Beauty Tips: పారేయక్కర్లేదు మళ్లీ వాడుకోవచ్చు!
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:42 AM
మహిళలు తరచూ తేలికపాటి మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి లిప్‌స్టిక్ విరిగిపోతుంటుంది. నెయిల్ పాలిష్ లాంటివి పొడారిపోతుంటాయి. కొన్ని చిట్కాలతో వీటిని సరిచేసి చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఆ వివరాలు...

మస్కారా
కళ్లకు మస్కారా వేసుకునేటప్పుడు బాటిల్‌ను తెరచి ఉంచాల్సి వస్తుంది. ఆ కారణంగా మస్కారా తేమను కోల్పోయి గట్టిపడుతుంది. అలాంటప్పుడు మస్కారా బాటిల్‌లో మూడు చుక్కల బాదం నూనె వేసి కలపాలి. రెండు గంటల తరవాత చిక్కని ద్రవంలా మారి మస్కారా వేసుకోవడానికి అనువుగా ఉంటుంది.
నెయిల్ పాలిష్
సీసా మూత ఎంత గట్టిగా బిగించినప్పటికీ నెయిల్ పాలిష్ తడారిపోయి గట్టిపడుతుంటుంది. అలాంటప్పుడు సీసాలో నాలుగు చుక్కల నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి కలపాలి. అయిదు నిమిషాల తరవాత నెయిల్ పాలిష్ ద్రవరూపంలోకి వచ్చి కొత్తదానిలా మెరుస్తుంది.
కాంపాక్ట్ పౌడర్
కాంపాక్ట్ పౌడర్‌ను కొంతకాలం వాడిన తరవాత పొడిబారి బాక్స్‌లోనే ముక్కలుగా విరిగిపోతుంటుంది. వీటి మీద కొద్దిగా రబ్బింగ్ ఆల్కహాల్ రాసి దగ్గరగా చేరిస్తే చాలు. అయిదు నిమిషాల్లో ముక్కలన్నీ చక్కగా అతుక్కుంటాయి. కాంపాక్ట్ మృదువుగా మారి పఫ్‌తో అద్దడానికి వీలుగా తయారవుతుంది.
లిప్‌స్టిక్
లిప్‌స్టిక్ తేమను కోల్పోయి పూర్తిగా పొడిబారి రంగు మారితే దానిని అయిదు నిమిషాలు వేడినీటిలో ఉంచాలి. లిప్‌స్టిక్ మృదువుగా అవడమే కాకుండా దాని రంగు తిరిగి వస్తుంది. లిప్‌స్టిక్ విరిగితే పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. విరిగిన భాగాలు అతుక్కుని మళ్లీ ఉపయోగించు కోవడానికి వీలుగా మారుతుంది.