Durga Navaratri 2025: నేటి అలంకారం శ్రీ మహిషాసురమర్దిని
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:29 AM
అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకొంటారు. ‘చండీ సప్తశతి’ ప్రకారం దుర్గాదేవి అష్టభుజాలతో...
దుర్గా నవరాత్రులు
నేటి అలంకారం శ్రీ మహిషాసురమర్దిని
ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి) బుధవారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకొంటారు. ‘చండీ సప్తశతి’ ప్రకారం దుర్గాదేవి అష్టభుజాలతో, సింహవాహినిగా మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కులుడు, బిడాలుడు తదితర రాక్షసులందర్నీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుణ్ణి చంపి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా వెలసింది. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన ఆమె సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సర్వ దేవతల అనుగ్రహం కలుగుతుందంటారు. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయనీ, శత్రు పరాజయం కలుగుతుందనీ, అంతఃశత్రువులు కూడా నశిస్తాయని, ధైర్యం కలుగుతుందనీ, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం.
నైవేద్యం : బెల్లపు అన్నం, పులిహోర, గారెలు, పాయసం, అప్పాలు
అలంకరించే చీర రంగు : గోధుమ, ఎరుపు
అర్చించే పూలు : తామర పుష్పాలు, ఎర్రటి అక్షతలు
పారాయణ: చెయ్యాల్సింది : శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్రం
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం