ఆ స్వర్ణం వెనుక అమ్మ సంకల్పం
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:17 AM
From Forest Trails to Gold Medals: Rajithas Inspiring Journey
స్ఫూర్తి
అది ఒక అటవీ ప్రాంతం...
వసతులేమీ లేని కుగ్రామం..
ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే! అక్కడి ప్రజలకు పూట గడవటమే గగనం. అలాంటి దుర్భర పరిస్థితులలో పెరిగిన ఆదివాసి అమ్మాయి రజిత. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి భద్రమ్మను ‘నవ్య’ పలకరించింది.
‘‘అవునా.. నా బిడ్డ బంగారం గెలిచిందా..’’ భద్రమ్మకు రజిత స్వర్ణం గెలిచిందని చెప్పినప్పుడు ఆమె అన్న తొలిమాటలు. అక్కడే ఉన్న ప్లాస్టిక్ ఫ్రేమ్‌లో రజిత ఫొటో చూసినప్పుడు ఆమె కళ్లలో ఒక గర్వం. తాను ఎంతో కష్టపడి పెంచిన చిన్నతల్లి ఏదో సాధించిందనే ఆనందం. భద్రమ్మకు ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షి్‌ప గురించి తెలియదు. ఒలింపిక్స్ గురించి తెలియదు. కేవలం తన చిట్టి తల్లి ఏదో ఒక గొప్ప పని చేసిందని మాత్రమే తెలుసు. రజిత స్వర్ణం వెనక భద్రమ్మ కృషి ఎన్నడూ మరవలేనిది. వాస్తవానికి భద్రమ్మ, ఆమె భర్త మారయ్యలది చత్తీ్‌సగఢ్ దంతేవాడ జిల్లాలోని బుసరాస్ గ్రామం. కరువు కాటకాలు రావటంతో ఆమె కుటుంబం అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండంలో రామచంద్రాపురం అనే గ్రామానికి వలస వచ్చింది. రామచంద్రాపురం చుట్టూ అడవులు. రోజూ అడవిలోకి వెళ్లి ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి. రజిత పుట్టిన రెండేళ్లకు మారయ్య మరణించారు. దీంతో కుటుంబ భారమంతా భద్రమ్మపైనే పడింది.
దిన దిన గండం...
రోజూ కూలికి వెళ్లి సంపాదిస్తే కానీ పిల్లలకు కనీసం భోజనం కూడా పెట్టలేని పరిస్థితి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇతరులైతే బెంబేలు పడిపోతారు. కుదేలవుతారు. కానీ భద్రమ్మ వేటికీ తలవంచలేదు. జీవితంతో పోరాడాలనుకుంది. రోజూ కూలికి వెళ్లేది. అప్పుడప్పుడు అడవిలోకి వెళ్లి ఫలసాయం సంపాదించుకు వచ్చేది. వాటితో తాను తిన్నా.. తినకపోయినా పిల్లలకు పెట్టేది. ఆ సమయంలోనే తన పిల్లలను బాగా చదివించుకోవాలనే భావన భద్రమ్మలో బలంగా పడింది. దీనితో పిల్లలను స్కూలుకు పంపాలనుకుంది. వలసగ్రామం కావటంతో రామచంద్రపురంలో స్కూలు లేదు. దూరంగా ఉన్న ప్రాంతాలకు పంపి చదివించాలనే డబ్బులు లేవు. ఈ సమయంలో సమీపంలో ఉన్న ఇంటిగ్రేడెట్ ట్రైబల్ డెవల్‌పమెంట్ సొసైటీ నిర్వహిస్తున్న అరూపే ఉన్నత పాఠశాల ఆమెకు ఆసరా అయింది.
చిన్ననాటి నుంచే...
చిన్నప్పటి నుంచి రజిత ఇతరులతో పోలిస్తే అలసట లేకుండా వేగంగా పరుగెట్టేది. పరుగులో ఆమెకు సహజమైన ప్రతిభ ఉందని ఎవరికీ తెలియదు. చిన్నప్పుడు రజిత ‘‘చటుక్కున ఊరంతా పరిగెత్తి వచ్చేసేది..’’ అంటారు భద్రమ్మ. స్కూలులో చేరిన తర్వాత రజితకు పాఠ్యాంశాల కన్నా ఆటలలోనే ఎక్కువ ఆసక్తి కనబరిచేది. ఆమెకు పరుగులో ప్రతిభ ఉందని తొలిసారి గుర్తించి ప్రొత్సహించినది అరూపే పాఠశాలకు చెందిన ఫాదర్ ఏసురత్నం. ఆయన ఇచ్చిన ప్రొత్సాహంతో... జిల్లా స్థాయిలో 100 మీటర్ల రేసులో గెలిచిన రజిత ఆదివాసీ పిల్లల్లో ఒక స్టార్‌గా మారింది. ఆ తర్వాత కాలంలో జాతీయ స్థాయిలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. కానీ ఆమెను పేదరికం వెంటాడుతూనే ఉండేది. కాళ్లకు వేసుకోవటానికి సరైన షూలు ఉండేవి కావు. తనవద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులను రజితకు భద్రమ్మ అప్పుడప్పుడూ ఇస్తూ ఉండేది. ఈ సమయంలో రజిత పరుగు ప్రస్థానంలో భద్రమ్మతో పాటు, సోదరుడు జోగయ్య సహకారం వెలకట్టలేనిది. ప్రస్తుతం 2026లో జరగనున్న కామన్వెల్త్ పోటీలకు శిక్షణ పొందుతున్న రజిత 2028లో జరగబోయే ఒలింపిక్స్ అథ్లెటిక్స్ జట్టుకు కూడా ఎంపిక అయింది. మన్యం ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థారులో పతకాలను సాధించిన అథ్లెట్‌గా రజిత పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించి మన దేశానికి.. తెలుగు వారికి ఖ్యాతి తీసుకువస్తుందని ఆశిద్దాం.
మంత్రి సత్యనారాయణ
చింతూరు
For AndhraPradesh News And Telugu News
జిల్లా స్థాయిలో 100 మీటర్ల రేసులో గెలిచిన రజిత ఆదివాసీ పిల్లలలో ఒక స్టార్‌గా మారింది. ఆ తర్వాత కాలంలో జాతీయ స్థాయిలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. కానీ ఆమెను పేదరికం వెంటాడుతూనే ఉండేది. కాళ్లకు వేసుకోవటానికి సరైన షూలు ఉండేవి కావు. తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులను రజితకు భద్రమ్మ అప్పుడప్పుడు ఇస్తూ ఉండేది.