Share News

Brain Health: మెదడు చురుకుగా పనిచేయాలంటే...

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:33 AM

జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం అనేవి మెదడు పనితీరుపై ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని చిట్కాలు పాటించి మెదడుని శక్తిమంతంగా మార్చవచ్చని సూచిస్తున్నారు.

Brain Health: మెదడు చురుకుగా పనిచేయాలంటే...

ఉదయం నిద్రలేవగానే మనసారా నవ్వాలి. దీనివల్ల శరీరంలో డోపమైన్‌ అనే హార్మోన్‌ విడుదల వుతుంది. ఇది న్యూరోట్రాన్స్‌మీటర్‌లా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

నాలుగు వాల్‌నట్‌ గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం అల్పాహార సమయంలో తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది. డార్క్‌ చాక్లెట్‌, బ్లూబెర్రీలు తీసుకోవడం మంచిదే. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు... ఏకాగ్రతని, గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి.

ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు రాయడం అలవాటు చేసుకోవాలి. నిన్నటి కల, రేపటి పనులు, ఈ రోజు జరిగిన ప్రధాన సంఘటన లాంటివి రాస్తూ ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. రాసినవి చాలాకాలం గుర్తుంటాయి కూడా.

ఉదయం లేవగానే మెమరీ గేమ్‌ ఆడితే మంచి ఫలితం ఉంటుంది. నిన్న చేసిన పనులు గుర్తుకు తెచ్చుకోవడం, ఒక మంచి మాట చదివి గుర్తుపెట్టుకోవడం లాంటి మానసిక వ్యాయామాలు చేస్తుంటే నాడులన్నీ బలోపేతమై మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

శరీరంలో నీటి శాతం తక్కువైతే మెదడు పనితీరు మందగిస్తుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటిలో కొంచెం నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే నీరసం తగ్గి మెదడు చురుకుగా పనిచేస్తుంది.


ఉదయం లేదా సాయంత్రం కనీసం పది నిమిషాలు నడక అలవాటు చేసుకోవాలి. పరిసరాలను చూస్తూ ముందుకు సాగాలి. రంగులు, శబ్దాలు, వాసనలను గమనిస్తూ నడుస్తుంటే మెదడుకి పరిశీలనా శక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతాయి. నడక వల్ల మెదడుకి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

అప్పుడప్పుడు ఎడమ చేతితో పుస్తకాలు సర్దడం, తల దువ్వుకోవడం లాంటివి చేస్తుంటే మెదడు శ్రమ పడడానికి సమాయత్తమవుతుంది. దీంతో ఏకాగ్రత, వేగంగా స్పందించడం లాంటివి అలవడతాయి.

ఉదయం లేవగానే నిటారుగా నిలబడి చేతులను నడుముపై ఉంచి రెండు నిమిషాలు శ్వాస తీసుకొని మెల్లగా వదలాలి. ఇలా నాలుగుసార్లు చేస్తే మెదడుకి ఆక్సిజన్‌ అంది స్పష్టమైన ఆలోచనలు చేసే సామర్థ్యం పెరుగుతుంది.

పుదీనా రుచిగల చూయింగ్‌ గమ్‌ని నములుతూ ఉంటే మెదడుకి రక్తప్రసరణ పెరుగుతుంది. రోజంతా మనసు, శరీరం తాజాగా ఉంటాయి.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - Feb 24 , 2025 | 04:33 AM