పిల్లలు మొండికేస్తున్నారా?
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:21 AM
తల్లిదండ్రుల పెంపకం ఆధారంగానే పిల్లల స్వభావం రూపుదిద్దుకుంటుంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లలు మొండిగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు...

పేరెంటింగ్
తల్లిదండ్రుల పెంపకం ఆధారంగానే పిల్లల స్వభావం రూపుదిద్దుకుంటుంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లలు మొండిగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో మొండితనం పెరగకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు పిల్లలు రకరకాల పనులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వాటిని గమనించి పిల్లలను ఉత్సాహపరచాలి. ఇంకా బాగా చేయమని ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అదే తల్లిదండ్రులు చూసీ చూడనట్లు ఊరుకున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా పిల్లలు నిరుత్సాహంతో మొండిగా మారతారు.
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. కాని ఇతరుల ముందు ఆ తప్పును ఎత్తి చూపడం లేదా తిట్టడం చేస్తే పిల్లల మనసులో ప్రతికూల ఆలోచనలు ఏర్పడతాయి. పిల్లలు చేసే పొరబాట్ల గురించి వారితోనే వ్యక్తిగతంగా మాట్లాడాలి. కఠినంగా కాకుండా మెల్లగా వివరించి చెప్పాలి.
ఏ పని చేసినా తల్లిదండ్రులు విమర్శిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే పిల్లలు మొండిగా వ్యవహరించడం మొదలుపెడతారు. కాబట్టి పిల్లలు చేసే పనులను గమనిస్తూ వాళ్లకి సరైన సలహాలు ఇవ్వడం మంచిది.
పిల్లలకు ఏదైనా పనిని అప్పజెప్పినప్పుడు వాళ్లు దాన్ని పూర్తిచేసేవరకూ తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. పని మధ్యలో జోక్యం చేసుకోవడం, దిద్దుబాటు చర్యలు, ఇది కూడా తెలీదా అంటూ విమర్శించడం చేయకూడదు. వీటివల్ల పిల్లల్లో ఆసక్తి తగ్గుతుంది. తల్లిదండ్రులపై విముఖత భావం ఏర్పడి మొండిగా మారతారు.
పిల్లలు ఏ చిన్న సహాయం చేసినా తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇదే పద్ధతిని పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు.
తల్లిదండ్రుల ప్రవర్తనను పిల్లలు గమనిస్తూ అనుసరిస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు క్రమశిక్షణతో మెలగుతూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటే పిల్లలు కూడా మొండితనానికి పోకుండా చక్కని వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijaysai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ.. సంచలన విషయాలు వెల్లడి..
journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..