Share News

Mirror cleaning: ఇలా చేస్తే అద్దం మిలమిలా

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:46 PM

అద్దాన్ని ఏవిధంగా వాడినా దానిపై తరచూ మరకలు పడుతుంటాయి. వీటిని శుభ్రం చేయడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాకాకుండా సులువుగా అద్దాన్ని మెరిపించే చిట్కాల గురించి తెలుసుకుందాం..

Mirror cleaning: ఇలా చేస్తే అద్దం మిలమిలా

అద్దంతో డ్రెస్పింగ్‌ మిర్రర్‌, టీపాయ్‌, కిటికీ తలుపులు, కార్యాలయాల్లో ప్రత్యేకమైన క్యాబిన్లు, ప్రత్యేకమైన అరలు ఇలా ఎన్నింటినో రూపొందిస్తూ ఉంటారు. రకరకాల వాహనాలకు చుట్టూరా పలు విధాలుగా ఉపయోగపడేలా అద్దాలు అమరుస్తుంటారు. ఇలా అద్దాన్ని ఏవిధంగా వాడినా దానిపై తరచూ మరకలు పడుతుంటాయి. వీటిని శుభ్రం చేయడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాకాకుండా సులువుగా అద్దాన్ని మెరిపించే చిట్కాల గురించి తెలుసుకుందాం..!

  • ఒక గిన్నెలో ఒక చెంచా వెనిగర్‌ వేసి రెండు చెంచాల నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్పాంజ్‌తో తీసుకుని అద్దం మీద రుద్దాలి. పది నిమిషాల తరవాత కాగితంతో తుడిచేస్తే మరకలన్నీ తొలగిపోయి అద్దం మెరుస్తుంది.


  • ఒక పళ్లెంలో కొద్దిగా టూత్‌పేస్టును తీసుకుని అందులో కొన్ని నీళ్లు చిలకరించి పాలలాగా చేయాలి. ఇందులో పలుచని గుడ్డను ముంచి దానితో అద్దాన్ని తుడవాలి. వెంటనే పొడిగుడ్డతో మరోసారి తుడిచేస్తే అద్దం పూర్తిగా శుభ్రమవుతుంది.

  • ఒక గ్లాసు నీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం లేదా షేవింగ్‌ క్రీమ్‌ కలిపి స్ర్పే బాటిల్‌లో పోయాలి. ఈ నీటిని అద్దం మీద చిలకరించి కాగితం లేదా పొడి గుడ్డతో తుడిస్తే మరకలన్నీ మాయమవుతాయి.


  • అద్దం మీద కొద్దిగా టాల్కం పౌడర్‌ చల్లి పలుచని చేతి రుమాలుతో తుడిచినా ప్రయోజనం కనిపిస్తుంది.

  • అద్దాన్ని పలుచని కాగితం, టిష్యూ పేపర్‌, దూది, పరిశుభ్రమైన గుడ్డ, స్పాంజ్‌, మెత్తని బ్రష్‌తో మాత్రమే తుడవాలి. శుభ్రం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే అద్దం మీద గీతలు పడవచ్చు.

Updated Date - Jun 21 , 2025 | 12:05 AM