Breastfeeding Awareness Week: తల్లి పాలామృతం
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:36 AM
తల్లి పాలు బిడ్డ ఆకలి తీర్చడమే కాదు, అంతకు మించిన ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. బిడ్డ ఆరోగ్యానికి రక్షణ కల్పించడంతో పాటు, పోషక అవసరతలకు తగినట్టు మార్పులకు గురవుతూ ఉంటాయి. బిడ్డకు తల్లి నుంచి అందే అమూల్యమైన ఆ పాలామృతం గురించీ...
ఆగష్టు 1 - 7, తల్లి పాల వారోత్సవం
తల్లి పాలు బిడ్డ ఆకలి తీర్చడమే కాదు, అంతకు మించిన ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. బిడ్డ ఆరోగ్యానికి రక్షణ కల్పించడంతో పాటు, పోషక అవసరతలకు తగినట్టు మార్పులకు గురవుతూ ఉంటాయి. బిడ్డకు తల్లి నుంచి అందే అమూల్యమైన ఆ పాలామృతం గురించీ, వాటిని నిల్వ చేసుకునే మెలకువల గురించీ వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం!
కొందరు పిల్లలు నెలలు నిండకుండా పుడతారు. ఇంకొందరు పిల్లలు నలతను వెంట తెచ్చుకుంటారు. ఈ రెండు కోవలకు చెందిన పిల్లల పోషక అవసరతలు భిన్నంగా ఉంటాయి. ఈ అవసరతలకు తగినట్టే తల్లుల్లో పాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఏ ఇద్దరు తల్లుల పాలూ ఒకేలా ఉండవు. అలాగే ఒకే తల్లి పాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. బిడ్డకు ఎప్పుడు ఎలాంటి పోషకాలు అవసరమో వాటిని సమయానికి అందించేలా చనుబాలు తయారవుతూ ఉంటాయి. వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. అలాగే పిల్లలకు పాలిచ్చే ప్రతిసారీ, వారికి పాల పట్ల ఇష్టం పెరగడం కోసం, మొదట నీరు, చక్కెర ఎక్కువగా కలిగి ఉండే తీయని పాలు, ఆ తర్వాత కొవ్వుతో కూడిన బలవర్థకమైన పాలు రొమ్ములు నుంచి వెలువడతాయి. ఇలా తల్లిపాలు అద్భుతమైన స్వభావాలు, ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కాబట్టి అమూల్యమైన తల్లిపాలను బిడ్డకు పరిపూర్ణంగా అందించడం తల్లులు బాధ్యతగా భావించాలి. మరీ ముఖ్యంగా పాలు పట్టించే విధానం, నిల్వ చేసుకునే తీరుల పట్ల అవగాహన పెంచుకోవాలి.
ఇలా సేకరించాలి
పాలు సేకరించడానికి మ్యాన్యువల్, మెషీన్ పంప్‌లు, ఎలక్ర్టిక్ పంపులు లాంటివి అందుబాటులో ఉన్నప్పటికీ, చేతులతోనే పాలను సేకరించడం అత్తుత్తమం. అలాగే పాలు సేకరించే పాత్రను సబ్బు నీళ్లతో కడిగి, కొన్ని నిమిషాల పాటు మరిగించిన నీళ్లు నింపి ఉంచి, తర్వాత వాటిని పారేసి, తడి ఆరే వరకూ పాత్రను బోర్లా ఉండి, ఆ తర్వాతే వాడుకోవాలి. పాల సేకరణకు వెడల్పాతి గిన్నె ఉపయోగించాలి. బ్రెస్ట్ మిల్క్ స్టోరేజీ బ్యాగ్స్, లేదా పాలీప్రొపిలీన్ ప్లాస్టిక్, గాజు పాత్రలు పాల నిల్వకు సురక్షితమైనవి. స్వల్ప కాలిక నిల్వ కోసం స్టీలు పాత్రలు కూడా వాడుకోవచ్చు. గది ఉష్ణోగ్రత దగ్గర 6 నుంచి 8 గంటల పాటు పాలు నిల్వ ఉంటాయి. అంతకు మించి ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలనుకుంటే అందుకోసం ఫ్రిజ్ వాడుకోవాలి.
మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగి ఉండే రెఫ్రిజిరేటర్ డోర్‌లో 72 గంటల పాటు నిల్వ చేసుకోవచ్చు
ఫ్రీజర్ కంపార్ట్‌మెంట్‌లో నిల్వ చేసుకున్న పాలు, మరుసటి రోజుకు ఉపయోగించుకోవాలనుకుంటే రెఫ్రిజిరేటర్ డోర్‌లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత అవసరమైనప్పుడు బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత బిడ్డకు పట్టించాలి
వృథాను అరికట్టడం కోసం 60 నుంచి 120 మిల్లీలీటర్ల స్టోరేజీ బ్యాగులనే ఎంచుకోవాలి
తల్లి పాలను స్టవ్ మీద వేడి చేయకూడదు, మైక్రోవేవ్‌లో వేడి చేయకూడదు
ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన పాలు సహజసిద్ధంగానే ఆగాలి. లేదా గది ఉష్ణోగ్రతకు చేరుకునే వరకూ పాల సీసా, లేదా పాల బ్యాగ్‌ను ధారగా కారే నీళ్ల కింద ఉంచాలి.
అపోహలు - వాస్తవాలు
రొమ్ములు చిన్నవిగా ఉంటే పాలు రావు అన్నది పూర్తిగా అపోహే! రొమ్ముల పరిమాణం దాన్లోని కొవ్వు కణజాలం మీదే ఆధారపడి ఉంటుంది. పాలకూ కొవ్వుకూ సంబంధం ఉండదు. ప్రతి రొమ్ములో పాల ఉత్పత్తి కణాలు ఒకే మోతాదులో ఉంటా యి. కాబట్టి తల్లి ఎత్తుగా ఉన్నా, కురచగా ఉన్నా, రొమ్ములు చిన్నవిగా ఉన్నా, పెద్దవిగా ఉన్నా పాల ఉత్పత్తికి ఢోకా ఉండదు.
రొమ్ము పాలతో రొమ్ములు సాగిపోతాయన్నది కూడా అపోహే! గర్భం, బరువు పెరగడం, వయసు.. ఇవన్నీ రొమ్ముల ఆకారం, బిగుతుల మీద ప్రభావం చూపిస్తాయి. కేవలం బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల రొమ్ములు సాగిపోతాయని అనుకోవడం అపోహ. పాలిచ్చేటప్పుడు సరైన బ్రెస్ట్ సపోర్ట్ బ్రా వేసుకుంటే, రొమ్ములకు అదనపు ఆసరా దక్కుతుంది.
పాలు తాగించే ప్రతిసారీ చనుమొనలను కడుక్కోవలసిన అవసరం లేదు. స్నానం చేసే సమ యంలో శుభ్రపరుచుకుంటే సరిపోతుంది.
పాలతో తల్లి తీసుకునే మందుల ప్రభావం బిడ్డకు చేరదు. కాబట్టి వైద్యులు సూచించినప్పుడు మినహా దగ్గు, జలుబు, జ్వరం లాంటి సాధారణ మందులు వేసుకున్నప్పటికీ నిశ్చింతగా బిడ్డకు పాలివ్వవచ్చు.
డాక్టర్ సింధూర మునుకుంట్ల
పిడియాట్రీషియన్,
బిపిఎన్‌ఐ సర్టిఫైడ్ లాక్టేషన్ స్పెషలిస్ట్,
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News