సీత మహిళకు భరోసా
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:35 AM
మన చుట్టూ నైపుణ్యం ఉన్న మహిళలు అనేక మంది ఉంటారు. వారికి అవకాశాలు లభించటం కష్టమే! అలాంటి వారందరినీ ఒకే చోట చేర్చి.. అవకాశాలు కల్పిస్తే? స్వాతి నీలభట్లకు ఇలాంటి ఆలోచనే వచ్చింది. ‘సీతా’ అనే మొబైల్...

మన చుట్టూ నైపుణ్యం ఉన్న మహిళలు అనేక మంది ఉంటారు. వారికి అవకాశాలు లభించటం కష్టమే! అలాంటి వారందరినీ ఒకే చోట చేర్చి.. అవకాశాలు కల్పిస్తే? స్వాతి నీలభట్లకు ఇలాంటి ఆలోచనే వచ్చింది. ‘సీతా’ అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. నాలుగేళ్ల క్రితం ఆమె ప్రారంభించిన ‘షీ జాబ్స్’కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ‘సీతా’ మొబైల్ యాప్ విడుదల నేపథ్యంలో స్వాతి తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
సీతా యాప్ ఆలోచన ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించే ముందు- షీ జాబ్స్ పోర్టల్ గురించి కూడా చెప్పాలి. ఈ పోర్టల్ కేవలం మహిళల కోసమే ఉద్దేశించినది. ఐటీలో పనిచేసే మహిళలు కొన్ని సందర్భాలలో ఉద్యోగానికి బ్రేక్ ఇస్తూ ఉంటారు. పిల్లలు పుట్టడం వల్ల కావచ్చు.. ఇంట్లో పెద్ద వాళ్లను చూసుకోవాల్సిన అవసరం వల్ల కావచ్చు.. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఒక సారి ఉద్యోగం మానేసిన తర్వాత వారికి మళ్లీ ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం. చాలా సార్లు జాబ్ కన్సల్టెంట్స్ దగ్గరే వీరి అప్లికేషన్లు ఆగిపోతాయి. ఎందుకంటే ఐటీ రంగంలో చాలా పోటీ తత్వం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో బ్రేక్ వస్తే వారికి ఈ టెక్నాలజీలు తెలుసా? లేదా అనే అనుమానం కంపెనీ వారికి వస్తూ ఉంటుంది. అందువల్ల జాబ్ బ్రేక్ ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వటానికి వారు సిద్ధంగా ఉండరు. ఇలాంటి వారందరికీ సాయం చేయటం కోసం నేను కోవిడ్ సమయంలో ఈ పోర్టల్‌ను ప్రారంభించాను. ఈ పోర్టల్‌లో ఉద్యోగం కావాల్సిన వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఐటీ కంపెనీల వారు తమ వద్ద ఉన్న ఉద్యోగ అవకాశాలను పోర్టల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇదే విధంగా పోర్టల్ తరుపున ఇండియా, అమెరికాలో ఉన్న కంపెనీలకు మేము కూడా అప్లికేషన్లు పంపుతూ ఉంటాం. అంతే కాకుండా మా పోర్టల్‌లో చేరిన వారికి కొత్త టెక్నాలజీలలో శిక్షణ ఇస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక అమ్మాయి ఇంజినీరింగ్ చదివిందనుకుందాం. చదువు పూర్తయిన వెంటనే ఆమెకు పెళ్లి అయిపోయిందనుకుందాం. పిల్లలు పుట్టడం.. వారు పెద్ద వాళ్లు అయ్యేదాకా ఆగటం దాకా ఒక ఐదేళ్లు గ్యాప్ వచ్చిందనుకుందాం. అప్పుడు ఆ అమ్మాయికి కొత్త కొత్త టెక్నాలజీలు తెలియవు. అలాంటి వాళ్లకు శిక్షణ అవసరం అవుతుంది. ఈ శిక్షణ వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది కేవలం మహిళలను ఉద్దేశించిన పోర్టల్ కాబట్టి.. మహిళా ఉద్యోగుల సంఖ్య పెంచాలనుకొనే కంపెనీలు మా పోర్టల్‌లో ఉన్న అప్లికేషన్లను తీసుకుంటూ ఉంటాయి. ఇలా ఇప్పటి వరకు మా పోర్టల్‌కు సుమారు లక్ష అప్లికేషన్లు వచ్చాయి. వీరిలో చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అయితే ఇది కేవలం ఐటీ.. ఐటీ ఆధారిత టెక్నాలజీలలో పనిచేసే వారికి ఉద్దేశించినది మాత్రమే. కానీ నాకు షీ జాబ్స్ పోర్టల్‌కు అనేక రకాల మెయిల్స్ వచ్చేవి. ఈ మెయిల్స్‌లో కొందరు తాము బాగా పెయింటింగ్ వేస్తామని.. తమకు మేకప్ గురించి తెలుసని.. తమకు ఏవైనా అవకాశాలు లభిస్తాయా అని అడిగేవారు. ఇలాంటి వారందరి కోసం ఒక ఒక ప్రత్యేకమైన యాప్‌ను తయారుచేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. ఈ యాప్‌లో మేకప్, డిజైనింగ్, ఫ్యాషన్, రైటింగ్- ఇలా రకరకాల రంగాల్లో నైపుణ్యం ఉన్న మహిళలు తమ అప్లికేషన్లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రంగాల్లో ఉద్యోగాలు లేదా సేవలు అవసరం ఉన్నవారు ఈ యాప్‌కు వెళ్లి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటారు. అంటే నైపుణ్యం ఉన్న మహిళలు అందరూ ఒకే చోట కంపెనీల వారికి లభ్యమవుతారు. ఇదే విధంగా మహిళలు ఉద్యోగాల కోసం వేర్వేరు చోట్ల వెతుక్కొవాల్సిన అవసరం ఉండదు. కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు. తాము అందించే సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ యాప్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను.
