Share News

Kitchen Tips: టీ జాలీని ఇలా శుభ్రం చేయాలి!

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:46 AM

సాధారణంగా ‘టీ’ని వడబోయడానికి స్టీల్‌ జాలీని వాడుతుంటాం. కొన్ని రోజుల తరవాత ఇది నల్లగా మారుతుంటుంది. దీనిని అలాగే వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలతో జాలీని కొత్తదానిలా మార్చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం!

Kitchen Tips: టీ జాలీని ఇలా శుభ్రం చేయాలి!

ఒక గిన్నెలో ఒక గ్లాసు వేడినీళ్లు పోయాలి. ఇందులో రెండు చెంచాల వెనిగర్‌ లేదా బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో టీ జాలీని మునిగేలా ఉంచాలి. అరగంట తరవాత స్క్రబ్బర్‌తో రుద్ది కడిగేస్తే జాలీ పూర్తిగా శుభ్రమవుతుంది.

టీ జాలీని ముందుగా నిమ్మచెక్కతో రుద్దాలి. పది నిమిషాల తరవాత పాత్రలు కడిగే లిక్విడ్‌ సోప్‌ పట్టించి తోమితే జాలీ తెల్లగా మెరుస్తుంది.

ఒక గిన్నెలో కొన్ని వేడి నీళ్లు పోయాలి. ఒక చెంచా బేకింగ్‌ పౌడర్‌, ఒక చెంచాడు పాత్రలు కడిగే లిక్విడ్‌ సోప్‌ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో జాలీని ముంచి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తరవాత బ్రష్‌తో రుద్ది కడిగితే జాలీ కొత్తదానిలా మెరుస్తుంది.


టీ వడబోసిన తరవాత వెంటనే జాలీని పంపు నీళ్ల ధార కింద పెట్టి శుభ్రం చేయాలి. దీనివల్ల జాలీ ఎక్కువకాలం మన్నుతుంది.

స్టవ్‌ను వెలిగించి బర్నర్‌ మీద జాలీని ఉంచి వేడి చేయాలి. దీనివల్ల జాలీలో ఇరుక్కున్న టీ పొడి అవశేషాలన్నీ కాలి రాలిపోతాయి. చల్లారిన తరవాత స్క్రబ్బర్‌తో రుద్ది కడిగితే జాలీ శుభ్రపడుతుంది.

ఒక గిన్నెలో రెండు చెంచాల బేకింగ్‌ పౌడర్‌ వేసి ఒక చెంచా నీళ్లు చిలకరిస్తూ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జాలీ అంతటా పట్టించాలి. టూత్‌ బ్రష్‌తో రుద్ది ఆరనివ్వాలి. తరవాత జాలీ మీద రెండు చెంచాల వెనిగర్‌ను చల్లాలి. అయిదు నిమిషాల తరవాత స్క్రబ్బర్‌తో రుద్ది కడిగేస్తే జాలీ తెల్లగా మెరుస్తుంది.


Read LatestNavya NewsandTelugu News

Updated Date - Feb 03 , 2025 | 04:46 AM