Love: ప్రేమను గెలిపిద్దాం!
ABN , Publish Date - Feb 13 , 2025 | 06:08 AM
చూపులు కలిసినంత సులువు కాదు మనసులు ముడిపడడం. ప్రేమంటే భావోద్వేగాల బంధం. ఒకరికి ఒకరుగా... ఇద్దరూ ఒకటిగా జీవించాలని తపించే అనుబంధం. ఇది బలమైన బంధమై... ప్రేమ ప్రయాణం కలకాలం సాగాలంటే రెండు వైపుల నుంచీ నిరంతర ప్రయత్నం వసరమంటున్నారు లవ్ గురువులు. మనలోని లోటుపాట్లను తెలుసుకొని... ఒకరిపై ఒకరిరు నమ్మకంతో అడుగులు వేస్తే అంతా ఆనందకరమే అంటున్నారు. అందుకు వారు ఇస్తున్న సలహాలివే...

మ్యాజిక్ బాక్స్ కాదు...
ఒకరితో సాంగత్యం ఎప్పుడూ మధురానుభూతినిస్తుంది. కానీ అదే జీవితమనుకోవద్దు. వాస్తవానికి రిలేషన్‌షిప్ మ్యాజిక్ బాక్స్ కాదు... మీ బాధలన్నీ చిటికెలో పోగొట్టేసి జీవితాన్ని ఆనందమయం చేయడానికి! మీ సంతోషం వేరెవరి చేతుల్లోనో కాదు... మీ చేతుల్లోనే ఉందని గమనించండి.
భిన్నాభిప్రాయాలు సహజం...
మీ అలవాట్లు, అభిప్రాయాలు, జీవనశైలి, దృష్టి కోణం లానే మీ భాగస్వామి కూడా ఉండాలని ఆశించవద్దు. ఏ ఇద్దరూ ఒకేలా ఉండరనేది గుర్తించండి. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నా పట్టించుకోవాల్సిన పని లేదు. కావల్సిందల్లా ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకోవడం... వాళ్లని వాళ్లలానే మీ జీవితంలోకి ఆహ్వానించడం.
ఇరువైపుల నుంచీ ప్రయత్నం...
ఏ ప్రేమ బంధమూ పర్‌ఫెక్ట్ కాదు! దాన్ని పక్కాగా తీర్చిదిద్దుకోవడానికి రెండు వైపుల నుంచీ నిరంతర ప్రయత్నం జరుగుతుండాలి. ప్రతి అనుబంధంలో ఎప్పుడో ఒకప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతాయి. చిన్న చిన్న వాదనలు, గొడవలు జరుగుతాయి. ఇలాంటప్పుడే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకుని, బంధాన్ని ఆనందమయం చేసుకొంటూ ముందుకు సాగాలి.
విలువలు ముఖ్యం...
ప్రేమలో కొన్ని మంచి రోజులు... ఒకరికి ఒకరికి పడని రోజులూ ఉండవచ్చు. కానీ... నైతిక విలువలు దెబ్బతినేలా ఒకరి గౌరవానికి ఒకరు భంగం కలిగించే రోజు ఒక్కటి కూడా రాకూడదు. ఎందుకంటే ప్రేమన్నది బాధను పెంచడానికి కాదు... రెండు హృదయాలను దగ్గరకు చేర్చడానికని తెలుసుకోండి.
అతిగా ఆశించవద్దు...
మీలానే మీ భాగస్వామి కూడా ఉండాలని ఆశించడం సహజమే. కానీ... కొన్ని కొన్ని మీ నియంత్రణలో లేవని బాధపడుతూ కూర్చోకండి. జరిగినవి, జరగబోయేవీ తలుచుకుని చింతిస్తూ మానసిక ఒత్తిడిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి. మీ స్నేహం ఆనందంగా సాగుతుంటే... దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి కలిసి ప్రయత్నించండి. అంతే కానీ... జరగనివాటిని ఆశించి భంగపడవద్దు.
ఆ సత్యాన్ని అర్థం చేసుకోండి...
ఒక వేళ మీ ప్రేమ విఫలమైతే... అది మళ్లీ పుడుతుందన్న నిజాన్ని అర్థం చేసుకోండి. కొంత మంది తొలి ప్రేమే ఇక చివరిదని, నిజమైన ప్రేమ జీవితంలో ఒక్కసారే పుడుతుందనే దురభిప్రాయంలో ఉంటారు. ఒకసారి గుండె పగిలినంత మాత్రాన అది మళ్లీ అతకదనుకోవడం పొరపాటు. తొలి ప్రేమలోనే జీవిత భాగస్వామిని పొందితే హ్యాపీనే. ఒకవేళ పొందలేకపోతే... జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మీ కోసమే వేచి ఉన్నాయని తెలుసుకోండి.
ఇవి కూాడా చదవండి..
Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Kejriwal: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.