Tea Leaves: వాడేసిన టీ పొడితో...
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:38 AM
చాలామంది టీ తయారుచేసి వడబోసిన తరవాత పొడిని సింక్‌లో లేదా చెత్తబుట్టలో పడేస్తుంటారు. అలాకాకుండా వాడేసిన టీ పొడిని పలురకాలుగా ఉపయోగించుకోవచ్చు.

టీ ఫిల్టర్‌లో మిగిలిన పొడిని ఒక గిన్నెలో వేయాలి. ఇందులో ఒక గ్లాసు మంచినీరు పోసి బాగా కలిపి వడబోస్తే పొడిలోని పంచదార తొలగిపోతుంది. ఈ పొడిని పూలు, కూరగాయల మొక్కల మొదళ్లలో వేస్తే మంచి ఎరువులా పనిచేస్తుంది. మొక్కలకు పోషకాలు అంది, అవి బాగా పెరుగుతాయి.
వంటగదిలో గ్యాస్ స్టవ్ మీద బర్నర్లు, వాటి చుట్టూ ఉండే స్టాండ్‌లు తరచూ జిడ్డుగా, మురికిగా మారుతూ ఉంటాయి. వాడేసిన టీ పొడిలో కొంత నీరు, రెండు చెంచాల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. ఆ ద్రవంలో స్క్కబ్బర్‌ను ముంచి బర్నర్లను, స్టాండ్లను తోమితే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. దీనితో స్టీల్ గ్యాస్ స్టవ్‌ను కూడా తోమి శుభ్రం చేసుకోవచ్చు.
కిటికీ అద్దాల మీద తరచూ దుమ్ము, ధూళి పడుతూ ఉంటుంది. వాడేసిన టీ పొడిని గిన్నెలో వేసి ఒక గ్లాసు నీరు పోసి కొద్దిగా వేడి చేయాలి. ఈ నీటిని వడబోసి ఒక స్ర్పే బాటిల్‌లో పోయాలి. తరవాత అద్దాలపై కొద్దిగా స్ర్పే చేస్తూ పలుచని వస్త్రం లేదా కాగితంతో తుడిచేయాలి. అప్పుడు అద్దాలు చక్కగా మెరుస్తాయి. ఇలాగే ఇంటి తలుపులను కూడా శుభ్రం చేయవచ్చు.
వాడేసిన టీ పొడిని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు కలిపి వడబోయాలి. ఈ పొడిలో ఒక గ్లాసు మంచినీరు పోసి వేడిచేసి, చల్లార్చి, మళ్లీ వడబోయాలి. తలస్నానం చేసిన తరవాత మాడుమీద, శిరోజాల కుదుళ్లకు ఈ నీటిని పట్టించాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే శిరోజాలు మృదువుగా మారి సహజంగా మెరుస్తాయి.
బడి పిల్లలు, ఉద్యోగస్తులు ఎక్కువసేపు షూస్ ధరించి ఉండడం వల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. వాడేసిన టీ పొడిని ఒక వెడల్పాటి టబ్‌లో వేసి ముప్పావు వంతు వరకు గోరువెచ్చని నీరు పోయాలి. ఇందులో ఒక చెంచా ఉప్పు వేసి కలపాలి. ఈ నీటిలో రెండు పాదాలు ఉంచి కనీసం పావుగంట నాననివ్వాలి. తరవాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే పాదాల దుర్వాసన తొలగిపోతుంది.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.