Share News

Buddhaghosa: బుద్ధఘోషుడి జ్ఞానదీక్ష

ABN , Publish Date - May 23 , 2025 | 04:22 AM

బుద్ధఘోషుడు జ్ఞానపిపాసతో ఎన్నో గురువులను కలిసాడు, చివరకు ఆచార్య రేవతుడి వద్ద శిష్యరికం చేపట్టి 'విశుద్ధ మగ్గ' గ్రంథాన్ని రచించాడు. ఆయన ఆత్మవిశ్వాసం, వినమ్రత, అహంకార త్యాగం ద్వారా బౌద్ధ ధర్మంలో అపూర్వ స్థానాన్ని సంపాదించాడు.

Buddhaghosa: బుద్ధఘోషుడి జ్ఞానదీక్ష

బౌద్ధ ధర్మంలోని మహాయాన మార్గంలో ఆచార్య నాగార్జునుడిది ఎంత గొప్ప స్థానమో... థేరవాదంలో బుద్ధఘోషుడిది అంతటి ఉన్నతమైన స్థానం. దీనికి కారణం అతనిలో నేర్చుకోవాలనే జిజ్ఞాస. జ్ఞాన సాధనకు పట్టుదల, కృషి ఎంతో అవసరమని అతని కథ చెబుతుంది. బుద్ధఘోషుడు క్రీస్తుశకం నాలుగు, అయిదు శతాబ్దాలకు చెందినవాడు. అతను తెలుగువాడనే అభిప్రాయం కూడా ఉంది. బాల్యం నుంచే జ్ఞానతృష్ణ కలిగిన బుద్ధఘోషుడు... ఎక్కడ పండితులు ఉన్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళేవాడు. వారితో చర్చలు జరిపేవాడు. చివరకు ఒక బౌద్ధ విహారానికి చేరుకున్నాడు.

అతనికి ఆ విహారాధిపతి ఆచార్య రేవతుడు ఆశ్రయం ఇచ్చాడు. అప్పటికే చీకటిపడింది. నిద్రపోవడానికి ముందు బుద్ధఘోషుడు సముద్ర ఘోషలాంటి గంభీర స్వరంతో పతంజలి యోగ సూత్రాలను వల్లె వేశాడు. వాటిని జాగ్రత్తగా విన్న రేవతుడు ‘‘ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకో. రేపటి ఉదయం నా వద్దకు రా’’ అన్నాడు.

మరుసటిరోజు ఉదయం రేవతుణ్ణి బుద్ధఘోషుడు కలుసుకున్నాడు. అప్పుడు రేవతుడు ‘‘రాత్రి గాడిదలా ఓండ్ర పెట్టింది నువ్వేనా?’’ అని ప్రశ్నించాడు.

అప్పుడు బుద్ధ ఘోషుడు ‘‘నాది గాడిద ఓండ్ర అంటున్నారే? నేను చదివినది మీకు కాస్తయినా అర్థమయిందా?’’ అని అడిగాడు.


రాత్రి తనకు విశ్రాంతి కోసం విహారంలో చోటు ఇచ్చిన వ్యక్తితో ఏమాత్రం తటపటాయించకుండా మాట్లాడిన బుద్ధఘోషుడి ఆత్మవిశ్వాసం, కపటంలేనితనం రేవతుడికి నచ్చాయి. ఆయన చిరునవ్వు నవ్వుతూ బుద్ధఘోషుడి భుజం తట్టి ‘‘అలా కూర్చో’’ అని తన ఎదుట ఉన్న ఆసనాన్ని చూపించాడు. పతంజలి యోగ సూత్రాలను చాలా స్పష్టంగా వల్లిస్తూ... వాటిపై అద్భుతమైన వ్యాఖ్య చేశాడు. ఆశ్చర్యంతో నోట మాటరాక... కొయ్యబొమ్మలా కూర్చొని వినడం బుద్ధఘోషుడి వంతయింది. తనకు ‘తెలిసింది గోరంత, తెలుసుకోవలసింది కొండంత’ అని అర్థమయింది. అతని అహంకారం అణగిపోయింది. రేవతుడి ముందు మోకరిల్లాడు. తనను శిష్యుడిగా స్వీకరించి జ్ఞానబోధ చేయాలని రెండు చేతులూ జోడించి ప్రార్థించాడు.

అప్పుడు రేవతుడు ‘అభిదమ్మ పిటకం’ నుంచి కొంత భాగాన్ని చదివి వినిపించి ‘‘దీన్ని ‘సమ్మా సంబుద్ధవాదం’ అంటారు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ప్రవజ్య దీక్ష తీసుకోవాలి’’ అన్నాడు. బుద్ధఘోషుడు తక్షణమే తన అంగీకారం తెలిపాడు. అతని కంఠస్వరంలోని గాంభీర్యాన్ని చూసి... రేవతుడు ఇచ్చిన దీక్షానామమే బుద్ధఘోష. దానితో అతని అసలు పేరు మరుగున పడిపోయి... ఆ పేరే జగత్ప్రసిద్ధం అయింది. రేవతుడి శిష్యరికంలో జ్ఞానదీక్ష చేపట్టిన బుద్ధఘోషుడు త్రిపిటకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. రేవతుడి ఆదేశానుసారం సింహళద్వీపానికి వెళ్ళి, అక్కడ ఆచార్యులను కలిసి, చర్చలు జరిపాడు. ‘విశుద్ధ మగ్గ’ అనే గ్రంథాన్ని రచించాడు. దాన్ని బౌద్ధ పండితులు ‘థేరవాద సర్వస్వం’గా పరిగణిస్తారు.

రాచమడుగు శ్రీనివాసులు


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:22 AM