Share News

Nagidi Gayathri: ప్యాచీల బోటుతో పతకాలు పట్టింది

ABN , Publish Date - Feb 13 , 2025 | 06:13 AM

ఈత మొదలు ఇంజిన్‌ బోటు మరమ్మతుల వరకు అన్నీ తెలుసుకుంది. వాటర్‌ స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టి... నేడు జాతీయ క్రీడల్లో కనోయి స్లాలోం ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది.

Nagidi Gayathri: ప్యాచీల బోటుతో పతకాలు పట్టింది

నాన్నతో కలిసి సరదాగా నదిలో వేటకు వెళ్లినప్పుడు ఆ చిన్నారికి తెలియదు... ఒక రోజు తాను జల క్రీడల్లో చాంపియన్‌ అవుతానని. తెడ్డు వేయడం... వల విసరడం... చేపలను ఒడిసి పట్టకోవడం... ఒక్కొక్కటీ నేర్చుకుంది. ఈత మొదలు ఇంజిన్‌ బోటు మరమ్మతుల వరకు అన్నీ తెలుసుకుంది. వాటర్‌ స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టి... నేడు జాతీయ క్రీడల్లో కనోయి స్లాలోం ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. మత్స్యకార కుటుంబం నుంచి వచ్చి... అద్భుత ప్రతిభతో దూసుకుపోతున్న నాగిడి గాయత్రి... ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

‘కృష్ణా జిల్లా నాగాయిలంక మా స్వగ్రామం. నాన్న నాగబాబు, అమ్మ వెంకట నాగేశ్వరమ్మకు నేను రెండో సంతానం. నాన్న చేపల వేటపైనే మేము బతికేది. నాన్న నదిలోకి వేటకు వెళ్లేప్పుడు నన్ను తీసుకెళ్లమని చిన్నతనంలో మారం చేసేదాన్ని. నా పోరు పడలేక నాన్న నన్ను వెంటబెట్టుకుని వెళ్లేవాడు. అలా ఈత దగ్గర నుంచి నదిలో తెడ్డు వేయడం, ఒడుపుగా పడవ నడపడం, వల, లంగర్‌ వేయడం, చేపలు పట్టడం, ఇలా ఒక మత్స్యకారుడికి కావాల్సిన మెళకువలన్ని ఒక్కొక్కటి అవపోశన పట్టాను. ఒక విధంగా నాన్నే నా తొలి గురువు. ఒక పక్క చదువుకుంటూనే బడిలేని రోజుల్లో నాన్నతో కలిసి చేపల వేటకు వెళుతుండేదాన్ని. హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు అన్ని క్రీడల్లో పాల్గొనున్నాను. మండల, జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పలు పతకాలు కూడా సాధించా. ఆ సమయంలో మా కుటుంబానికి తెలిసిన ఒక కరాటే మాస్టారు ద్వారా ఆ క్రీడపై ఆసక్తి కలిగింది. కరాటేలో జాతీయ స్కూల్‌ గేమ్స్‌ జూనియర్‌ విభాగంలో స్వర్ణం పతకం కూడా సాధించా.

gfnl;.jpg

మలుపు తిప్పిన సంబరాలు...

2017లో నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఆ ఏడాది మా ఊళ్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాటర్‌ స్పోర్ట్స్‌ (కనోయింగ్‌ కయాకింగ్‌) నిర్వహించారు. ఈ పోటీల్లో అంతకుముందు నేను చూడని బోట్లు కృష్ణా నది బ్యాక్‌ వాటర్‌లో దూసుకెళ్లాయి. ఆ బోట్లు, క్రీడాకారుల శైలి నన్ను ఆకర్షించాయి. పోటీలు నిర్వహించిన బలరామ్‌ నాయుడు సార్‌ను కలిసి వాటర్‌ స్పోర్ట్స్‌ గురించి తెలుసుకున్నా. కేరళ మాదిరి మా దగ్గరున్న వాతావరణం వాటర్‌ స్పోర్ట్స్‌కు బాగుంటుందని వాటర్‌ స్పోర్ట్స్‌ నిపుణుడు సాంబశివారెడ్డి సార్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అకాడమీ పెట్టడానికి సాఽధ్యసాధ్యాలను పరిశీలించడానికి ప్రభుత్వ బృందం వచ్చినప్పుడు మా పడవలోనే నాన్న, నేను వారికి నది మొత్తం తిప్పి చూపించాం. స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ గారి చొరవతో 2018లో అక్కడ ‘శాప్‌’ వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేసింది.


