Share News

Glamping India: గ్లాంపింగ్‌తో పర్యాటకానికి కొత్త కళ

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:05 AM

పచ్చని ప్రకృతి ఒడిలో గ్లామర్‌ కేంపింగ్‌ అనుభవాలను పంచుతున్న ఎలీనా థామస్‌ ‘లక్స్‌గ్లాంప్‌’ ద్వారా కొత్త పోకడను ప్రారంభించారు. కేరళకు చెందిన ఎలీనా, కొడైకెనాల్‌ పక్కన పూంబరాయ్‌ గ్రామంలో వినూత్న గ్లాంపింగ్‌ రిసార్ట్‌ను అభివృద్ధి చేశారు.

Glamping India: గ్లాంపింగ్‌తో పర్యాటకానికి కొత్త కళ

పచ్చని ప్రకృతి నడుమ గుడారం వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించే ‘క్యాంపింగ్‌’ గురించి మనందరికీ తెలుసు. అయితే ఈ అనుభవానికి మరింత గ్లామర్‌ను జోడించి, సరికొత్త ‘గ్లాంపింగ్‌’ పోకడకు శ్రీకారం చుట్టింది కేరళకు చెందిన ఎలీనా థామస్‌. కొడైకెనాల్‌కు దగ్గర్లోని పూంబరాయ్‌ గ్రామంలో ‘లక్స్‌గ్లాంప్‌’ ఇకో రిసార్ట్స్‌తో వినూత్న గ్లాంపింగ్‌ అనుభవాలను పంచుతున్న ఎలీనా ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

మాది కేరళలోని త్రిస్సూరు. నేను ఎమ్‌బిఎ చదివాను. మా వారు యాంటోనీ థామస్‌, బిజినెస్‌ డెవలపర్‌. వృత్తి రీత్యా మేం దుబాయ్‌లో స్థిరపడ్డాం! లగ్జరీతో పాటు క్యాంపింగ్‌ అర్థం స్ఫురించేలా మా ఇకో రిసార్ట్‌కు లక్స్‌గ్లాంప్‌ అనే పేరును ఎంచుకున్నాం.

నాకు చిన్నప్పటి నుంచి కొత్త ప్రదేశాలను సందర్శించడమంటే చాలా ఇష్టం. ఇదే ఆసక్తి పెళ్లయ్యాక కూడా కొనసాగింది. మా వారు యాంటోనీ థామస్‌తో కలిసి యూరప్‌ మొత్తం పర్యటించాను. నిర్జనమైన చల్లని ప్రాంతాల్లోని గాజు క్యాబిన్లు మొదలు ఆకట్టుకునే ఆల్పైన్‌ లాడ్జీలు, డోమ్స్‌, బబుల్‌ రిట్రీట్స్‌లో కూడా బస చేశాం. కానీ ఇలాంటి అనుభవాన్ని అందించే సౌకర్యవంతమైన బసలేవీ మన దేశంలో నాకు కనిపించలేదు. ఎలాంటి పర్యాటక ప్రాంతానికి వెళ్లినా పూర్తి విలాసవంతమైన హోటళ్లు లేదా ప్రాథమిక వసతులు కూడా లేని క్యాంపింగ్‌ గుడారాలు మాత్రమే మాకు కనిపించాయి.

gtfkh.jpg

కానీ పిల్లలతో, పెద్దలతో కలిసి ఒక ప్రశాంతమైన ప్రాకృతిక ప్రదేశంలో కొన్ని రోజులు సురక్షితంగా గడపాలనుకుంటే, అందుకు తగిన ఏర్పాట్లు బసలో ఉండి తీరాలి. ఆ బస అందమైన ప్రకృతి మధ్యలో ఉండాలి. దాన్లో అన్నిరకాల ఆధునిక సదుపాయాలూ ఉండాలి. ఆ ఆలోచనతో గ్లాంపింగ్‌లో భాగంగా 2018లో ‘లక్స్‌గ్లాంప్‌’కు శ్రీకారం చుట్టాం!


ప్రకృతి, విలాసాలు కలగలసి...

బస కోసం సంప్రదాయ నిర్మాణాలకు బదులుగా డోమ్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. అందుకోసం పచ్చని ప్రకృతికి ఆలవాలమైన కొడైకెనాల్‌, మున్నార్‌లలో లక్స్‌గ్లాంప్‌లను నెలకొల్పాం. దక్షిణ భారతదేశంలో ఇలాంటి డోమ్‌ నిర్మాణాలు ఎక్కడా లేవు. కాబట్టి ఈ వినూత్నమైన డోమ్‌ స్ట్రక్చర్స్‌ నిర్మించడం కోసం ఎంతో కష్టపడ్డాం. ముడి సరుకులన్నిటినీ చైనా, బాలిల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా కుటుంబమంతా సౌకర్యంగా బస చేయడానికి తగిన ఏర్పాట్లను డోమ్స్‌లో కల్పించాం. ప్రత్యేకించి లక్స్‌గ్లాంప్‌ కోసం, కొడైకెనాల్‌కు పాతిక కిలోమీటర్ల దూరంలోని పూంబరాయ్‌ గ్రామాన్ని ఎంచుకోడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. కోలాహలానికి దూరంగా ప్రశాంతమైన పరిసరాలను వెతుక్కుంటూ కొడైకెనాల్‌ చేరుకున్నప్పుడు మాకీ కొండ ప్రాంతం కనిపించింది. అప్పట్లో ఈ ప్రాంతమెంతో వెనకబడి ఉంది.

gf.jpg

సరైన రోడ్డు సదుపాయాలు కూడా లేవు. కానీ శ్రమకోడ్చి లక్ల్‌గ్లాంప్‌ను నిర్మించిన తర్వాత, పర్యాటకుల తాకిడి పెరగడంతో ఈ గ్రామానికి కొత్త కళ చేకూరింది. ప్రయాణ సదుపాయాలు కూడా పెరిగాయి. కొందరు స్థానికులకు లక్స్‌గ్లాంప్‌లో ఉద్యోగాలు కూడా కల్పించాం.


వైఫై, టివి లేకుండా....

లక్స్‌గ్లాంప్‌లో బస చేసే అతిథులకు కల్తీ లేని ప్రాకృతిక అనుభవాన్ని అందించాలన్నది మా సంకల్పం. కాబట్టి అత్యవసరమైనప్పుడు మినహా వైఫై సదుపాయాలను అందించకూడదని నిర్ణయించుకున్నాం. అతిథులను ప్రకృతికి మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే డోమ్స్‌ లోపల టివి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేదు. భవిష్యత్తులో ఇదే తరహా గ్లాంపింగ్‌ నిర్మాణాలను భారతదేశంలోని మరిన్ని పర్యాటక ప్రదేశాలకు విస్తరించాలన్నది మా సంకల్పం.

- గోగుమళ్ల కవిత


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:05 AM