Share News

Bharadwaj Dayala: అద్భుతమైన మహిళల కోసం

ABN , Publish Date - May 04 , 2025 | 05:58 AM

విశాఖకు చెందిన భరద్వాజ్‌ దయాల ‘మిలియన్‌ అమేజింగ్‌ ఉమెన్‌’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మహిళల జీవితాలను ప్రతిబింబించే డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఏడాదిన్నరలో ఐదు ఖండాలు, 16 దేశాలు చుట్టి, మహిళల జీవన స్థితిగతులను పలు మార్గాల ద్వారా పంచుకుంటున్నారు.

Bharadwaj Dayala: అద్భుతమైన మహిళల కోసం

నూట తొంభై ఐదు దేశాలు... పది లక్షలమంది మహిళలు... వారి జీవన స్థితిగతులు... ‘మిలియన్‌ అమేజింగ్‌ ఉమెన్‌’ పేరుతో మహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు... విశాఖకు చెందిన భరద్వాజ్‌ దయాల. వివిధ దేశాల్లో విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల జీవితాలను ప్రతిబింబిస్తూ ఒక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఏడాదిన్నరలో బైక్‌పై ఐదు ఖండాలు, 16 దేశాలు చుట్టివచ్చిన ఆయన... ‘నవ్య’తో ఆ విశేషాలు పంచుకున్నారు.

‘‘సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం. భారీ జీతం. కానీ జీవితమంటే సంపాదన మాత్రమే కాదని కొన్నేళ్ల ఉద్యోగ జీవితం తరువాత అనిపించింది. దానికితోడు కొత్తగా ఏదైనా చేయాలన్న తపన నన్ను కుదురుగా కూర్చోనివ్వలేదు. దాంతో 2006లో బైక్‌పై ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టాను.

ఐదు ఖండాల్లోని 16 దేశాల మీదుగా 48 వేల కిలోమీటర్లు ప్రయాణించాను. ఏడాదిన్నరపాటు సాగింది ఈ యాత్ర. బైక్‌పై ప్రపంచ యాత్ర పూర్తి చేసిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాను. ఆ యాత్ర విశాఖలో ప్రారంభమై... ఇరాన్‌, టర్కీ, సిరియా, జోర్డాన్‌ మీదుగా ఆఫ్రికా, ఈజిప్ట్‌, యూర్‌పలోని గ్రీస్‌ వరకూ సాగింది. ఆ తరువాత ఫ్రాన్స్‌ మీదుగా యూకే అట్లాంటిక్‌ సముద్రం దాటి కెనడా, అమెరికా చేరుకున్నా. ఫసిఫిక్‌ మహా సముద్రం దాటి న్యూజిలాండ్‌, ఆస్ర్టేలియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌కు వచ్చాక మళ్లీ ఉద్యోగ జీవితంలో నిమగ్నమయ్యాను. ఈ క్రమంలోనే మా అమ్మ కుసుమ దయాల్‌ ఐదుగురి సంతానాన్ని పెంచి పోషించేందుకు చేసిన త్యాగం, పడిన కష్టాలు గుర్తుకువచ్చాయి. అమ్మ లాంటి ఎంతోమంది మాతృమూర్తుల గురించి ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ‘మిలియన్‌ అమేజింగ్‌ ఉమెన్‌’ డాక్యుమెంటేషన్‌కు శ్రీకారం చుట్టాను.


దేశదేశాల్లోని మహిళల జీవితాలతో...

195 దేశాల్లోని విభిన్న రాష్ట్రాలు, జాతులు, కులాలు, మతాలు, వర్గాలకు చెందిన పది లక్షలమంది మహిళల జీవితాలను ఆవిష్కరించడమే ‘మిలియన్‌ అమేజింగ్‌ ఉమెన్‌’ డాక్యుమెంటరీ ప్రధాన ఉద్దేశం. ఉన్నత స్థాయి నుంచి కూలి పనులు చేసుకునే మహిళల వరకు అందరి జీవితాలకు సంబంధించిన కీలక ఘట్టాలు అందులో ఉంటాయి. ఇప్పటివరకూ ఇలా ఇన్ని దేశాల మహిళల ఫొటోగ్రఫీలతో కూడిన డాక్యుమెంటు ఎవరూ చేయలేదు. అందుకే నేను ఈ మహత్తర కార్యం చేపట్టాలని అనుకున్నాను.

మహిళా దినోత్సవంనాడు...

‘మిలియన్‌ అమేజింగ్‌ ఉమెన్స్‌’ డాక్యుమెంటేషన్‌ పూర్తికావడానికి పది నుంచి పన్నెండేళ్ల సమయం పడుతుందని అంచనా. గత నెల, అంటే మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని బరోడా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఇందులో తొలి పోట్రైట్‌ ఫొటో బరోడా రాజమాత సుభాంగిని రాజేది. బ్రిటిష్‌ రాణి కంటే అతిపెద్ద కోటలో ఉండే ఆమెకు సంబంధించిన ఫొటోను తీయడం ద్వారా డాక్యుమెంటేషన్‌ ప్రారంభమైంది. ఇప్పటివరకూ 400 మందికిపైగా మహిళల ఫొటోలు, వివరాలు సేకరించాను. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలపై డాక్యుమెంటేషన్‌ సాగుతోంది. ప్రస్తుతం ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల మహిళలను కెమెరాలో బంధించే పనిలో ఉన్నాను. ఇప్పటివరకు సంప్రతించినవారిలో రోజు కూలీలు, గిరిజన మహిళలు, సామాజిక కార్యకర్తలు, కార్మికులు ఉన్నారు. అన్నీ కలిపి ‘మిలియన్‌ అమేజింగ్‌ ఉమెన్‌’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తాను. కొన్ని వీడియోలు కూడా చిత్రీకరిస్తున్నాను. ప్రతి మహిళ వెనుక ఒక విజయ గాథ ఉంటుంది. దాన్ని ఈ ప్రపంచానికి చెప్పడమే నా ఉద్దేశం. పది లక్షలమంది మహిళలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ అంటే సాధారణ విషయం కాదు. ఎన్నో వ్యయప్రయాసలు పడాలి. అందుకు సిద్ధమయ్యే ఈ అద్భుత ప్రాజెక్ట్‌ను చేపట్టాను.’’

- బూటు శ్రీనివాసరావు, విశాఖపట్నం


సంపాదించింది అంతా...

ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించాను. దీని కోసం ఇప్పటివరకూ నేను సంపాదించింది అంతా ఖర్చు చేస్తున్నాను. దీనిలో భాగంగా నా కారును ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్నాను.

ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Updated Date - May 04 , 2025 | 05:58 AM