ఈ ఆలోచన వెనక..
నా జీవితంలో ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల వల్ల నేను ‘షీ జాబ్స్’ను, ‘సీతా యాప్’ను ప్రారంభించాను. నేను కూడా చాలా మంది అమ్మాయిలలాగే ఇంజినీరింగ్ చదివాను. ఉద్యోగంలో చేరా. ఆ తర్వాత పెళ్లి అయింది. ఒక పిల్లవాడు పుట్టాడు. రెండేళ్లు వచ్చేసరికి.. తనకు ఆటిజం ఉందని తేలింది. మా బాబుకు మంచి వైద్య సదుపాయాలు అందించటం కోసం మేము అమెరికా వెళ్లిపోయాం. ఆ సమయంలో నేను ఒక వైపు ఉద్యోగం చేసేదాన్ని. మరో వైపు బాబును చూసుకొనేదాన్ని. దీనితో నాపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సాధారణంగా కంపెనీల్లో ఉద్యోగులకు కొంత వరకు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. అంతకు మించి వెసులుబాటు కోసం ప్రయత్నిస్తే ఇబ్బంది అవుతుంది. తోటి ఉద్యోగుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. ఇలాంటి అనేక కారణాల వల్ల నేను ఉద్యోగం మానేసి ఒక సొంత కంపెనీ ప్రారంభించాను. నాలాంటి తల్లులను మరి కొందరిని నా కంపెనీలో ఉద్యోగుస్తులుగా తీసుకున్నాను. మేమందరం కలిసి పనిచేయటం వల్ల కంపెనీ పైకి వచ్చింది. కానీ నాలాంటి వారెందరో ఉన్నారు. వారందరికీ అవకాశాలు రాకపోవచ్చు. వారి కోసమే పోర్టల్‌ను.. యాప్‌ను ప్రారంభించాను.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
నాన్న ప్రోత్సాహమే!
మా నాన్నగారు దుర్గాప్రసాద్ సీనియర్ జర్నలిస్టు. ఆయన ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారు. జర్నలిస్టు యూనియన్ లీడర్ కూడా. ఆయన చిన్నప్పటి నుంచి నన్ను స్వేచ్ఛగా పెంచారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చెప్పేవారు. ఆయనకు జర్నలిజం అంటే పిచ్చి. ఆంధ్రజ్యోతి పేరిట నన్ను ఇంట్లో జ్యోతి అని పిలిచేవారు. ఆయన ఇప్పుడు లేరు. కానీ నేను పోర్టల్ పెట్టినా.. యాప్ అభివృద్ధి చేసినా, చిన్నప్పటి నుంచి ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కారణం.
సమస్యలు అనేకం..
పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసే ఉమెన్ లీడర్స్ నా పోర్టల్‌ను సపోర్టు చేస్తున్నారు. వీరి సహకారం వల్లే నాకు- ‘ఎర్నస్ట్ అండ్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ విన్నింగ్ ఉమెన్ అవారు’్డ.. ‘100 ఉమెన్ టూ నో ఇన్ అమెరికా’ గుర్తింపు వంటివి లభించాయి. ఇక ఐటీ కంపెనీలలో ఉన్నత స్థానాల్లో పనిచేసే మహిళలకు కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా ఐటీ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పురుషులే ఎక్కువ మంది ఉంటారు. ఉన్నత స్థానాల్లో 95 మంది పురుషులు.. ఐదుగురు మహిళలు ఉన్నారనుకుందాం. అప్పుడు పురుషులు చెప్పేదే ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. అంతేకాదు. ఎవరైనా ఒక మహిళ - ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెబితే - ‘‘ఈమె చాలా ఎగ్రసివ్.. లేదా ఎమోషనల్’’ అని ముద్ర వేసేవారు ఉంటారు. వీటన్నింటినీ తట్టుకొని లీడర్‌షిప్ స్థానాల్లోకి ఎదగటం అంత సులభం కాదు.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..