Share News

నిజంగానే చిత్రం

ABN , Publish Date - May 02 , 2025 | 03:49 AM

ఒక మహారాజుకు తన పడకగది గోడపైన హిమాలయ శిఖరాల దృశ్యం ఉంటే బాగుంటుందని అనిపించింది. తక్షణం తన రాజ్యంలోని ప్రముఖ చిత్రకారుణ్ణి పిలిపించాడు. ‘‘నా పడక గది గోడ మీద హిమాలయ శిఖరాల ఆకృతిని...

నిజంగానే చిత్రం

సద్బోధ

ఒక మహారాజుకు తన పడకగది గోడపైన హిమాలయ శిఖరాల దృశ్యం ఉంటే బాగుంటుందని అనిపించింది. తక్షణం తన రాజ్యంలోని ప్రముఖ చిత్రకారుణ్ణి పిలిపించాడు. ‘‘నా పడక గది గోడ మీద హిమాలయ శిఖరాల ఆకృతిని చూడముచ్చటగా, రంగులతో తీర్చిదిద్దాలని కోరాడు. స్వయంగా తీసుకువెళ్ళి ఆ గోడను చూపించాడు. అప్పుడు ఆ చిత్రకారుడు మహారాజా! మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. కానీ నాకు కొంత గడువు ఇవ్వండి. మా ఇంటి గోడ మీద ఆ చిత్రాన్ని సిద్ధం చేస్తాను. మీరు దాన్ని చూసి మార్పులు, చేర్పులు ఏవైనా సూచించండి. ఆ ప్రకారం మీ పడక గది గోడ మీద... సరైన రంగులను వినియోగించి ఆ దృశ్యాన్ని తీర్చిదిద్దుతాను’’ అన్నాడు. అందుకు రాజు అంగీకరించాడు. చిత్రకారుడికి కొంత డబ్బు ఇచ్చి పంపించాడు.


ఆ తరువాత రెండేళ్ళు దాటాయి, మూడేళ్ళు గడిచాయి. చిత్రకారుడి జాడ లేదు. ఆ చిత్రాన్ని గురించి ఆలోచనలు రాజును వెంటాడుతున్నాయి. ఒక రోజు చిత్రకారుడు రాజ భవనానికి వచ్చాడు. ‘‘మహారాజా! చిత్రాన్ని సిద్ధం చేశాను. తమరు మా ఇంటికి వచ్చి, ఆ చిత్రాన్ని చూడాలని విన్నవించుకుంటున్నాను’’ అన్నాడు. వెంటనే రాజు అతనితో బయలుదేరి వెళ్ళాడు. చిత్రకారుడి ఇంటి గోడ మీద ఉన్న చిత్రాన్ని పరిశీలించాడు. అద్భుతం! తను ఊహించినదానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది. గతంలో రాజు అనేకసార్లు హిమాలయాలకు వెళ్ళాడు. ఆ అందమైన పర్వత శిఖరాలను ప్రత్యక్షంగా చూసి పరవశించిపోయాడు. చిత్రకారుడు తీర్చిదిద్దిన ఆ చిత్రంలోని శిఖరాల అందం అతణ్ణి ఏకంగా ఉన్నత లోకాల్లోకి తీసుకుపోతోంది. రాజుకు నోట మాట రాలేదు. కొయ్యబొమ్మలా అలాగే నిలబడిపోయాడు. కొద్దిసేపటి తరువాత తేరుకొని, ఆ చిత్రకారుడితో ‘‘నేను ఎన్నోసార్లు హిమాలయాలకు వెళ్ళి వచ్చాను. కానీ ఆ పర్వతం చుట్టూ తిరుగుతూ, తిరుగుతూ పైకి వెళ్ళే ఈ బాట ఎక్కడా కనబడలేదే? ఈ ఆలోచన నీకు ఎలా తట్టింది? ఈ బాట ఎక్కడినుంచి ఎక్కడకు వెళుతుంది?’’ అని అడిగాడు.

అప్పుడు చిత్రకారుడు ‘‘ఏమో మహారాజా! నాకూ తెలీదు. చూసి వచ్చి చెబుతాను, ఉండండి’’ అని ఆ చిత్రపటంలోని బాట ఎక్కి నడిచి, పర్వత శిఖరానికి వెనుకగా వెళ్ళి అదృశ్యమైపోయాడు.

రాచమడుగు శ్రీనివాసులు


తావో మత గ్రంథాల్లో ఉన్న ఈ కథను ఓషో వివరిస్తూ ‘‘ఇది నమ్మశక్యం కాని వింతైన కథ. మార్మికమైన కథ. ఒక చిత్రపటంలోకి చిత్రకారుడు నడిచి వెళ్ళడం ఏమిటి? అదృశ్యుడై, తిరిగి రాకపోవడం ఏమిటి? ఇది కల్పిత కథే. కానీ నిగూఢమైన సత్యాన్ని తెలిపే కథ. ఒక చిత్రకారుడు తాను గీస్తున్న చిత్రంలో నిమగ్నమైతే... ఆ చిత్రానికి అందం వస్తుంది. ఒక కవి తను రాస్తున్న కవిత్వంలో పూర్తిగా లీనమైతే అది దివ్య గీతంగా భావిస్తుంది. అప్పుడు వారికి తమ సృష్టి విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవు. భక్తి విషయం కూడా అంతే. దేవుడి విషయం కూడా అంతే. భగవంతుడి భక్తిలో పూర్తిగా నిమగ్నమైనవారు, దేవుడికి సాధ్యం కానిది ఏదీ లేదని భావించేవారు... ఆ సర్వాంతర్యామితో అనుసంధానం అవుతారు. వారికి దేవుడి ఉనికి పట్ల ఎలాంటి అనుమానం ఉండదు. ‘నేను’ అనే భావన తొలగిపోతుంది. వారిలో దైవం ప్రకాశిస్తుంది’’ అని చెప్పారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 03:53 AM