ఉపాధికి వారధిగా
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:28 AM
‘‘తమ అవసరాలకు తగిన నైపుణ్యం ఉన్నవారు దొరకడం లేదనేది పరిశ్రమల నుంచి నిరంతరం ఎదురవుతున్న ఫిర్యాదు. డిమాండ్ ఉన్నా నిపుణులు దొరకని పనులు అనేకం ఉన్నాయి. టెకీలు, ఇంజనీర్లు, అకౌంటెంట్ల లాంటి వృత్తి నిపుణులనే కాదు..

‘‘తమ అవసరాలకు తగిన నైపుణ్యం ఉన్నవారు దొరకడం లేదనేది పరిశ్రమల నుంచి నిరంతరం ఎదురవుతున్న ఫిర్యాదు. డిమాండ్ ఉన్నా నిపుణులు దొరకని పనులు అనేకం ఉన్నాయి. టెకీలు, ఇంజనీర్లు, అకౌంటెంట్ల లాంటి వృత్తి నిపుణులనే కాదు... ఇంకా ఎన్నో బాధ్యతలను చక్కగా నెరవేర్చేవారి కోసం సంస్థలు వెతుకుతూ ఉంటాయి. అలాంటి వాటికి అవసరమైన నైపుణ్యాన్ని... అట్టడుగువర్గాల వారికి అందించాలన్న ఆలోచన పదిహేడేళ్ళ క్రితం కలిగింది. దీనికి నేపథ్యం ఏమిటంటే... నాకు పదేళ్ళ వయసున్నప్పుడే మా నాన్న చనిపోయారు. అయిదేళ్ళ తరువాత మా అమ్మ, సోదరుడు కూడా మరణించారు. నేను, నా సంరక్షణలో నా తమ్ముడు మిగిలేం. పదిహేనేళ్ళ వయసులో... నా జీవితానికి అర్థం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. కానీ కొద్ది రోజులలోనే దాని నుంచి బయటపడ్డాను. నాకన్నా దుర్భరమైన స్థితిలో బతుకున్నవారెందరో నా చుట్టూ కనిపించారు. ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకోసం, పిల్లలకోసం ఏదైనా చేయాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకొని, కష్టపడి చదివాను. ఐఎంఎం-కోల్‌కతాలో సీటు సంపాదించాను. చదువు పూర్తయ్యాక... ఇంజనీరింగ్ లెక్చరర్‌గా చేరాను. ఆ వృత్తిలో నేను పరిశీలించిన ఎన్నో అంశాలు... నేను కొత్త దారిని ఎంచుకొనేలా చేశాయి. విద్యార్థులు డిగ్రీలు సంపాదిస్తున్నా... వారు చేయాల్సిన, చేయాలనుకొనే ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఇది ఏదో ఒక విద్యా సంస్థకే పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. తరువాతి తరానికి మంచి ఉద్యోగావకాశాలు రావాలన్నా, తమతమ వృత్తుల్లో వారు రాణించాలన్నా... దానికి నైపుణ్యాలు తప్పనిసరి. వాటిని పెంపొందించడమే మనముందున్న అత్యవసర సమస్య అని అర్థమయింది. 2008లో ఉద్యోగం వదిలేసి... మా ఇంటి బేస్‌మెంట్‌లో... నలభై మంది విద్యార్థులతో ప్రాథమిక నైపుణ్య శిక్షణ సంస్థను ప్రారంభించాను.
ఆ డిమాండ్ తీర్చాలని...
