెమళ్లు, లక్ష్మీదేవి బొమ్మలు చెక్కుతారు. దీనిని ఎక్కువగా బ్లాక్ మెటల్‌తో తయారు చేస్తుంటారు.
ఖ్యాతి,
ఖ్యాతి డిజైనర్ స్టూడియో హైదరాబాద్, 6300386749
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News