గిరిజనుల కోసం ప్రాజెక్ట్ ట్రైబలి
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:09 AM
సమాజం ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తున్నా... కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు ఇంకా వెనుకబడే ఉంటున్నారు. అలాంటివారి కోసం చిన్న వయసులో పోరాటం మొదలుపెట్టింది...
సమాజం ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తున్నా... కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు ఇంకా వెనుకబడే ఉంటున్నారు. అలాంటివారి కోసం చిన్న వయసులో పోరాటం మొదలుపెట్టింది నిహారిక నాయర్. గిరిజనులకు ఆధార్ కార్డులు అందేలా, వారి కోసం వైద్య శిబిరాలు నిర్వహించేలా ప్రత్యేక చొరవ చూపింది. గిరిజన కళాకారులకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్న నిహారిక నాయర్ కథ ఇది.
బెంగళూరుకు చెందిన నిహారిక 8వ తరగతి చదువుకునేటప్పుడు గిరిజనులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుసుకుంది. దాంతో వారి కోసం ఏదైనా చేయాలనే తపన ఆమెలో కలిగింది. అలా 17 ఏళ్ల వయసులోనే గిరిజనులకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో 2020లో ప్రాజెక్ట్ ట్రైబలి ప్రారంభించింది. దాని ద్వారా కర్ణాటక, కేరళలలోని గిరిజనులు ప్రాథమిక హక్కులు పొందేలా, ఆదాయం సంపాదించుకునేలా తన వంతు సహాయం చేస్తోంది. వారి సంస్కృతి, వారసత్వం అంతరించిపోకుండా అండగా నిలుస్తోంది.
12 వేల మందికి ఆధార్
చాలా చోట్ల గిరిజనులు ప్రభుత్వం పథకాలను అందుకోరు. ఎందుకంటే కనీసం వారి పేర్లు ఓటరు జాబితాలో కూడా ఉండవు. అందుకే అలాంటి వారికి ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు అందించాలని భావించింది. నిహారిక. అందుకోసం వేలాది మంది గిరిజనులు ఆధార్ కార్డులు పొందేలా చేసి, వారికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేసింది. అంతేకాకుండా గిరిజన వర్గాల్లో పోషకాహార లోపం ప్రబలంగా ఉంటుందని తెలుసుకుని ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంలోనూ చొరవ చూపింది. చాలామంది గిరిజనులు తమ కళలను మర్చిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడంతో, వారి కళలు, సంస్కృతి అంతరించి పోకూడదని గిరిజన కళాకారులకు శిక్షణ ఇప్పించి, వారి కళాకృతుల అమ్మకాన్ని సులభతరం చేసింది. వారికి జీవనోపాధి కలిగించింది. అవసరంలో ఉన్న గిరిజనులకు చేయూత అందించేందుకు నిధులు కూడా సేకించింది నిహారిక. గతేడాది ఐక్యరాజ్యసమితి ప్రఽధాన కార్యాలయంలో జరిగిన 1ఎం1బి యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ‘ప్రాజెక్ట్ ట్రైబలి’ని నిహారిక ప్రదర్శించి అలా గిరిజనుల ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్జాతీయ వేదిక మీద చూపించింది.
అవినీతి వలన అన్యాయం
ప్రభుత్వాలు గిరిజనుల కోసం ప్రతీ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ అవినీతి కారణంగా వారికి ఓ ప్రయోజనాలు అందట్లేదని ఓ సందర్భంలో నిహారిక అన్నది. ఇక్కడ మరో ప్రధాన సమస్య గిరిజనులకు సరైస అవగాహన లేకపోవడమని ఆమె అభిప్రాయపడింది. పాఠాశాలలకు ఉన్నప్పటికీ అవగాహన, ప్రేరణ లేకపోవడం వల్లనే చాలామంది గిరిజన పిల్లలు, యువత చదువుకు దూరంగా ఉంటున్నారని పేర్కొంది. గిరిజనులకు చదువు లేకపోయినా, వారు చాలా పాత పద్ధతులను అనుసరించి జీవిస్తున్నప్పటికీ వారి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చని ఆమె అన్నారు. మొక్కలు, వాటి ఔషధ గుణాలను అర్ధం చేసుకోవడంలో వారికి చాలా ప్రావీణ్యం ఉందని అన్నది. తాను ఓ కుగ్రామానికి వెళ్లినప్పుడు వారు మూలికలు, మొక్కల్లో ఔషధాల గురించి మలయాళంలో రాసిన 300 పేజీల పుస్తకాన్ని తనకు చూపించారని వెల్లడించారు.
For AndhraPradesh News And Telugu News