ఎవరికి శిక్షణ ఇవ్వాలో, వేటిలో ఇవ్వాలో ఒక ప్రణాళిక నేను ముందే తయారు చేసుకున్నాను. వెనుకబడిన, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు, వీధులు ఊడ్చేవారు, చిన్న చిన్న నేరాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చాక ఉపాధి లేనివారు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు ప్లంబింగ్, ఎలక్ర్టీషియన్, బ్యూటీషియన్, సెక్యూరిటీ సర్వీసెస్ తదితర వృత్తుల్లో ప్రాథమిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను. వీటిలో చాలా సేవలు దాదాపు అన్ని సంస్థలకూ అవసరమే. కానీ ఇలాంటి శిక్షణ కల్పించడానికి ఏ సంస్థా చొరవ తీసుకోదు. కానీ ఈ సేవలకు భారీ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ తీర్చడం, తద్వారా పేదలకు ఆసరాగా నిలవడం నా ఆశయం. అలా ఇప్పటివరకూ లక్ష మందికి పైగా నా సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చాను. వారికి నైపుణ్య శిక్షణ కౌన్సిలింగ్, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సాయం చెయ్యడం... ఇలా వివిధ అంశాల్లో మా సంస్థ సాయపడుతోంది. కొన్ని వందలమంది మా సంస్థ తరఫున పని చేస్తున్నారు. ఇప్పుడు ‘కెపాసిటా కనెక్ట్’ పేరిట మా కార్యకలాపాలన్నిటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతో పాటు... ఇతర అంశాల్లోకి కూడా విస్తరించాం. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్-కార్పొరేట్ సంస్థలకు కూడా సేవలు అందించడం ప్రారంభించాం. రాజస్థాన్ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ సాంకేతికతల్లో శిక్షణ ఇవ్వడం కోసం... కిందటి ఏడాది‘ రైజింగ్ రాజస్థాన్ ఇన్వె్‌స్టమెంట్ సమ్మిట్’లో రూ. 45 కోట్ల ఒప్పందాన్ని ‘కెపాసిటా కనెక్ట్’ చేసుకుంది. ఇది మా సంస్థ పురోగతిలో ఒక మైలురాయి.
నైపుణ్యం పెంచడమే మార్గం...
ప్రస్తుతం పేద వర్గాలవారికి శిక్షణతో పాటు ఉద్యోగులకు, విద్యార్థులకు, కార్పొరేట్ సంస్థలకు విద్యా సంస్థలకు సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాం. కృత్రిమ మేధ, డేటా అనాసిలిస్, సైబర్ సెక్యూరిటీ లాంటి సరికొత్త సాంకేతికతలను కూడా బోధిస్తూ... యువతలో నైపుణ్యాలు పెంచుతున్నాం. మా సంస్థకు ‘సిఐఐ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్ట్’ లాంటి పలు పురస్కారాలు లభించాయి. ప్రతిష్టాత్మకమైన ‘ఫోర్బ్స్ ఇండియా-గ్లోబల్ ఇండియన్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ ఎడిషన్’లో... టాటా, మహీంద్రా, బజాజ్, హెచ్‌సిఎల్, బిర్లా లాంటి సంస్థల సరసన చోటు దక్కింది. వ్యక్తిగతంగా ‘రాజస్థాన్ ఇండస్ట్రీ ఐకాన్’ అవార్డు అందుకున్నాను. 2019లో ‘ఫోర్బ్స్ ఇండియా- లీడింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ జాబితా’లో స్థానం లభించింది. ఇప్పుడు నా దృష్టంతా భారతీయ యువతను డిజిటల్ ఎకానమీ దిశగా సంసిద్ధం చేయడం మీద ఉంది. ఏ దేశ భవిష్యత్తునైనా నిర్దేశించేవి తరగతి గదులేనని నేను నమ్ముతాను. ఎక్కువ మార్కులు సంపాదించడం ఎలాగో మనం పిల్లలకు నేర్పుతున్నాం కానీ ఒక వైఫల్యాన్ని, విషాదాన్ని ఎదుర్కోవడం ఎలాగనేది చెప్పడం లేదు. ఈ ధోరణిలో మార్పు రావాలనేది నా కోరిక. అలాగే ఆర్థిక, సామాజిక స్థితులతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు లభించాలి. వారిలో నైపుణ్యం పెంచడమే అందుకు మార్గం. దానికోసమే ఇన్నేళ్ళుగా కృషి చేస్తున్నాను. భవిష్యత్తులో ఆ కృషిని మరింత దీక్షగా కొనసాగిస్తాను.’’
నైపుణ్యం ఉన్నవారికోసం వెతుకులాటలో పరిశ్రమలు... వాటికి తగిన నైపుణ్యాన్ని అందుకోలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న యువత.. ఈ అంతరాన్ని తగ్గించడానికి పదిహేడేళ్ళుగా కృషి చేస్తున్నారు శిప్రా శర్మ భుటాని. లక్షమందికి పైగా అట్టడుగువర్గాలవారికి శిక్షణ ఇచ్చి,
ఉపాధికి దోహదం చేసిన ఈ జైపూర్ మహిళ... విద్యార్థులకు, పరిశ్రమలకు మధ్యవారధిగా నిలుస్తున్నారు.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..