Share News

వైఫల్యాలను స్వీకరిద్దాం

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:27 AM

మానవుడి ఎదుగుదల, పరిణామ క్రమంలో అనేకసార్లు వైఫల్యాలు ఎదురవడం సహజం. వైఫల్యం కచ్చితంగా మనల్ని కుంగదీస్తుంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నుంచి ఆత్మహత్య వరకూ... దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కానీ...

వైఫల్యాలను స్వీకరిద్దాం

సద్బోధ

మానవుడి ఎదుగుదల, పరిణామ క్రమంలో అనేకసార్లు వైఫల్యాలు ఎదురవడం సహజం. వైఫల్యం కచ్చితంగా మనల్ని కుంగదీస్తుంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నుంచి ఆత్మహత్య వరకూ... దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కానీ వైఫల్యానికి ఒక సానుకూలమైన కోణం కూడా ఉంది. దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. కొత్త ఆలోచనలు చేయవచ్చు. కొత్త ఆశలు చిగురింపజేసుకోవచ్చు. ఇవన్నీ మన ప్రయాణానికి కొత్త దిశను అందిస్తాయి.

సమస్యలు శత్రువులు కాదు....

మన జీవితాల్లో విజయం కన్నా వైఫల్యమే ఎక్కువ సార్లు ఎదురవుతుందనేది ఒక వాస్తవం. కాబట్టి, వైఫల్యాలకు కుంగిపోకుండా, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ముందుకి సాగుతూ ఉండాలి. మనం విఫలమైనప్పుడు... అంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చెయ్యకుండా జాగ్రత్త పడాలి. మన తప్పుల నుంచి మనం నేర్చుకున్నంతకాలం... అవి మనకి ఎలాంటి హానీ చెయ్యలేవు. విజయవంతమైన వ్యక్తులు కూడా విఫలమైన వ్యక్తుల్లాగానే వైఫల్యాలు ఎదుర్కొంటూ ఉంటారనేది నమ్మడం కష్టమైనప్పటికీ అది వాస్తవం. కానీ తేడా ఏమిటంటే... వాళ్ళు తమను తాము మెరుగుపరుచుకొని, తమ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రగతి దిశగా ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే విజయం అనేది వైఫల్యానికి అవతలి చివర్లో ఉంటుది. విజేతలు తమ విజయంకోసం సాగించిన పయనంలో అనేకసార్లు విఫలమైనవారే. కానీ వాళ్ళు ఒక వైఫల్యంగా తమను ఎన్నటికీ పరిగణించుకోరు. మహా భక్తురాలు, కవయిత్రి మీరాబాయి ఒక రాణి. ఆమె భర్తను కోల్పోయిన తరువాత బంధువులు ఎంతగానో వేధించారు, హింసించారు. చిత్తోడ్‌గఢ్‌ రాజమందిరాన్ని విడిచి ఆమె బయటకు పోవాల్సి వచ్చింది. కానీ ఈ ప్రతికూలతను ఒక అవకాశంగా ఆమె మార్చుకుంది. బృందావనానికి వెళ్ళి, అక్కడే నివసిస్తూ ఆధ్యాత్మిక సంపదను పోగు చేసుకుంది. కాబట్టి గొప్పవారు తమకు ఎదురైన కష్టాలకు కుంగిపోరు. తమ అంతరంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశంగా దాన్ని మలచుకుంటారు. సమస్యలు మనకు శత్రువులు కాదు. అవి నేర్చుకోవడానికి మనకు అనేక అవకాశాలు ఇస్తాయి. కొత్త దృక్పథంతో జీవితాన్ని చూసేలా చేస్తాయి. ఆత్మశోధనకు ఆస్కారం కల్పిస్తాయి. మనలో దాగి ఉన్న సామర్థ్యాలను బయటకు తీయడానికి దోహదం చేస్తాయి.


ఎదుగుదలే శాశ్వతం

‘‘లోకహానౌ చింతా న కార్యా నివేదితాత్మ లోక వేద శీలత్వాత్‌... భక్తుడు తనను, ఈ లోకాన్ని, ఇక్కడ చేసే కర్మలను, తన ప్రవర్తనను... ఇలా అన్నిటినీ ఆ పరమాత్మకే సమర్పిస్తాడు. కాబట్టి అతను ఎటువంటి కష్టాలకు, దుఃఖాలకు చలించడు. వాటిలో దేవుడి కృపనే దర్శిస్తాడు’’ అన్నాడు నారద మహర్షి తన ‘భక్తి సూత్రాల’లో. కష్టాల్లో కూడా దైవికమైన ఆశీర్వాదం అంతర్లీనంగా ఉందని నారద మహర్షి మనకు ఉపదేశిస్తున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ప్రాపంచికమైన విషయాలకు దూరంగా జరుగుతాం. అలాంటి కష్ట సమయాల్లో భగవంతుణ్ణి మీ మనసులో స్మరించుకోండి. మీ ప్రవర్తనలను మార్చుకోవడానికి ప్రయత్నించండి. భౌతికమైన లక్ష్యాలను పెంచుకోవడం మన లక్ష్యం అయితే... ప్రతికూల పరిస్థితులను సహజంగానే ఎదుర్కోవలసి వస్తుంది. కానీ మనం ఆధ్యాత్మికమైన పురోగతిని కోరుకున్నప్పుడు... ప్రతికూలతలను ఎదుగుదలకు అవకాశాలుగా చూడడం నేర్చుకుంటాం. కష్టాల వల్ల కలిగే బాధ తాత్కాలికమని, వాటిని ఎదుర్కొని, పరిష్కరించుకోవడం ద్వారా మనలో సంభవించే ఎదుగుదల శాశ్వతమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

స్వామి ముక్తానంద

జేకేయోగ్‌ వ్యవస్థాపకుడు


ఇవి కూడా చదవండి

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిపై సీఎం చంద్రబాబు ట్వీట్

మామా అన్నాడని దాడి.. కావాలిలో వైసీపీ నేత దాష్టీకం

Read latest AP News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 01:27 AM