అమ్మానాన్నల ప్రోత్సాహంతో...

అమ్మానాన్నల ప్రోత్సాహంతో వెంటనే అకాడమీలో చేరా. కోచ్‌లు నాగబాబు, శ్రీనివాస్‌ అప్పటివరకు మేము నేర్చుకున్న విద్యకంటే విభిన్నంగా ప్రొఫెషనల్‌ కోచింగ్‌ ఇవ్వడం ఆరంభించారు. అకాడమీలో మూడు బోట్లు ఉండగా మేము 30 మంది పిల్లలం ఉండేవాళ్లం. ఒకరి తర్వాత ఒకరు నేర్చుకునేవాళ్లం. ఆ సమయంలోనే 2019లో స్పోర్ట్స్‌ కోటాలో విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాలలో డిప్లమో కోర్సులో సీటు వచ్చింది. ఈ కోర్సు చేస్తూనే శిక్షణ కొనసాగించి రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటా. నాన్న ఒక్కడి కష్టంపైన కుటుంబం మొత్తం బతకాలి. ఈ క్రమంలో చదువు పూర్తి చేసి ఏదైన ఉద్యోగం చేసి నాన్నకు అండగా ఉండాలా? లేదా వాటర్‌ స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు, అమ్మనాన్న నాకు వాటర్‌ స్పోర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు.

డబ్బులు లేక...

గతేడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌ప, అంతర్జాతీయ వాటర్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించి, అందులో పాల్గొనే అవకాశం వచ్చింది. థాయ్‌లాండ్‌ వెళ్లడానికి రూ.1.80 లక్షలు కావాల్సి వచ్చింది. డబ్బులు లేక అవస్థలు పడుతుంటే... బాపట్లలో ప్రస్తుతం నేను చదువుతున్న వెలగపూడి రామకృష్ణ మెమోరియల్‌ కళాశాల కరస్పాడెంట్‌ బుచ్చియ్య చౌదరి సహాయం చేశారు. ఆయన సహకారంతో అక్కడి వెళ్లాను కానీ, పతకాలు సాధించలేకపోయా. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు, నీటి ప్రవాహం తీరు, అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ఒక అవగాహన వచ్చింది. ఇక్కడలా నదీ జలాల్లో అక్కడ పోటీలు నిర్వహించడం లేదు. కృతిమ సరస్సు, అందులో కృత్రిమ అలలు సృష్టించి పోటీలు నిర్వహించడంతో నాకు కొత్తగా అనిపించి, అర్థం చేసుకోలేకపోయా.


కోచ్‌లు లేకుండానే శిక్షణ...

2019లో ప్రభుత్వం మారాక మా ఊళ్లోని అకాడమీ మూత పడింది. అకాడమీ భవనం కూడా ఇప్పటికీ పూర్తికాలేదు. కోచ్‌లు లేకుండానే అక్కడున్న మూడు బోట్లతో మేమే సాధన చేసుకునేవాళ్లం. మా వెనుక ఇంట్లో పెద్దవాళ్లు తోడుగా వచ్చేవాళ్లు. సరైన సదుపాయాలు, శిక్షణ లేకపోవడంతో ఒక దశలో డీలా పడ్డా. ఆ తరుణంలో కొందరు క్రీడాకారులు తేజ, గిరిబాబు, చిన్నబాబు ప్రోత్సహంతో శిక్షణకు మధ్యప్రదేశ్‌ వెళ్లా. అక్కడ జాతీయ కోచ్‌ కులదీప్‌ సార్‌ శిక్షణలో మరింత నైపుణ్యం సంపాదించాను.

తడి బట్టలతోనే..

