Celebrity Promotions: తారలు... ప్రకటనలతో చిక్కులు
ABN , Publish Date - Mar 02 , 2025 | 05:16 AM
సబ్బుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా క్రిప్టో కరెన్సీ దగ్గర నుంచి ఆన్ లైన్ గేమింగ్ దాకా అనేక కంపెనీల ప్రకటనలలో మనకు సినీ నటీ నటులు కనిపిస్తూ ఉంటారు.
మన దేశంలో సినీ నటీ నటులకు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ ఉండదు. అందుకే వారి ద్వారా వినియోగదారులను ఆకర్షించటానికి అనేక కంపెనీలు పోటీ పడుతూ ఉంటాయి. సబ్బుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా క్రిప్టో కరెన్సీ దగ్గర నుంచి ఆన్ లైన్ గేమింగ్ దాకా అనేక కంపెనీల ప్రకటనలలో మనకు సినీ నటీ నటులు కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ ప్రకటనలు బాగా విస్తరించిన తర్వాత గేమింగ్ యాప్‌లకు.. క్రిప్టో కరెన్సీ స్కీమ్‌ల ప్రకటనలలో కూడా హీరో హీరోయిన్లు కనిపించటం మొదలుపెట్టారు. ఎప్పుడైనా ఈ స్కీమ్‌లు స్కామ్‌లుగా మారితే వారు ఇబ్బందుల్లో పడుతున్నారు.
తాజాగా తమిళనాడు, పుదుచ్చేరిలలో బయట పడిన క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో హీరోయిన్లు కాజల్, తమన్నాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు ఇవ్వటంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడా నికి భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. రేడియోలు, టీవీలు, ఆన్‌లైన్‌లో రకరకాల ప్రకటనలు ప్రసారం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు, పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, క్రీడాకరులు, ఇతర సెలెబ్రిటీలతో వాణిజ్య ప్రకటనలు రూపొందించి ప్రచారం చేస్తుంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే! ఉదాహరణకు తెలుగులో టాప్ హీరోలకు ఒక ప్రకటనలో నటిస్తే- రెండు నుంచి మూడు కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఏడాది మొత్తం ఆ కంపెనీ వీరి ఫోటోలను, వీడియోలను తమ ప్రకటనలలో వాడుకుంటుంది. దీని వల్ల కంపెనీకి పట్ల వినియోగదారులు ఆకర్షితులవు తారు. అదే సమయంలో హీరో, హీరోయిన్లు టెలివిజన్‌లోను, ఆన్‌లైన్‌లోను ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటారు. దీని వల్ల వారి సినిమాలు విడుదల కావటానికి సమయం పట్టినా ప్రేక్షకులు వారిని మర్చిపోరు. అయితే ఎలాంటి ప్రకటనలలో నటీ నటులు నటించాలి? వారికి సామాజిక బాధ్యత ఉండదా? సమాజానికి కీడు చేసే ప్రకటనలలో ఎందుకు నటించాలి? అనే ప్రశ్నలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా కోటా (రాజస్థాన్) జిల్లా వినియోగదారుల కోర్టు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లు ‘విమల్’ పాన్ మసాల’ ప్రకటనలలో నటించినందుకు వారికి సమన్లు జారీ చేసింది.
చిక్కులు తప్పవు...
మన దేశంలో మద్యం, సిగరెట్టు ప్రకటనలపై నిషేధం ఉంది. కానీ రియల్ ఎస్టేట్, బెట్టింగ్ యాప్‌లు, క్రిప్టో కరెన్సీ ప్రకటనలపై నిషేధం లేదు. ఇంటర్నెట్ ప్రతి ఇంటికి వ్యాపించిన తర్వాత.. ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ ఫోన్ సామాన్యమయిపోయిన తర్వాత ఈ తరహా ప్రకటనలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్మార్ట్‌ఫోన్లలో వీటిని చూసే వారి సంఖ్య పెరిగింది. దీనితో ఈ కంపెనీలు సెలబ్రెటీలకు ఎక్కువ సొమ్ము చెల్లించి ప్రకటనలలో నటించిమని కోరుతున్నారు. కొందరు నటీనటులు తెలిసో.. తెలియకో.. ఈ ప్రకటనల వలలో చిక్కుకుంటున్నారు.
గత ఏడాది దేశాన్ని కుదిపేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్‌లో అనేక మంది సెలబ్రెటీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించింది. రణబీర్‌కపూర్, శ్రద్ధకపూర్, తమన్నా మొదలైన వారు కూడా ఈ సెలబ్రిటీలలో ఉన్నారు. అయితే ఈ విషయంలో చట్టాలు కూడా సమగ్రంగా లేవు. ‘‘ఒక ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక హీరో ఉన్నాడనుకుందాం. ఆ ఉత్పత్తి వల్ల వినియోగదారులకు ఏదైనా నష్టం జరిగితే చట్టపరంగా ఆ హీరోకి ఎటువంటి సంబధం ఉండదు. ఈ విషయం అన్ని అగ్రిమెంట్‌లలో స్పష్టంగా పేర్కొంటారు. కానీ కంపెనీ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిపినప్పుడు.. హీరోకి ఇచ్చిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తారు. ఇక ఒక ప్రకటనలో నటించాలా వద్దా అనే అంశం ఆ హీరోకి ఉన్న నైతికతపై ఆధారపడి ఉంటుంది’’ అంటారు ఈ తరహా వ్యవహారాలను చూసే న్యాయవాది కావ్య. ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు తమ ఇమేజ్‌ను దెబ్బతీసే ఈ తరహా చర్యలకు పాల్పడటం లేదు. ‘‘ఎందుకంటే- ఒక ప్రకటన వచ్చిన వెంటనే లక్షల మందికి చేరిపోతుంది. వెంటనే ఇంటర్నెట్‌లో దానిపై చర్చ మొదలవుతుంది. ఎవరైనా నైతికంగా తప్పు పనిచేస్తే ఈ ఽమధ్యకాలంలో నెటిజెన్స్ ఊరుకోవటం లేదు. వీరి ఒత్తిడి విపరీతంగా ఉంటోంది. దీనితో ఎక్కువ మంది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని కాని ప్రకటనలలో నటించటం లేదు’’ అంటారు ఒక ప్రొడక్షన్ హౌస్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సంతోష్. బాలీవుడ్ హీరోలు అనిల్ కపూర్, కార్తీక్ ఆర్యన్, జాన్ అబ్రహం.. శాండిల్‌వుడ్‌కు చెందిన యష్.. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ వంటి వారు... పొగాకు ఉత్పత్తుల ప్రకటనలలో నటించబోమని ఖరాఖండిగా చెప్పేశారు.
అభిమానులను దృష్టిలో...
మన దేశంలో హీరో, హీరోయిన్లను కోట్ల మంది ఆరాధిస్తూ ఉంటారు. వారిని అభిమానిస్తూ ఉంటారు. నిరంతరం వారిని ఫాలో అవుతూ ఉంటారు. వారు చెప్పిన ప్రతి మాట నిజమని నమ్ముతూ ఉంటారు. అందువల్ల హీరోహీరోయిన్లు తాము చేసే ప్రతి పనిని అభిమానులు గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి అభిమతానికి.. వారికి హాని చేసే కార్యకలాపాలలో పాల్గొకూడదని నిర్ణయించుకోవాలి. అప్పుడే వారికి ఉన్న విశ్వసనీయత పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.