Genetic Identity: పుట్టుక మర్మం డీఎన్‌ఏలో భద్రం
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:24 AM
ఎగ్ ఫ్రీజింగ్.. ఎంబ్రియో ఫ్రిజింగ్.. డీఎన్‌ఏ పరీక్షలు.. ఇలా ప్రతి రోజు వార్తల ద్వారా అనేక పదాల గురించి వింటూ ఉంటాం. వీటన్నింటికీ ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం....
తెలుసుకుందాం
ఎగ్ ఫ్రీజింగ్.. ఎంబ్రియో ఫ్రిజింగ్.. డీఎన్‌ఏ పరీక్షలు.. ఇలా ప్రతి రోజు వార్తల ద్వారా అనేక పదాల గురించి వింటూ ఉంటాం. వీటన్నింటికీ ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డీఎన్‌ఏ టెస్ట్
ప్రతి వ్యక్తికి తన తల్లిదండ్రుల ద్వారా డీఎన్‌ఏ సంక్రమిస్తుంది. ఇది ఆ వ్యక్తికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ డీఎన్‌ఏలో ఆ వ్యక్తి పుట్టుక రహస్యాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఒకప్పుడు ఈ పరీక్షలను ఒక వ్యక్తి ఉన్న జన్యు లోపాలను గుర్తించటానికి చేసేవారు. ఆ తరువాతి కాలంలో ఒక బిడ్డకు తల్లితండ్రులెవ్వరనే విషయాన్ని తెలియజేయటానికి కూడా ఈ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. డీఎన్‌ఏ పరీక్ష ప్రక్రియలో మొదట తల్లితండ్రుల నుంచి, వారికి పుట్టిన బిడ్డ నుంచి రక్త్తనమూనాలను సేకరిస్తారు. వాటి నుంచి డీఎన్‌ఏ సంగ్రహిస్తారు. ఈ డీఎన్‌ఏలను పోల్చి చూసి... ఆ బిడ్డ ఆ తల్లితండ్రులకే పుట్టాడా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అంశాలపై వివాదాలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి డీఎన్‌ఏ పరీక్షలను చేస్తున్నారు. సాధారణంగా ఐవీఎఫ్ చికిత్స పద్ధతిలో భార్య నుంచి అండాన్ని, భర్త నుంచి వీర్యకణాలను సంగ్రహించి వాటిని ఫలదీకరణం చెందిస్తారు. అలా ఫలదీకరణం చెందిన పిండాన్ని భార్య గర్భంలో ప్రవేశపెడతారు. కొన్నిసార్లు అండం ఆరోగ్యకరంగా లేకపోయినా, వీర్యకణాలకు తగినంత సామర్థ్యం లేకపోయినా... వాటిని ఇతర దాతల నుంచి సేకరిస్తారు. గర్భం దాల్చటానికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు... ఇంకొక ఆరోగ్యకరమైన మహిళ గర్భంలో పిండాన్ని చొప్పిస్తారు. దీనినే ‘సరోగసి’ అంటారు. సాధారణంగా ఈ అంశాలన్నింటినీ చాలా రహస్యంగా ఉంచుతారు. కొన్నిసార్లు ఐవీఎఫ్ క్లినిక్స్‌లో సరైన ప్రొటోకాల్స్ పాటించకపోతే- అండాలు లేదా వీర్యకణాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా అసలు తల్లితండ్రులెవ్వరనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల్లో ఫలితాలు 99.9 శాతం కచ్చితత్వంతో ఉంటాయి. ఒకప్పుడు కేవలం ప్రభుత్వ పరిశోధనాశాలల్లోనే డీఎన్‌ఏ పరీక్షలు చేసేవారు. ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్‌లో కూడా ఈ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.
ఎగ్ ఫ్రీజింగ్
ప్రతి మహిళ శరీరంలోను అండాలు ఉంటాయి. ఈ అండాలలోకి వీర్యకణాలు ప్రవేశించినప్పుడే పిండం ఏర్పడుతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ భవిష్యత్ అవసరాల కోసం అండాలను భద్రపరుచుకోవటాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ ప్రక్రియలో మహిళల అండాలను సబ్ జీరో టెంపరేచర్‌లో భద్రపరుస్తారు. వీటిని అవసరమైనప్పుడు బయటకు తీసి వాటిని పునరుత్పత్తికి ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో మహిళలు పునరుత్పత్తి ఎక్కువగా జరిగే వయస్సులో (20-35 ఏళ్ల మధ్య) తమ వృత్తుల్లో బిజీగా ఉంటున్నారు. ఆ సమయం దాటితే ఆరోగ్యకరమైన అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత గర్భం ధరించటం కష్టమవుతుంది.
ఈ వయస్సులో పిల్లలు కనటానికి ఇష్టం లేని వారు- ఆరోగ్యకరమైన తమ అండాలను భవిష్యత్తు కోసం దాచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో 30 ఏళ్లు దాటిన మహిళలు తమ అండాలను దాచుకోవటం బాగా పెరిగింది. దీని కోసం ప్రత్యేక సంస్థలు వెలిసాయి. ఈ సంస్థలు ఎగ్ ఫ్రీజింగ్‌కు 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. దీనితో పాటు ప్రతి ఏడాది 30 నుంచి 40 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అండాలు సుమారు 30 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉంటాయి.
ఎంబ్రియో ఫ్రీజింగ్
పిండం ఏర్పడిన తర్వాత దానిని భద్రపరుచుకోవటాన్ని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు.
ఈ పిండాన్ని జంటకు నచ్చిన సమయంలో గర్భంలో ప్రవేశపెట్టవచ్చు. ఇది కూడా 30 ఏళ్ల వరకు ఆరోగ్యంగానే ఉంటుంది. చాలా మంది పిండం ఏర్పడిన తర్వాత దానిని భద్రపరిస్తే
భవిష్యత్తులో అది పనికిరాదని భావిస్తూ ఉంటారు. కానీ ఇది నిజం కాదని పునరుత్పత్తి నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యనే 30 ఏళ్ల పాటు భద్రపరిచిన పిండం ద్వారా ఒక మహిళ గర్భం దాల్చింది. ఎంబ్రియో ఫ్రిజింగ్‌కు 2.5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ప్రతి ఏడాది సుమారు 60 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..
‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్
For More AndhraPradesh News And Telugu News