Share News

Muslims Moral Story: ఆ దారిలో అంతా శుభమే

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:19 AM

పూర్వం ఒక గ్రామంలో సామాన్యుడైన యువకుడు ఉండేవాడు. అతను రోజూ అయిదు పూటలా నమాజు చేసేవాడు. దివ్య ఖుర్‌ఆన్‌ పఠించేవాడు. తనకు ఉన్నదానిలో పేదలకు దానం చేసేవాడు. సమీపంలో...

Muslims Moral Story: ఆ దారిలో అంతా శుభమే

సందేశం

పూర్వం ఒక గ్రామంలో సామాన్యుడైన యువకుడు ఉండేవాడు. అతను రోజూ అయిదు పూటలా నమాజు చేసేవాడు. దివ్య ఖుర్‌ఆన్‌ పఠించేవాడు. తనకు ఉన్నదానిలో పేదలకు దానం చేసేవాడు. సమీపంలో ఉన్న పట్టణానికి పండ్లు తీసుకువెళ్ళి విక్రయిస్తూ జీవించేవాడు.

ఒక రోజు అతని దగ్గరకు ఒక సాధువు వచ్చాడు. పండ్లు తీసుకొని డబ్బు ఇవ్వబోయాడు. కానీ ఆ సాధువు ఎంత చెప్పినా డబ్బు తీసుకోవడానికి ఆ యువకుడు నిరాకరించాడు. ‘‘మీరు నా కోసం ప్రార్థన చేయండి. నా వ్యాపారం బాగా వృద్ధి చెందాలని అల్లా్‌హను ప్రార్థించండి’’ అని కోరాడు. ఆ సాధువు సరేనంటూ ముందుకు సాగిపోయాడు. కొన్నాళ్ళలో ఆ యువకుడి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. దానితో అతనిలో ఆశ పెరిగింది. డబ్బే లోకం అయిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు నమాజ్‌ చేసేవాడు. ఖుర్‌ఆన్‌ చదవడం క్రమంగా మానేశాడు. ఎవరైనా పేదలు దానం అడిగితే కోపగించేవాడు. బంధు మిత్రులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు. పగలూ, రాత్రీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలనే ఆశ, డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్ప మరేదీ ఉండేది కాదు.

అతణ్ణి పూర్వం కలిసిన సాధువు... కొన్నేళ్ళ తరువాత ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ చాలా పెద్ద దుకాణం కనిపించింది. పండ్లు కొనడానికి లోపలికి వెళ్ళి చూస్తే... ఆ యువకుడు కనిపించాడు. కానీ ఈసారి అతనిలో మార్పు ఆ సాధువుకు స్పష్టంగా కనిపించింది. అతను కుర్చీ లోంచి లేవలేదు. సాధువుకు సలాం చేయలేదు. గుర్తు పట్టనట్టు ఉండిపోయాడు. ఆ సాధువే అతణ్ణి సమీపించి ‘‘ఏం నాయనా! బాగున్నావా?’’ అని అడిగాడు. ‘‘నేను బాగానే ఉన్నాను. మీకు ఏం కావాలో చెప్పండి’’ అని ఆ యువకుడు కసురుకున్నాడు. ఆ సాధువు ఆశ్చర్యపడ్డాడు. కొన్ని పండ్లు తీసుకొని, డబ్బు ఇచ్చాడు. అక్కడినుంచి వెళ్ళిపోతూ ‘‘నాయనా! వ్యాపారంలో నీకు శుభం కలగాలని, నీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని అన్నాడు. ఆ యువకుడు కుర్చీలోంచి లేచి ‘‘మీ ప్రార్థనలు నాకు అవసరం లేదు. ఇదంతా నా కష్టంతో సంపాదించింది. మీరు ఇక్కడినుంచి వెళ్ళిపోండి ’’అంటూ దుకాణం నుంచి తరిమేశాడు. కొద్ది రోజులలో అతని వ్యాపారం దెబ్బతింది. నష్టాల్లో కూరుకుపోయాడు. ఆరోగ్యం క్షీణించింది. అతని ధోరణి భరించలేక భార్య తమ పిల్లలతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అతని జీవితం చిందరవందరైపోయింది.


ఆ సాధువు ఒకరోజు ఆ మార్గంలోంచి వెళ్తూండగా... ఒక చెట్టు కింద చిన్న బండిలో పండ్లు అమ్ముకుంటూ ఆ యువకుడు కనిపించాడు. సాధువు అతని దగ్గరకు వెళ్ళి పలకరించాడు. ఆ యువకుడు ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు ఆ సాధువు ‘‘నాయనా! మనం కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా అల్లా్‌హను గుర్తు చేసుకోవాలి. నమాజ్‌ క్రమం తప్పకుండా చేయాలి. పేదలకు దానధర్మాలు చేయాలి. నిత్యం దివ్య ఖుర్‌ఆన్‌ చదవాలి. ఇరుగుపొరుగువారిని, బంధువులను, మిత్రులను మరచిపోకూడదు’’ అని బోధించాడు. తన ప్రస్తుత స్థితికి కారణం తను చేసిన పొరపాట్లేనని ఆ యువకుడికి అర్థమయింది. అతను పశ్చాత్తాపం చెందాడు. సాధువును క్షమించాలని కోరాడు, అల్లా్‌హకు క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆ సాధువు కొంత డబ్బును ఆ యువకుడి చేతిలో పెట్టి... ‘‘అల్లాహ్‌ చూపిన మార్గంలో చిత్తశుద్ధితో నడిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఈ డబ్బుతో, అల్లాహ్‌ పేరుతో మంచి వ్యాపారం మొదలు పెట్టు’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో నమాజ్‌ సమయమయిందనే పిలుపు వినిపించడంతో... భక్తిపూరితమైన మనసుతో ఆ యువకుడు మసీదు వైపు నడిచాడు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 03:20 AM