Health Research: పొట్ట కొవ్వుతో సోరియాసిస్ ముప్పు
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:02 AM
పొట్ట భాగంలో కొవ్వు పేరుకు పోవడం వలన దీర్ఘకాలిక చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని యూకే పరిశోధకులు కనుగొన్నారు.
పొట్ట భాగంలో కొవ్వు పేరుకు పోవడం వలన దీర్ఘకాలిక చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని యూకే పరిశోధకులు కనుగొన్నారు. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..పొట్ట భాగంలో కొవ్వుకూ, సోరియాసిస్‌కూ మధ్య ఎంతో దగ్గరి సంబంధం ఉందనీ, సోరియాసిస్‌కు బెల్లీ ఫ్యాట్ ఓ ప్రధాన కారణమని పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఇందుకోసం నడుము, కటి నిష్పత్తి, పొత్తికడుపు కొవ్వు నిష్పత్తి, నడుము చుట్టుకొలత, పొట్ట చుట్టూరా ఉన్న మొత్తం కొవ్వు కణజాలాలతో పాటు శరీరంలోని 25 వేర్వేరు శరీరావయవాల్లోని కొవ్వు పరిమాణాలను పరిశీలించారు. ప్రత్యేకించి నడుము చుట్టూరా కొవ్వు ఎక్కువగా ఉన్న వారికీ సోరియాసి్‌సకూ దగ్గరి సంబంధం ఉన్నట్టు ఈ ప్రయోగం ద్వారా పరిశోధకులు కనిపెట్టారు. సోరియాసిస్‌కు జన్యు మూలాలు కూడా లేకపోలేదు. అయినప్పటికీ పొట్ట దగ్గర కొవ్వు కలిగిన వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటోంది. మరీ ముఖ్యంగా మహిళలకు ఈ ముప్పు మరింత ఎక్కువ. అలాగే బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా ఊబకాయం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయగలుగుతున్నప్పటికీ, దీని ద్వారా సోరియాసిస్ ముప్పును కచ్చితంగా అంచనా వేయలేమని కూడా పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే సోరియాసిస్ ముప్పు విషయంలో, శరీరంలో కొవ్వు పేరుకున్న ప్రదేశం కీలకంగా మారుతుందనీ, నడుము చుట్టూరా పేరుకున్న కొవ్వు సోరియాసిస్ ముప్పును పెంచుతుందని తామీ ప్రయోగం ద్వారా కనిపెట్టినట్టు పరిశోధకులు పేర్కొంటున్నారు.