రెండుసార్లు జాతీయ క్రీడల్లో పాల్గొన్నా పసిడి పతకం సాధించలేకపోయాననే బాధ నాలో ఎక్కువైంది. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ క్రీడలకు రెండు వారాలు ముందుగానే వెళ్లాను. పోటీలు జరిగే ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో కానీ గదులు అద్దెకు దొరకలేదు. రోజూ ఆ కొండల మధ్యలోనే అంత దూరం ప్రయాణించి మా వంట మేమే చేసుకుంటూ సాధన చేశాను. ఎండ ఎక్కువ కాస్తే మంచు పర్వతాలు కరిగి ఉన్నఫలంగా నదిలో నీరు పెరిగేది. నీళ్లు చల్లగా ఉండడంతో పాటు ప్రవాహం వేగంగా ఉండేది. వీటన్నింటిపై ఒక అంచనాకు వచ్చా. గత రెండు జాతీయ క్రీడల్లో నేను ఓడిపోవడానికి ఒక కారణం మంచి బోటు లేకపోవడం కూడా. ఈసారీ అదే సమస్య. అయినా పతకం గెలవాలనే సంకల్పం. నాది ప్యాచీలు, రిపేర్లు చేసిన సాధారణ ఫైబర్‌ బోటు. ప్రత్యర్థులేమో అధునాతన కార్బన్‌ బోట్లు వేసుకొని సాధన చేస్తున్నారు. నా బోటు బరువు 27 కిలోలు ఉంటే వారి బోట్ల బరువు 13 కిలోలే. వారివి తేలికైన బోట్లు. నేను వేసుకునే బట్టలు ఒక్కసారి నీళ్లు పడితే ముద్దముద్దగా తడిసిపోయే సాధారణ దుస్తులు. వారివి శరీరమంతా తడవకుండే ఉండే ప్రత్యేకమైన సూట్లు. ఇవన్నీ నాకు పోటీలో ప్రతికూలాంశలు. ఎలాగైనా ఈసారి స్వర్ణం సాధించానే పట్టుదల. నాన్నతో చెబితే ‘అవన్నీ లేకుండానే నువ్వు ఇప్పటివరకు ఇన్ని పతకాలు సాధించావు. నీలో స్వర్ణం సాధించే సత్తా ఉంది’ అంటూ మనోధైర్యం నింపారు. ఇప్పటివరకు కనోయి స్లాలోం ఈవెంట్‌లో స్వర్ణం మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రానికి పోలేదు. అంతటి పోటీని తట్టుకొని తొలిసారి నేను ఆంధ్రప్రదేశ్‌కు ఈ పతకాన్ని అందించా.

ఈ విజయం నాలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. వచ్చే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా ముందున్న లక్ష్యం. నాకు కావాల్సింది మంచి బోట్లు, దుస్తులు, జర్మనీ వంటి దేశాల్లో ప్రత్యేక శిక్షణ. రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తే దేశం గర్వించే స్థాయికి ఎదుగుతా.’’

ఎస్‌.ఎ్‌స.బి.సంజయ్‌


నాన్న అప్పులు చేసి...

దూర ప్రాంతాల్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు అనేకం. నాన్న అప్పులు చేసి ఆ సమయానికి ఏదో విధంగా నన్ను పంపేవాడు. నాకు తొలిసారిగా 2022 గుజరాత్‌ నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది. అక్కడి వాతావరణం, నీటి ప్రవాహాన్నీ పూర్తిగా అంచనా వేయలేకపోవడంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తరువాత మరింత కసిగా శ్రమించాను. అదే ఏడాది చండీగఢ్‌లో జరిగిన జాతీయ రోయింగ్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం, మధ్యప్రదేశ్‌లో జరిగిన అంతర్జాతీయ కనోయి స్లాలోంలో, ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో కాంస్య పతకాలు నెగ్గడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మరుసటి ఏడాది గోవాలో జరిగిన నేషనల్‌ గేమ్స్‌కు అర్హత సాధించా. అక్కడ రజత పతకం సాధించాను. దాంతో నా శక్తి సామర్థ్యాలపై నాకొక గురి కుదిరింది.


ఇవి కూాడా చదవండి..

Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Maha Kumbh Mela 2025: మాఘపూర్ణిమ సందర్భంగా కుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం.. 6 గంటల నాటికి 73.60 లక్షల మంది

Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2025 | 06:13 AM