Share News

Delicious Recipes with Taro: కందతో కమ్మగా రుచులు

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:37 AM

కందతో రకరకాల కూరలు, పచ్చడి చేస్తూ ఉంటాం. అన్నీ వేటికవే విభిన్నంగా రుచికరంగా ఉంటాయి. ఇవికాక అందరూ ఇష్టపడే సరికొత్త కంద రుచులు మీకోసం...

Delicious Recipes with Taro: కందతో కమ్మగా రుచులు

GGYJ.jpg

కంద వేపుడు

కావాల్సిన పదార్థాలు

  • కంద గడ్డ- పావు కేజీ, జీలకర్ర- ముప్పావు చెంచా, పచ్చి శనగపప్పు- ముప్పావు చెంచా, మినప్పప్పు- పావు చెంచా, ధనియాలు- అర చెంచా, ఆవాలు- పావు చెంచా, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఎండుమిర్చి- అయిదు, పసుపు- పావు చెంచా, ఉప్పు- ముప్పావు చెంచా, కారం- అర చెంచా, ఎండు కొబ్బరి తురుం- రెండు చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగు, కొత్తిమీర- కొద్దిగా, నూనె- నాలుగు చెంచాలు, కరివేపాకు- నాలుగు రెమ్మలు

తయారీ విధానం

  • స్టవ్‌ మీద పాన్‌ పెట్టి రెండు చుక్కల నూనె వేసి వేడిచేయాలి. అందులో నాలుగు ఎండుమిర్చి, అరచెంచా జీలకర్ర, అరచెంచా ధనియాలు, అరచెంచా పచ్చి శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి దోరగా వేపాలి. ఇందులోనే కారం కూడా వేసి బాగా కలిపి పళ్లెంలోకి తీయాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. కందను తీసుకుని తొక్క తీసి నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరవాత గ్రేటర్‌ సహాయంతో తురిమి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా తురుముకోవాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నాలుగు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. అందులో పావుచెంచా జీలకర్ర, ఆవాలు, పావుచెంచా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, పసుపు వేయాలి. ఇవి వేగాక కంద తురుం, ఉల్లిపాయ తురుం, పచ్చిమిర్చి ముక్కలు, ఎండు కొబ్బరి తురుం వేసి జాగ్రత్తగా కలపాలి. ఎనిమిది నిమిషాలపాటు పెద్ద మంట మీద దోరగా వేపాలి. తరవాత ముందుగా గ్రైండ్‌ చేసిపెట్టుకున్న కారం పొడి మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు చిన్నమంట మీద వేగనిచ్చి కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఇలా తయారుచేసుకున్న కంద వేపుడు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది.

చిట్కా

  • కంద తురుమును పసుపు నీళ్లలో వేసి రెండు నిమిషాల తరవాత నీళ్లను వడగట్టాలి. తరవాత తురుమును చేత్తో గట్టిగా పిండి పలుచని గుడ్డ మీద పరచి కొద్దిసేపు ఆరనిస్తే దానిలోని జిగురు పోతుంది. వేపుడు కూడా అంటుకోకుండా విడివిడిగా తయారవుతుంది.


GNH.jpg

కంద కబాబ్‌

కావాల్సిన పదార్థాలు

  • కంద- పావు కేజీ, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, అల్లం- మూడు చిన్న ముక్కలు, పచ్చి మిర్చి- అయిదు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి- అర చెంచా, ధనియాల పొడి- అర చెంచా, కారం- పావు చెంచా, ఓట్స్‌ పొడి- రెండు చెంచాలు

తయారీ విధానం

  • మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

  • కందకు తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పసుపు నీళ్లతో కడగాలి. ఈ ముక్కలను కుక్కర్‌లో వేసి కొన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరవాత కంద ముక్కలను వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని గరిటె సహాయంతో మెత్తగా మెదపాలి. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చి పేస్టు, కారం, ఓట్స్‌ పొడి వేసి బాగా కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి. తరవాత ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేత్తో తీసుకుని గుండ్రని టిక్కీల మాదిరి చేయాలి.

  • స్టవ్‌ మీద పాన్‌ పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. తరవాత టిక్కీలను పరచాలి. చిన్న మంట మీద రెండు వైపులా ఎర్రగా వేపాలి. ఇలా తయారుచేసుకున్న కంద కబాబ్‌లను గ్రీన్‌ చట్నీ లేదా చిల్లీసాస్‌ లేదా టమాటా కెచ్‌పతో సర్వ్‌ చేసుకోవాలి.

చిట్కాలు

  • ఓట్స్‌ పొడికి బదులు బ్రెడ్‌ పౌడర్‌ లేదా శనగపిండి వాడుకోవచ్చు.

  • టిక్కీలు చేసేటప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకుంటే మిశ్రమం అంటుకోకుండా ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 12:15 PM